ఏం చేశాం.. ఇంకేం చేద్దాం..?
ABN , First Publish Date - 2021-10-25T08:30:47+05:30 IST
కొవిడ్ కారణంగా దాదాపు ఏడాదిన్నర నుంచి మందకొడిగా సాగుతున్న పార్టీ కార్యకలాపాలను పరుగులు పెట్టించటానికి అధికార టీఆర్‌ఎస్ సిద్ధమైంది. సోమవారం హైదరాబాద్ మాదాపూర్‌లోని హైటెక్స్ వేదికగా నిర్వహించే పార్టీ ప్రతినిధుల సభ (ప్లీనరీ) ద్వారా ఇప్పటి..

నేడు హైటెక్స్ వేదికగా టీఆర్‌ఎస్ ప్లీనరీ
పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు
భవిష్యత్తు, వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం
6,500 మంది ప్రతినిధులు.. 10 వేల మందికి ఏర్పాట్లు
హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): కొవిడ్ కారణంగా దాదాపు ఏడాదిన్నర నుంచి మందకొడిగా సాగుతున్న పార్టీ కార్యకలాపాలను పరుగులు పెట్టించటానికి అధికార టీఆర్‌ఎస్ సిద్ధమైంది. సోమవారం హైదరాబాద్ మాదాపూర్‌లోని హైటెక్స్ వేదికగా నిర్వహించే పార్టీ ప్రతినిధుల సభ (ప్లీనరీ) ద్వారా ఇప్పటి వరకు ఏం చేశామనేది ఆత్మావలోకనం చేసుకుని, ఇకపై ఏం చేద్దామనే సందేశాన్ని తమ శ్రేణులకు అందించబోతోంది. పార్టీ ఆవిర్భవించి ఇరవై ఏళ్లు పూర్తి కావటం, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఈ నెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈసారి నిర్వహిస్తున్న ప్లీనరీకి అధినాయకత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. పైగా పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వచ్చే నెల 15న వరంగల్‌లో తెలంగాణ విజయ గర్జన సభ తలపెట్టడం కూడా అందుకు మరో కారణం. అప్పటికే.. నవంబరు 2న హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం రానుంది. అక్కడ గెలుపు, ఓటమితో సంబంధం లేకుండా పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో టీఆర్‌ఎస్ అధినాయకత్వం సోమవారం నాటి ప్లీనరీని తొలి అడుగుగా భావిస్తోంది. 20 ఏళ్ల పార్టీ ప్రస్థానంతోపాటు, ఏడున్నరేళ్ల ప్రభుత్వ పనితీరుపై ప్లీనరీలో సమీక్షించుకోనున్నారు. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో సాధించిన అభివృద్ధిని మననం చేసుకోనున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గడప గడపకూ తీసుకెళ్లాలని పార్టీ నూతన అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ ప్రతినిధులకు నిర్దేశించనున్నారు. పార్టీ భవిష్యత్తు, వ్యూహంపై స్పష్టత ఇవ్వనున్నారు. ప్లీనరీ ప్రాంగణంలోకి ఆహ్వానితులనే అనుమతించాలని అధిష్ఠానం నిర్ణయించింది. వివిధ స్థాయి పార్టీ ప్రతినిధులు, న్యాయవాద, ఎన్నారై ప్రతినిధులు, ప్రత్యేక ఆహ్వానితులు అందరూ కలిపి 6,500 మంది హాజరవుతారని అంచనా వేస్తోంది. అయుతే భద్రతా సిబ్బంది, వలంటీర్లు.. ఇలా అక్కడికి వచ్చే అందరినీ దృష్టిలో పెట్టుకొని 10 వేల మంది కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.