కేటీఆర్‌ సారూ.. ఆదుకోరూ!

ABN , First Publish Date - 2021-05-18T08:34:37+05:30 IST

కరోనా కష్టకాలంలో ఆదుకునేవారి కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స కోసం కొందరు, చికిత్స పొందుతూ ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ కావాలని మరికొందరు, ‘‘పేదలం, సహాయం అందించండి’’ అని మరికొందరు మంత్రి కేటీఆర్‌కు విన్నవిస్తున్నారు.

కేటీఆర్‌ సారూ.. ఆదుకోరూ!

ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ కోసం ట్వీట్స్‌

హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): కరోనా కష్టకాలంలో ఆదుకునేవారి కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స కోసం కొందరు, చికిత్స పొందుతూ ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ కావాలని మరికొందరు, ‘‘పేదలం, సహాయం అందించండి’’ అని మరికొందరు మంత్రి కేటీఆర్‌కు విన్నవిస్తున్నారు. ట్విటర్‌ ద్వారా తమ బాధలు చెప్పుకుంటున్నారు. తన కార్యాలయ బృందం సహకరిస్తుందని కేటీఆర్‌  పలువురికి సమాధానమిస్తున్నారు. ఇప్పటికే సహాయం పొందినవారు ధన్యవాదాలు తెలుపుతున్నారు.   మంత్రికి సోమవారం వచ్చిన కొన్ని ట్వీట్‌ల సమాచారం ఈ విధంగా ఉన్నది. ‘‘మా ఇంట్లో అందరికీ పాజిటివ్‌. అందరం ఒకే ఇంట్లో ఉంటున్నాం. మా నానమ్మ పరిస్థితి రోజురోజుకూ విషమిస్తోంది. రోజూ ఇంటి వద్దనే సెలైన్‌ ఎక్కిస్తున్నాం. మా పట్టణంలో ఆక్సిజన్‌ బెడ్‌ అందుబాటులో లేదు. దయచేసి సహకరించండి’’ అని సిరిసిల్ల జిల్లా నుంచి ఓ బాధిత కుటుంబం విన్నవించుకుంది. సహాయం అందేలా చూస్తానని మంత్రి సమాధానమిచ్చారు. ఆ జిల్లా కలెక్టర్‌ను కూడా ట్యాగ్‌  చేశారు. 


తమ నాన్నకు ఇంటి వద్దనే ఆక్సిజన్‌ ఇస్తున్నామని,  కాన్సంట్రేటర్‌ అవసరమని,  తాము నిరుపేదలమని, సహాయం అందించమని మరో వ్యక్తి విన్నపం పంపారు. తన అన్న, వదినలకు పాజిటివ్‌. అన్నకు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌ కావాలని మరో బాధిత కుటుంబీకుని వినతి. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌  కావాలని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి కోరారు. ఇదేవిధంగా వైరాఫిన్‌, రె మ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ల కోసం అనేకమంది మంత్రికి ట్వీట్‌లు చేశారు. మందులు, ఆక్సిజన్‌ సమకూరుస్తామని కే టీఆర్‌ వారికి రీట్వీట్‌ చేశారు.  ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌ అందిన ఒక వ్యక్తి  ధన్యవాదాలు తెలుపుతూ ఫొటోను ట్వీట్‌ చేశారు.  హైదరాబాద్‌ శివారులోని ఓ సంస్థ కార్మికులు తమ వేతనాలకోసం చేసిన ఆందోళనపై స్పందిస్తూ మంత్రి కేటీఆర్‌ సంబంధిత పోలీసులను ట్యాగ్‌ చేయడం ద్వారా సమస్యకు పరిష్కారం చూపారు. 

Updated Date - 2021-05-18T08:34:37+05:30 IST