గంజాయి తరలిస్తున్న నిందితుడి అరెస్టు
ABN , First Publish Date - 2021-10-20T09:02:22+05:30 IST
గంజాయి తరలిస్తున్న నిందితుడి అరెస్టు

4 లక్షల విలువ చేసే 40 కిలోల గంజాయి స్వాధీనం
పలు రాష్ట్రాల్లోనూ నిందితుడికి ‘గంజాయి’ లింకులు: సీపీ అంజనీకుమార్
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి)/మునిపల్లి: గంజాయి సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ఘరానా నిందితున్ని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఫ్జల్‌గంజ్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించి అతన్ని అరెస్టు చేశారు. అతడి నుంచి 4 లక్షల విలువ చేసే 40 కిలోల గంజాయి, ఓ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నర్సీపట్నం ప్రాంతానికి చెందిన వనపలి నాగసాయి (24) నగరానికి గంజాయి తరలించి.. వ్యాపారం చేస్తుంటాడు. తెలంగాణలోని నారాయణఖేడ్‌కు చెందిన గంజాయి వ్యాపారి ప్రేమ్‌సింగ్‌కు నాగసాయికి పరిచయం ఏర్పడింది. అతనికి 40 కిలోల గంజాయిని విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ మేరకు నర్సీపట్నం నుంచి ప్లాస్టిక్ బ్యాగుల్లో నింపి ఉన్న గంజాయిని ఓ ప్రైవేట్ రవాణా వాహనంలో హైదరాబాద్ నగరానికి తరలించాడు. ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద ప్రేమ్‌సింగ్‌కు అందజేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఉప్పందుకున్న పోలీసులు మంగళవారం ఉదయం సీబీఎస్ ఆటోపార్కింగ్ వద్ద నాగసాయిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నంలో కిలో రూ. 1500ల చొప్పున గంజాయి కొనుగోలు చేసి.. కస్టమర్ల డిమాండ్ మేరకు కిలో గంజాయి రూ. 5వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయిస్తుంటాడు. తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, యూపీతో పాటు పలు రాష్ట్రాల్లో గంజాయి వ్యాపారులతో నాగసాయికి లింకులు ఉన్నట్లు తేలింది. విచారణ అనంతరం నిందితున్ని, స్వాధీనం చేసిన గంజాయిని అఫ్జల్‌గంజ్ పోలీసులకు అప్పగించారు.
240 కిలోల ఎండు గంజాయి పట్టివేత
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ టోల్‌ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న 240 కిలోల ఎండు గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈవిషయాన్ని సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ మంగళవారం విలేకరులకు వెల్లడించారు. తమిళనాడుకు చెందిన శేఖర్ తన బొలేరో మ్యాక్స్‌ట్రక్క్ వాహనంలో విశాఖపట్టణం నుంచి ముంబైకి ఎండు గంజాయిని డ్రైవర్ రాజా స్టాలిన్(36)తో తరలిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ వాహవాన్ని ఆపి పోలీసులు తనిఖీ చేయగా 120 గంజాయి ప్యాకెట్లు లభించాయి. వీటి విలువ రూ.7 లక్షలకు పైనే ఉంటుంది. పోలీసులు డ్రైవర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.