అర్ధరాత్రి అకాల వర్షం
ABN , First Publish Date - 2021-05-21T06:33:55+05:30 IST
అర్ధరాత్రి అకాల వర్షం

మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
జనగామ మార్కెట్ యార్డులో నానిన వడ్లు
జనగామ టౌన్, మే 20 : అకాలవర్షం ఆగమాగం చేసింది. బుధవారం అర్ధరాత్రి దాటాక కురిసిన వాన రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జనగామ జిల్లాలోని ఐకేపీ కేంద్రాల్లో ఎండబోసిన ధాన్యం, రాశులుగా పోసినవడ్లు, నింపిన బస్తాలు తడిశాయి. జిల్లా వ్యాప్తంగా యార్డులు, ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో దాదాపు 25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పేరుకుపోయి ఉండగా, అకస్మాత్తుగా కురిన అకాల వర్షం రైతన్నలకు కన్నీటి ధారలను మిగిల్చింది. జనగామ, లింగాలఘణపురం, దేవరుప్పుల, కొడకండ్ల, స్టేషన్‌ఘన్‌పూర్, బచ్చన్నపేట, రఘునాథపల్లి మండలాల్లో బీభత్సం సృష్టించింది.
జనగామ మార్కెట్ యార్డులో
తడిసిన 10 వేల క్వింటాళ్ల ధాన్యం..
జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో దాదా పు 25 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని రైతులు తీసుకు వచ్చారు. ఇందులో అకాల వర్షంతో దాదాపు 10 వేల క్వింటాళ్ల వడ్లు నీటిలో నానాయి. కాటన్ యార్డులో రైతుల ధాన్యం రాసుల నుంచి 200 క్వింటాళ్ల వరకు వరదపాలు కావడంతో రైతులు విలపిస్తున్నారు. గన్నీబ్యాగుల కొరత, కొనుగోళ్ల జాప్యంతో పాటు బస్తాలు లిఫ్టింగ్‌కాని పరిస్థితిలో వేలాది క్వింటాళ్ల ధాన్యం నిల్వఉంది. ఈ క్రమంలో అర్ధరాత్రి కురిన అకాల వానతో దాదాపు 10వేల క్వింటాల వరకు ధాన్యం నీటిపాలైంది. యార్డులో కృష్ణ, మంగమ్మ, లక్ష్మి, రాజయ్య అనే రైతులకు చెందిన సుమారు 200 క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దయింది.
పెంబర్తి, సిద్దెంకి, పెద్దపహాడ్, వెంకిర్యాల, ఎర్రగొల్లపహాడ్, ఓబుల్‌కేశ్వాపూర్, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవగా, ఆరెబెట్టుకునేందుకు రైతులు పడరాని పాట్లుపడ్డారు. వడ్లకొండ తండా బానోతు రమ అనే మహిళా రైతు మాట్లాడుతూ వారం రోజులుగా ధాన్యం అమ్మకాలు లేక యార్డులో ఉన్నామని, కళ్ల ముందే వరద నీటిలో క్వింటాళ్ల కొద్ది ధాన్యం కొట్టుకుపోయిందని రోదించింది. గానుగుపహాడ్‌కు చెందిన లక్ష్మి వడ్లు నీటిపాలు కావడం పట్ల ఆవేదన వ్యక్తం చేసింది. మార్కెట్ యార్డులో చైర్ పర్సన్ బాల్దె విజయ సిద్దిలింగం గురువారం పరిస్థితిని పరిశీలించారు. ధాన్యం తడిసినా మద్దతు ధరకు కొనుగోళ్లు జరుగుతాయని, రైతులు అధైర్యపడవద్దని ఆయన కోరారు.