12న నిరుద్యోగ మిలియన్‌ మార్చ్‌

ABN , First Publish Date - 2021-11-02T08:36:06+05:30 IST

రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 12న హైదరాబాద్‌లో నిరుద్యోగ మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తామని బీజేపీ ప్రకటించింది.

12న నిరుద్యోగ మిలియన్‌ మార్చ్‌

  • ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్‌ 
  • 21 నుంచి సంజయ్‌ 2వ దశ పాదయాత్ర 
  • బీజేపీ రాష్ట్ర పదాధికారుల భేటీలో నిర్ణయం
  • హుజూరాబాద్‌లో ఈటలదే గెలుపు: బండి సంజయ్‌


హైదరాబాద్‌/శంషాబాద్‌ రూరల్‌, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 12న హైదరాబాద్‌లో నిరుద్యోగ మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తామని బీజేపీ ప్రకటించింది. ప్రత్యేక తెలంగాణ కోసం మిలియన్‌ మార్చ్‌ జరిగిన నవంబరు 12న నిరుద్యోగులతో భారీ ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది. సోమవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అధ్యక్షతన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన పదాధికారులు, సీనియర్‌ నాయకుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్‌ మాట్లాడారు. బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని వెల్లడించారు. జాతీయ నాయకత్వం తెలంగాణపై పూర్తిస్థాయిలో దృష్టిసారించిందని, పాదయాత్రను పార్టీ స్ఫూర్తిగా తీసుకుందని చెప్పారు. పాదయాత్ర రాష్ట్ర పార్టీకి నూతనోత్సాహాన్ని ఇచ్చిందని, హుజూరాబాద్‌ శ్రేణుల్లో మరింత జోష్‌ నింపిందని పేర్కొన్నారు. పాదయాత్రపై జాతీయ నాయకత్వం సంతోషంగా ఉందని అన్నారు. సమావేశంలో హుజూరాబాద్‌ పార్టీ కార్యకర్తలకు చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపారు. అనంతరం బీజేఎల్పీ నేత రాజాసింగ్‌ మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగ యువత ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని సంజయ్‌ పిలుపునిచ్చారని చెప్పారు. ఈ నెల 21 నుంచి జనవరి 10 వరకు బండి సంజయ్‌ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతుందని పాదయాత్ర ప్రముఖ్‌ జి.మనోహర్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో 50 రోజుల పాటు యాత్ర ఉంటుందని పేర్కొన్నారు. 


కేసీఆర్‌ అధికారం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు..

ఉప ఎన్నికలో ఈటల ఘన విజయం సాధిస్తారని సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం శంషాబాద్‌లోని బీజేపీ సీనియర్‌ నేత బుక్క వేణుగోపాల్‌ ఇంట్లో తేనేటి విందుకు హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈవీఎంలు మార్చాలని చూసినా తమ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారని, కేసీఆర్‌ అధికారం కోసం ఎంతకైనా తెగిస్తున్నారని మండిపడ్డారు. కాగా, భూముల వేలంపై టీఆర్‌ఎస్‌ సర్కారుకు హైకోర్టులో చావుదెబ్బ తగిలిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అన్నారు. ప్రభుత్వ భూములకు అసలు శత్రువు అధికార పార్టీనే అని ఆమె ఒక ప్రకటనలో ఆరోపించారు. ఆర్టీఐకి సంబంధించి సీఎస్‌ జారీచేసిన అంతర్గత నోట్‌పై హైకోర్టు స్టే ఇవ్వడం చెంపపెట్టులాంటిదని గూడూరు నారాయణరెడ్డి అన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు టీఆర్‌ఎస్‌దే బాధ్యత అని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. స్వరాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా సర్కారు చలించడం లేదని మండిపడ్డారు.  

Updated Date - 2021-11-02T08:36:06+05:30 IST