ఈటలను దోషిగా చూపాలనే..అసైన్డ్ భూములపై విచారణ: జీవన్‌రెడ్డి
ABN , First Publish Date - 2021-05-05T08:22:37+05:30 IST
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను దోషిగా చూపడం కోసమే అసైన్డ్ భూములపై ప్రభుత్వం విచారణ చేపట్టిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు.

- టీఆర్‌ఎస్వి చిల్లర రాజకీయాలు: ఎంపీ కోమటిరెడ్డి
- మంత్రులు, ఎమ్మెల్యేలపై విచారణ చేయండి: వీహెచ్
హైదరాబాద్/రాంనగర్, మే 4 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను దోషిగా చూపడం కోసమే అసైన్డ్ భూములపై ప్రభుత్వం విచారణ చేపట్టిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే అన్యాక్రాంతమైన అన్ని అసైన్డ్ భూములపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 2018లో తీసుకొచ్చిన నూతన పట్టేదారు విధానంతో అసైన్డ్ భూములను మార్పిడి చేశారని ఆరోపించారు. కరోనాతో ప్రజలు చనిపోతుంటే టీఆర్‌ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని.. తక్షణం రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రిని నియమించాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ పార్టీకి ఓనర్లం అన్న మాటలకే ఈటలపై కేసీఆర్ కక్ష కట్టారని విమర్శించారు. ఈటల మీద కోపంతో రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే మంత్రి ఈటల రాజేందర్ విషయంలో వ్యవహరించినట్లుగానే మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి భూకబ్జాలు, అవినీతి, అక్రమాలపై విచారణ జరపాలని మాజీ ఎంపీ వి.హనుమంతరావు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. మరోవైపు.. కాంగ్రె్‌సకు పూర్వ వైభవం వస్తుందనే విశ్వాసంతో ముందుకు వెళ్లాలని తెలంగాణ కాంగ్రెస్ లాయలిస్టుల ఫోరం ప్రతినిధులు అన్నారు. కాగా.. కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్షం బుధవారం అత్యవసరంగా సమావేశం కానుంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో జూమ్ యాప్ లో జరగనున్న సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో కరోనా విలయతాండవం, అసైన్డ్, దేవాదాయ భూముల ఆక్రమణపై చర్చించనున్నారు.