కేంద్రం చిన్నచూపు

ABN , First Publish Date - 2021-05-18T08:08:50+05:30 IST

కరోనా కట్టడి, వ్యాక్సిన్‌, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల సరఫరాలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణను చిన్నచూపు చూస్తున్నట్లు అనిపిస్తోందని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అన్నారు.

కేంద్రం చిన్నచూపు

  • మూడు రోజులుగా రాష్ట్రానికి వ్యాక్సిన్‌ రాలేదు
  • సహకరించండి.. లేదంటే ఇళ్లలో కూర్చోండి
  • ఈ పరిస్థితుల్లో కలిసి పనిచేయాలి: తలసాని


హైదరాబాద్‌ సిటీ, మే 17 (ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడి, వ్యాక్సిన్‌, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల సరఫరాలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణను చిన్నచూపు చూస్తున్నట్లు అనిపిస్తోందని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అన్నారు. రెండో దశ వ్యాక్సిన్‌ మూడు రోజులుగా రాలేదని తెలిపారు. జాతీయ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇలాంటి భయంకర పరిస్థితుల్లో వీలైతే సహకరించాలని, లేదంటే ఇళ్లలో కూర్చోవాలని హితవు పలికారు. కొవిడ్‌ విషయంలో సహకరించని కేంద్రాన్ని తాము కూడా విమర్శించవచ్చని, బాధ్యత గలవారిగా తాము ఆ పని చేయడం లేదని తెలిపారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా నియంత్రణకు చేపట్టిన చర్యలపై జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో సోమవారం హోంమంత్రి మహమూద్‌ అలీతో కలిసి అధికారులతో తలసాని ఉన్నతస్థాయి సమీక్ష  నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.


విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్షాలు రాజకీయాలను పక్కన పెట్టాలన్నారు. ప్రభుత్వం ఇన్ని ఏర్పాట్లు చేయకపోతే పరిస్థితులు ఎట్లుంటాయని ప్రశ్నించారు. చాలా రాష్ర్టాల్లో పరిస్థితులు చేజారి పోయాయని, తెలంగాణలో పరిస్థితి మెరుగ్గా ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్పాయని గుర్తు చేశారు. కొందరు లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా.. అన్నం పెట్టడం తప్పా? అని మాట్లాడుతున్నారని, ప్రజలకు ఏమైనా చేయాలనుకుంటే మినహాయింపు వేళల్లో చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశానుసారం మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో.. రెగ్యులర్‌గా మానిటరింగ్‌ జరుగుతుందని చెప్పారు.

Updated Date - 2021-05-18T08:08:50+05:30 IST