నిమ్మగడ్డను ఎలా నిందితుడిగా చేరుస్తారు?
ABN , First Publish Date - 2021-11-30T09:04:42+05:30 IST
జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా తమకు భారీ లాభాలు వచ్చాయని.. ఆ విషయాన్ని సీబీఐ తొక్కిపెట్టిందని వాన్‌పిక్ ప్రాజెక్టు, నిమ్మగడ్డ ప్రసాద్ ఆరోపించారు.
జగన్ అక్రమాస్తుల కేసుల్లో వాన్‌పిక్, నిమ్మగడ్డ ప్రసాద్ వాదనలు
హైదరాబాద్, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా తమకు భారీ లాభాలు వచ్చాయని.. ఆ విషయాన్ని సీబీఐ తొక్కిపెట్టిందని వాన్‌పిక్ ప్రాజెక్టు, నిమ్మగడ్డ ప్రసాద్ ఆరోపించారు. పెట్టుబడులు, ఇతర ఏ నిర్ణయాలనైనా కంపెనీ తీసుకుంటుందని, చైర్మన్‌గా నిమ్మగడ్డ ఆ నిర్ణయాలను అమలు చేశారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఆయన్ను ఎలా నిందితుడిగా చేరుస్తారని ప్రశ్నించారు. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో తమపై సీబీఐ నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ వాన్‌పిక్, నిమ్మగడ్డ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. వీటిపై జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం సోమవారం విచారణ కొనసాగించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా పడింది.