అత్యాచార నిందితుడిని బహిష్కరించిన టీఆర్‌ఎస్‌

ABN , First Publish Date - 2021-10-31T09:04:50+05:30 IST

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఆరేళ్ల గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడిన టీఆర్‌ఎస్‌ నాయకుడు, సర్పంచ్‌ భర్త శంకర్‌ను ఉరితీయాలని శనివారం సిరిసిల్లలో రాస్తారోకో నిర్వహించారు...

అత్యాచార నిందితుడిని బహిష్కరించిన టీఆర్‌ఎస్‌

మంత్రి కేటీఆర్‌ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన బాధితులు

బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రభుత్వ హామీ


సిరిసిల్ల, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఆరేళ్ల గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడిన టీఆర్‌ఎస్‌ నాయకుడు, సర్పంచ్‌ భర్త శంకర్‌ను ఉరితీయాలని శనివారం సిరిసిల్లలో రాస్తారోకో నిర్వహించారు. రెండు రోజుల క్రితం బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన శంకర్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించారు. కాగా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత, గిరిజన సంఘాలతోపాటు కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఎం, సీపీఐ, ఇతర ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు ఆందోళకు దిగారు. దాదాపు 8 గంటలపాటు ఆందోళన కొనసాగించారు. ఎవరూ పట్టించుకోవటం లేదని ఎమ్మెల్యే(మంత్రి కేటీఆర్‌) క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం, డబుల్‌ బెడ్‌రూం ఇల్లు, ఇతర సహాయసహకారాలు అందిస్తామని అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. నిందితుడు శంకర్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ జిల్లా ఇన్‌చార్జి బస్వరాజు సారయ్య ప్రకటించారు. ఘటనకు పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌, పోలీసు అధికారులను కోరినట్లు పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని, చిన్నారిపై ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని అన్నారు. ఈ ఘటనపై టీపీసీసీ మాజీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2021-10-31T09:04:50+05:30 IST