సీఎం రాకకు ముస్తాబైన వాసాలమర్రి

ABN , First Publish Date - 2021-06-22T07:52:11+05:30 IST

సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి.. ముఖ్యమంత్రి రాకకోసం ముస్తాబవుతోంది.

సీఎం రాకకు ముస్తాబైన వాసాలమర్రి

దత్తత గ్రామంలో  నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన

యాదాద్రి, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి.. ముఖ్యమంత్రి రాకకోసం ముస్తాబవుతోంది. మంగళవారం ఈ గ్రామంలో సీఎం పర్యటించనున్న నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్‌ స్వయంగా గ్రామ సర్పంచ్‌ ఆంజనేయులుకు ఫోన్‌లో చేసిన సూచనల మేరకు ఏర్పాట్లు చేయడంలో మూడు రోజులుగా జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన మౌలిక సదుపాయాల కల్పన, విద్య, ఉపాధి, వైద్యంతోపాటు ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా జీవన ప్రమాణాలను మెరుగు పరచడానికి ఆయా శాఖల అధికారులు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేశారు.


ఈ నివేదికల ఆధారంగా గ్రామంలో ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, ఉపాధి, సంక్షేమ పథకాలు, నిధుల కేటాయింపును గ్రామసభలో సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించనున్నారు.  మంగళవారం ఉదయం 12.30గంటలకు సీఎం కేసీఆర్‌ నేరుగా భోజనశాలకు చేరుకుని గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. అనంతరం సర్పంచ్‌ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులతో కొద్దిసేపు మాట్లాడతారు. అక్కడి నుంచి గ్రామసభకు చేరుకుని సమస్యలు, చేపట్టాల్సిన ప్రాజెక్టు వివరాలను గ్రామస్థులతో చర్చించనున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, సీఎం పర్యటన ఏర్పాట్లను విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పథి, ఇతర అధికారులు సోమవారం పరిశీలించారు. 

Updated Date - 2021-06-22T07:52:11+05:30 IST