1213 కేంద్రాల్లో టీకాలు
ABN , First Publish Date - 2021-01-12T08:26:20+05:30 IST
కరోనా వ్యాక్సిన్‌ను రాష్ట్ర వ్యాప్తంగా 1,213 కేంద్రాల్లో ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్ల్లు జరిగాయని, వ్యాక్సిన్‌ను నిల్వ చేసేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 866 కోల్డ్ చైన్ పాయింట్లను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు

వ్యాక్సిన్ నిల్వకు 866 కోల్డ్ చైన్ పాయింట్లు
ముందుగా ఫ్రంట్‌లైన్ వర్కర్లకు..
అనంతరం వివిధ వర్గాలకు ప్రాధాన్య క్రమంలో
టీకా వికటిస్తే వెంటనే వైద్య చికిత్సకు ఏర్పాట్లు
ప్రజాప్రతినిధులంతా భాగస్వాములు కావాలి
చిన్న సంఘటన జరిగినా బద్నాం అవుతాం
తేలిగ్గా తీసుకోకుండా అప్రమత్తంగా ఉండండి
మంత్రులు, కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్
హైదరాబాద్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాక్సిన్‌ను రాష్ట్ర వ్యాప్తంగా 1,213 కేంద్రాల్లో ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్ల్లు జరిగాయని, వ్యాక్సిన్‌ను నిల్వ చేసేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 866 కోల్డ్ చైన్ పాయింట్లను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. వ్యాక్సినేషన్లో పాల్గొనేందుకు అన్ని స్థాయిల్లో వలంటీర్లు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని కమిటీ పర్యవేక్షిస్తుందని, జిల్లా, మండల స్థాయిలో టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటయ్యాయని తెలిపారు. వ్యాక్సినేషన్‌పై సోమవారం మంత్రులు, కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం పాల్గొన్నారు.
ఈ రెండు సందర్భాల్లో టీకాకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. సీరం రూపొందించిన కొవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ సమర్థవంతమైన వ్యాక్సిన్లుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వీటినే రాష్ట్రంలో అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ముందుగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ, ఆరోగ్య సిబ్బందికి, ఆ తర్వాత కొవిడ్ వ్యాప్తి నివారణలో ముందుండి పోరాడుతున్న పోలీసులు, భద్రతా బలగాలు, పారిశుధ్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. అనంతరం 50 ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి అందించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
టీకా సెంటర్‌కు తీసుకొచ్చే బాధ్యత వారిదే
ప్రాధాన్యతా క్రమంలో నిర్ణయించిన వారిని వ్యాక్సినేషన్ సెంటర్‌కు తీసుకొచ్చే బాధ్యతను సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు తీసుకోవాలని, పోలీసులు, ఇతర భద్రతా బలగాలకు వ్యాక్సిన్ వేయించే బాధ్యతను పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్/స్టేషన్ హౌస్ ఆఫీసర్ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వ్యాక్సిన్ వేసిన తర్వాత ఎవరికైనా రియాక్షన్ అయితే వెంటనే చికిత్సకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వ్యాక్సినేషన్ కేంద్రానికి అనుబంధంగా ఒక గదిని, వైద్యులను, అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని, వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియలో కూడా కొవిడ్ నిబంధనల్ని కచ్చితంగా పాటించాలన్నారు.
వ్యాక్సినేషన్‌ను తేలిగ్గా తీసుకోవద్దని, ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు భాగస్వాములు కావాలని సీఎం ఆదేశించారు. ‘‘టీకాలు వేసే సమయంలో చిన్న సంఘటన కూడా జరగొద్దు. టీకా వికటించి ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే వారికి వైద్యం అందించడంతోపాటు అవసరమైతే ఆస్పత్రికి తీసుకెళ్లండి. ఆ బాధ్యతను కూడా ప్రజాప్రతినిధులు స్వయంగా పర్యవేక్షించాలి. టీకా వికటించి జరగరానిది ఏదైనా జరిగితే ప్రభుత్వం బద్నాం అవుతుంది. సర్కారు ఫెయిలైందన్న అపప్రద మూటగట్టుకోవాల్సి వస్తుంది’’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. కాగా టీకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారా? లేదా? అన్న విషయంపై స్పష్టత రాలేదని అధికారులు చెబుతున్నారు.