అభ్యుదయ భావకుడు నగ్నముని

ABN , First Publish Date - 2021-10-31T10:05:07+05:30 IST

అభ్యుదయ భావకుడు నగ్నముని

అభ్యుదయ భావకుడు నగ్నముని

సమాజ స్వస్థతే ఆయన కవిత్వ లక్ష్యం

కొనియాడిన ఆచార్య కొలకలూరి ఇనాక్‌

ప్రేమపూర్వక ఆలోచనలు రేపేదే కవిత్వం

ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె. శ్రీనివాస్‌

నగ్నమునికి ‘శిఖామణి’ పురస్కారం ప్రదానం


హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి):  అస్వస్థ సమాజాన్ని స్వస్థతలోకి తీసుకువచ్చే లక్ష్యంతో కవిత్వాన్ని ఆశ్రయించిన అభ్యుదయ భావకుడు నగ్నముని అని ఆచార్య కొలకలూరి ఇనాక్‌ అన్నారు. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సహకారంతో కవి సంధ్య, సాహిత్య సాంస్కృతిక సంస్థ (యానాం) సంయుక్తంగా నగ్నమునిని సత్కరించాయి. ‘శిఖామణి జీవన సాఫల్య పురస్కారం’తో గౌరవించాయి. శనివారం హైదరాబాద్‌ రవీంద్రభారతి వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె. శ్రీనివాస్‌, సాహితీవేత్తలు కె. శివారెడ్డి తదితరులు ప్రసంగించారు. నగ్నముని దిగంబరకవిగా ప్రసిద్ధులు. శిఖామణి సౌందర్యాత్మక దళిత కవిత్వానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ‘‘శిఖామణి కవిత్వంలో బాల్యస్మృతుల తాలూకూ ధోరణులు కనిపిస్తాయి’’ అని ఈ సందర్భంగా ఆచార్య ఇనాక్‌ అన్నారు. విశ్వకవిని కవిత్వంలో సదా బాలకుడు అంటారనీ, శిఖామణి తనకు అలా కనిపిస్తారని కొనియాడారు. సాత్విక ఉద్వేగాలు, సానుకూల భావాలు, ప్రేమపూర్వక ఆలోచనలు కలిగించే కవిత్వం సమాజానికి అవసరమని, అలాంటి ఆర్థ్రత శిఖామణి రచనల్లో కనిపిస్తుందని కె. శ్రీనివాస్‌ అన్నారు. అచ్చమైన దేశీయ కవి శిఖామణి అని శివారెడ్డి కొనియాడారు. సాధారణంగా అవార్డులకు దూరంగా ఉండే తాను.. శిఖామణి పట్ల ఉన్న ప్రత్యేక ప్రేమాభిమానాల వల్లే ఈ పురస్కారాన్ని స్వీకరించడానికి అంగీకరించానని పురస్కార గ్రహీత నగ్నముని అన్నారు. దేశం క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రస్తుత సమయంలో.. తెలుగు సమాజంలో ‘ఆంధ్రజ్యోతి’ ఒక్కటే దైర్యంగా వార్తలు రాస్తోందని పేర్కొన్నారు. అనంతరం వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న వారికి కవిసంధ్య ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. వారిలో...గుడిపాటి వెంకటేశ్వర్లు(పత్రికారంగం), ముకుంద రామారావు (అనువాదం), ఈమని శివనాగిరెడ్డి (చరిత్ర, పురావస్తు విభాగం), బండి ప్రసాద్‌ (పద్య కవిత్వం), డా. సీహెచ్‌ సుశీలమ్మ(పరిశోధన) ఉన్నారు. సురేంద్రదేవ్‌ చెల్లి (కవిత్వం) తరఫున ఆయన తండ్రి రవి పురస్కారం స్వీకరించారు. అనంతరం శిఖామణి కవితా సర్వస్వం, కొండ్రెడ్డి వేంకటేశ్వరరెడ్డి రచన ‘కవిత్వ దీపశిఖ’ పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సాహితీవేత్తలు ప్రసాదమూర్తి, వరుగు భాస్కర్‌రెడ్డి, బెల్లి యాదయ్య, సీఎస్‌ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-31T10:05:07+05:30 IST