ఆ విషయంలో ఉన్న ఆసక్తి కరోనాపై సర్కారుకు లేదే: విజయశాంతి

ABN , First Publish Date - 2021-05-05T22:48:34+05:30 IST

అవినీతి అంటూ చూపిస్తున్న ఆసక్తి కరోనా కట్టడిలో రాష్ట్రప్రభుత్వం ఎందుకు చూపించడం లేదని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. కరోన కట్టడిలో సర్కార్..

ఆ విషయంలో ఉన్న ఆసక్తి కరోనాపై సర్కారుకు లేదే: విజయశాంతి

హైదరాబాద్: అవినీతి అంటూ చూపిస్తున్న ఆసక్తి కరోనా కట్టడిలో రాష్ట్రప్రభుత్వం ఎందుకు చూపించడం లేదని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. కరోన కట్టడిలో సర్కార్ అలసత్వాన్ని ఏకంగా హై కోర్టు మందలించిన మార్పు రాలేదని కానీ తాజా పరిణామాల్లో మాత్రం ఆయన ఉరుకులు పరుగులతో దర్యాప్తు చేయడం ఏంటని నిలదీశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పొట్ట చేశారు. ఆ ట్వీట్ లో  'రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు... తాను అనుకున్నది నెరవేర్చుకోవడానికి కేసీఆర్ గారు విజిలెన్స్, ఏసీబీ, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు సహా సమస్త అధికార గణాన్నీ ఉరుకులు పెట్టించి దర్యాప్తు చేయించి నివేదికలు రప్పించారు. ఆ పని కోసం రికార్డుల తనిఖీలు, బాధితులను విచారించడం లాంటి పనులు చకచకా జరిగిపోయాయి. అవినీతిని సహించేది లేదన్నట్టుగా చూపిన అదే శ్రద్ధ, ఆ పట్టుదల కోవిడ్ కట్టడి విషయంలో ఎందుకు లేదు? గత కొద్ది రోజులుగా తెలంగాణలో కోవిడ్ కట్టడికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు మందలిస్తూనే ఉంది.


మొదటి విషయంలో చూపించిన అమితమైన ఆసక్తి, ఉత్సాహాలను ప్రజారోగ్యం విషయంలో ఎందుకు కనిపించడం లేదు? కరోనా కేసుల నియంత్రణ విషయంలో న్యాయస్థానం వేసిన అక్షింతలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడిన చందంగా ఉందే తప్ప ఏ మాత్రం పట్టింపులేదు. ప్రజల పట్ల ఈ సర్కారుకు ఉన్న చిత్తశుద్ధి ఏమిటన్నది ఎన్ని మార్లు రుజువవుతున్నా అడిగే నాథుడు లేడనే గర్వంతో మిడిసిపడుతున్నారు. ఈ పరిణామాలను ప్రజలు చూస్తూనే ఉన్నారు' అని పేర్కొన్నారు.



Updated Date - 2021-05-05T22:48:34+05:30 IST