డిసెంబరుకు అందరికీ టీకా!
ABN , First Publish Date - 2021-11-26T09:33:55+05:30 IST
డిసెంబరు నెలాఖరు నాటికి రాష్ట్రంలో వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి కావాలని, ఆ దిశగా వేగం పెంచాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు..

- ఆ దిశగా ఇంటింటి సర్వే వేగం పెంచండి
- గర్భిణులు, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
- ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచాలి
- టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): డిసెంబరు నెలాఖరు నాటికి రాష్ట్రంలో వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి కావాలని, ఆ దిశగా వేగం పెంచాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు.. అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్ 80 శాతం కన్నా తక్కువగా ఉన్న జిల్లాల వైద్యాధికారులు, ఆశాలు, ఏఎన్ఎంలతో గురువారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. లక్ష్యాలను అందుకోవడంపై దిశా నిర్దేశం చేశారు. ఇంటింటి సర్వేను పకట్బంధీగా నిర్వహించి, రెండో డోసు పెండింగ్ ఉన్న వారి వివరాలను సేకరించాలని సూచించారు. అసలు ఒక్క డోసు కూడా వేసుకోని వారి వివరాలను కూడా సేకరించాలని, వారికి అవగాహన కల్పించి.. వ్యాక్సిన్ అందించాలన్నారు. ఇందుకోసం క్షేత్రస్థాయి నుంచి పక్కా ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ రెండు డోసులూ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్‌పై ఇప్పటికీ కొందరిలో అనుమానాలు ఉన్నాయని, వాటిని తొలగించి, వారిలో చైతన్యం నింపేలా కృషి చేయాలని హరీశ్‌రావు ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు, మార్కెట్లపై దృష్టి సారించాలని కోరారు. రాష్ట్రంలో మొత్తంగా 5.55 కోట్ల డోసుల వ్యాక్సిన్ అందించాల్సి ఉండగా.. ఇప్పటివరకు కేవలం 3.60 కోట్ల డోసులే అందించామని, వచ్చే నెలాఖరు నాటికి మిగిలిన 1.95 కోట్ల డోసుల పంపిణీని ముగించాలని ఆదేశించారు. రాష్ట్రంలో తొలి కోటి డోసులు వేయడానికి 165 రోజులు పట్టిందని, రెండో కోటికి 78 రోజులు పట్టగా.. మూడో కోటి డోసులు కేవలం 27 రోజుల్లోనే పూర్తయ్యాయని తెలిపారు. ఇందుకు మరికాస్త వేగాన్ని జోడిస్తే.. అనుకున్న సమయంలోపే లక్ష్యాన్ని చేరగలమని హరీశ్‌రావు అన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెరగాలి!
ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచేలా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగేలా చూడడంతో పాటు అత్యవసరమైతే తప్ప సిజేరియన్లు నిర్వహించవద్దని వైద్యులకు సూచించారు. మాతా-శిశు సంరక్షణపై ఆశా వర్కర్లు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలన్నారు. రక్తహీనతపై అవగాహన కల్పించి, మహిళలు, శిశువులకు పోషకాహారం అందించాలని మంత్రి ఆదేశించారు. ‘‘చిన్నారుల్లో ఇప్పటివరకు 96 శాతం మందికి టీకాలిచ్చాం. దీన్ని వంద శాతానికి చేర్చాలి. పీహెచ్‌సీల్లో పాము, తేలు, కుక్క కాటు మందులను అందుబాటులో ఉంచుకోవాలి.
ఎప్పటికప్పుడు బీపీ, షుగర్, క్యాన్సర్ వ్యాధి నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తూ.. ప్రాధమిక దశలోనే వాటిని గుర్తించాలి’’ అని మంత్రి దిశా నిర్దేశం చేశారు. వైద్య సిబ్బందికి అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచుతామని, ప్రోత్సాహక పారితోషికాలు కూడా అందిస్తామని తెలిపారు. ఆశా వర్కర్లకు 4జి సిమ్ కార్డు, ఎఎన్‌ఎమ్‌లకు ట్యాబులు ఇచ్చామన్నారు. అన్ని ఆస్పత్రుల్లోనూ వ్యాధి నిర్థారణ పరీక్షలతో పాటు చికిత్స కోసం అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని మంత్రి చెప్పారు. కేసీఆర్ కిట్, తెలంగాణ డయాగ్నస్టిక్ ేసవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావలని సూచించారు. ఎఎన్ఎమ్, స్టాఫ్‌నర్స్, వైద్యులకు పీఆర్సీ ఇచ్చి.. వేతనాలు పెంచామన్నారు.