రుణమాఫీ, రాయితీలు శాశ్వత పరిష్కారాలు కావు

ABN , First Publish Date - 2021-01-20T08:12:00+05:30 IST

రుణమాఫీ, రాయితీలు వంటివి రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారాలుకావని, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు దీర్ఘకాల, స్వల్పకాల విధానాలను రూపొందించేలా

రుణమాఫీ, రాయితీలు శాశ్వత పరిష్కారాలు కావు

రైతుల ఆదాయం పెంపునకు దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యూహాలు ఉండాలి..

మేధోవలసలను తగ్గించి సాగువైపు యువతను ప్రోత్సహించాలి

వ్యవసాయదారులను వ్యవసాయ వ్యాపారవేత్తలుగా తయారుచేయాలి

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు


హైదరాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): రుణమాఫీ, రాయితీలు వంటివి రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారాలుకావని, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు దీర్ఘకాల, స్వల్పకాల విధానాలను రూపొందించేలా ముందడుగు పడాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ-మార్కెటింగ్‌, శీతల గిడ్డంగులు, నిరంతర విద్యుత్తు సరఫరా, సరైన సమయానికి సరిపడా రుణాలు అందించడం లాంటివి అన్నదాత స్థయిర్యాన్ని, ఆహార ఉత్పత్తిని, వ్యవసాయ రంగంపై యువత ఆసక్తిని పెంపొందించే దిశగా తోడ్పడతాయని పేర్కొన్నారు. మన దేశం నుంచి వ్యవసాయ మేధోవలసను తగ్గించడం ద్వారా యువతరాన్ని వ్యవసాయంవైపు మళ్లించి.. ఓ గౌరవప్రదమైన వృత్తిగా వ్యవసాయాన్ని స్వీకరించేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.


సాంకేతికత ఆధారిత వ్యవసాయ పద్థతులను అనుసరించే వ్యవసాయదారుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందన్నారు. ‘2030 దిశగా భారతీయ వ్యవసాయం’ అనే అంశమ్మీద కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ, నీతి ఆయోగ్‌, ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాతీయ చర్చను మంగళవారం హైదరాబాద్‌ నుంచి అంతర్జాల వేదిక ద్వారా వెంకయ్య ప్రారంభించారు. అనంతరం ఆయన  ప్రసంగించారు. సామాజిక-ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు, వ్యవసాయ ఉత్పాదక ధరల్లో పెరుగుదల, పెట్టుబడికి తగిన ఆదాయం లేకపోవడం లాంటి కారణాలతోనే యువత ఈ రంగానికి దూరమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో మార్పులు తీసుకొచ్చి.. పరిశోధనల ఫలం క్షేత్రస్థాయికి చేరేలా చొరవతీసుకోవడం, వ్యవసాయం-పరిశ్రమ మధ్య అనుసంధానాన్ని పెంచడం ద్వారా వ్యవసాయదారులను వ్యవసాయ పారిశ్రామిక వేత్తలుగా మార్చే దిశగా మరింత కృషిచేయాలని సూచించారు. రైతన్నల సంక్షేమంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ‘టీమ్‌ ఇండియా’గా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సి ఉందన్నారు. వాతావరణ మార్పుల ప్రభావం నుంచి వ్యవసాయరంగాన్ని కాపాడుకునే దిశగా మరిన్ని పరిశోధనలను జరగాల్సిన అవసరం ఉందన్నారు.


మహిళా రైతుల సంక్షేమంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రయోగాలు, పరిశోధనల ఫలితాలను రైతులకు అందజేయడంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు కృషిచేయాలని సూచించారు. వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ విద్యావేత్తలు, విధాన నిర్ణేతలు, పౌరసమాజం ప్రతినిధులు, అన్నదాతలు పాల్గొనే.. ఈ మూడు రోజుల సదస్సులో భారత వ్యవసాయ రంగ పురోగతిపై కీలకమైన, సానుకూల చర్చ జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-01-20T08:12:00+05:30 IST