డ్రైవర్‌ను తాళ్లతో కట్టేసి.. వాతలు

ABN , First Publish Date - 2021-08-20T09:42:12+05:30 IST

తన వద్ద డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తిని యజమాని కిడ్నాప్‌ చేశాడు. తనపై అనుమానంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేస్తుందేమోన్న భయంతో ఆమెను, కూతురును, నెల వయసున్న

డ్రైవర్‌ను తాళ్లతో కట్టేసి.. వాతలు

కిడ్నాప్‌ చేసి మరీ యజమాని దాష్టీకం 

ఫిర్యాదు చేస్తుందేమోనన్న భయంతో బాధితుడి భార్యనూ  కిడ్నాప్‌ చేసిన వైనం 


వనపర్తి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): తన వద్ద డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తిని యజమాని కిడ్నాప్‌ చేశాడు. తనపై అనుమానంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేస్తుందేమోన్న భయంతో ఆమెను, కూతురును, నెల వయసున్న బాబునూ కిడ్నాప్‌ చేశాడు. డ్రైవర్‌ను తాళ్లతో కట్టేసి..  వాతలు పెట్టాడు. వారం పాటు అతడిని నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశాడు. నిందితుడు వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం సంపట్‌రావుపల్లికి చెందిన మేకల చంద్రయ్య. సీఐ ప్రవీణ్‌ కుమార్‌ కేసు వివరాలను వెల్లడించారు. చంద్రయ్య, హైదరాబాద్‌లో వాటర్‌ ట్యాంకర్‌తో హైటక్‌సిటీ, మాదాపూర్‌లోని వివిధ కంపెనీలకు నీళ్లను సరఫరా చేస్తుంటాడు. ఒక్కొ ట్రిప్పునకు రూ.3వేల చొప్పున తీసుకుంటాడు. రోజుకు 30 దాకా ట్రిప్పులు నడుపుతాడు. చంద్రయ్య వద్ద అల్మాస్‌గూడకు చెందిన శ్రీకాంతచారి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరి మధ్య రూ.85 లక్షల నుంచి రూ. 88 లక్షల మేర డబ్బుకు సంబంధించి గొడవలున్నాయి.


చంద్రయ్యకు చెందిన డబ్బును శ్రీకాంతచారి ఇవ్వడం లేదు. దీంతో ఈ నెల 11న ఎల్బీనగర్‌లోని ఓ హోటల్‌లో శ్రీకాంతచారి టిఫిన్‌ చేస్తుండగా డబ్బుల విషయం మాట్లాడుకుందామని సంపట్‌రావుపల్లికి తీసుకువచ్చాడు. మరుసటి రోజే శ్రీకాంతచారి భార్య అనితను, కుమార్తె శివాణిని, నెలరోజుల కుమారుడు వెంకటే్‌షను కిడ్నాప్‌ చేశాడు. శ్రీకాంతచారిని హింసిస్తుండగా బుధవారం గ్రామంలోని కొందరు గుర్తించి 100కు డయల్‌ చేశారు. ఎస్‌ఐ రాము అక్కడికి చేరుకునేలోపు నిందితులు పరారయ్యారు. బాధితుడి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసి ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఇద్దరి మధ్య గొడవ.. నీళ్ల ట్యాంకర్‌ డబ్బుల విషయంగా బయటకు కనిపిస్తున్నప్పటికీ. అది కాదని గ్రామస్థులు అంటున్నారు. వనపర్తి, కొల్లాపూర్‌ నియోజకవర్గాల్లోని కొందరి వద్ద నుంచి హైదరాబాద్‌లో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి రూ. 2 లక్షల చొప్పున వసూలు చేశారని అంటున్నారు.  ఆ డబ్బును శ్రీకాంతచారి తన దగ్గరే పెట్టుకున్నాడని అంటున్నారు. డబ్బులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి రావడంతో  శ్రీకాంతచారిని చంద్రయ్య కిడ్నాప్‌ చేసి చిత్రహింసలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. 

Updated Date - 2021-08-20T09:42:12+05:30 IST