నేడో, రేపో కేయూ వీసీ నియామకం
ABN , First Publish Date - 2021-05-21T06:35:47+05:30 IST
నేడో, రేపో కేయూ వీసీ నియామకం

రాష్ట్ర గవర్నర్ వద్ద దస్త్రం
కేయూ క్యాంపస్, మే 20 : కాకతీయ యూనివర్సిటీకి కొత్త వైస్‌చాన్స్‌లర్ నియామక దస్త్రం సీఎం కార్యాలయం నుంచి వర్సిటీల ఛాన్స్‌లర్ తమిళసై సౌందర్యరాజన్‌కు చేరినట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే నేడో, రేపో కేయూకు కొత్త వీసీ వచ్చే అవకాశాలున్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలోని వర్సిటీల వైస్‌చాన్స్‌లర్ల నియామకంపై సెర్చ్‌కమిటీలను నియమించి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఒక్కో వర్సిటీకి ముగ్గురి పేర్లను సిఫార్సు చేసింది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ, మునిసిపల్ ఎన్నికల కోడ్‌తో పాటు కరోనా నేపఽథ్యంలో ప్రభుత్వం వీసీల నియామక ప్రక్రియను నిలిపివేసింది. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌తో పాటు ఇతర సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమించడంతో పాటు రెండు రోజులుగా వర్సిటీల వీసీలను కుడా నియమించనున్నట్లు ప్రచారం సాగుతోంది. వర్సిటీకి ఎవరు వీసీగా వస్తారు.. అలాగే వర్సిటీ నుంచి ఎవరెవరు వీసీలుగా నియమితులు కానున్నారనే విషయంపై వర్సిటీలో విస్తృత చర్చ జరుగుతోంది.