ఢిల్లీ గడ్డపై గులాబీ జెండా

ABN , First Publish Date - 2021-09-03T08:30:43+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ భవనం తెలంగాణ ఆత్మ గౌరవం, అస్తిత్వానికి చిహ్నంగా నిలుస్తుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు.

ఢిల్లీ గడ్డపై గులాబీ జెండా

  • వైభవంగా ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి భూమిపూజ శంకుస్థాపన చేసిన కేసీఆర్‌.. 
  • పాల్గొన్న మంత్రులు, ఎంపీలు
  • ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ కార్యాలయం 
  • తెలంగాణ అస్తిత్వ చిహ్నం
  • ఉద్యమ, పార్టీ నేత చేతుల మీదుగా జరగడం చరిత్రాత్మక సందర్భం
  • దక్షిణాది నుంచి రెండో పార్టీ: కేటీఆర్‌
  • రాష్ట్రంలో ఘనంగా టీఆర్‌ఎస్‌ జెండా పండుగ


న్యూఢిల్లీ, హైదరాబాద్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): దేశ రాజధాని ఢిల్లీలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ భవనం తెలంగాణ ఆత్మ గౌరవం, అస్తిత్వానికి చిహ్నంగా నిలుస్తుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. దక్షిణాదికి సంబంధించి ఢిల్లీలో కార్యాలయం ఏర్పాటు చేసిన రెండో ప్రాంతీయ పార్టీ టీఆర్‌ఎస్‌ మాత్రమేనని చెప్పారు. ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి గురువారం శంకుస్థాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. తొలుత, వసంత్‌ విహార్‌లోని స్థలంలో భూ వరాహస్వామి యజ్ఞం నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమం ముగిసిన తర్వాత, మధ్యాహ్నం 1.48 గంటలకు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ భూ సంప్రోక్షణ చేసి భూమి పూజ చేశారు. మధ్యాహ్నం 12.40 గంటలకు మంత్రి కేటీఆర్‌ ప్రాంగణానికి చేరుకున్నారు.


సీఎం రాకకు ముందు కొద్దిసేపు ఆయన హోమంలో పాల్గొన్నారు. ఎంపీలు కేకే, సంతోష్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌తో కలిసి మధ్యాహ్నం 1.15 గంటలకు కేసీఆర్‌ చేరుకొని.. నేరుగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద పండితులు గోపీకృష్ణ శర్మ, ఫణి శశాంక శర్మ పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం తన అధికార నివాసానికి వెళ్లారు. మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ప్రముఖ వాస్తు నిపుణుడు సుద్దాల సుధాకర్‌ తేజ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి. కార్యక్రమం ముగిసిన తర్వాత కేటీఆర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. రెండు దశాబ్దాల కిందట జలదృశ్యం వద్ద కేసీఆర్‌ నాయకత్వంలో ఊపిరి పోసుకున్న టీఆర్‌ఎస్‌.. ఈరోజు అదే నాయకుడి చేతుల మీదుగా దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేసుకోవడం చారిత్రక సన్నివేశమని అన్నారు.


ఉద్యమ చరిత్రతోపాటు టీఆర్‌ఎస్‌ చరిత్రలోనూ శాశ్వతంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని, తెలంగాణ పదమే నిషిద్ధమైన రోజుల్లో టీఆర్‌ఎస్‌ కార్యాలయం ఉన్న జల దృశ్యం నుంచి సామాన్లను రోడ్డున పడేసిన చంద్రబాబు కక్షపూరిత పాలన, ఆ తర్వాత తెలంగాణ ఆశను చిదిమేయాలని చూసిన వైఎ్‌సఆర్‌ పాలన వరకు ఎదురైన అన్ని అడ్డంకులనూ ఒక్కటొక్కటిగా తొలగించుకుంటూ ముందుకు సాగిందని వివరించారు. ఏడేళ్ల పాలనలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ పురోగమిస్తోందని, తెలంగాణ భాష, సంస్కృతులకు పెద్ద పీట వేస్తూ, ఉమ్మడి పాలనలో జరిగిన విధ్వంసం నుంచి మహత్తర పునర్నిర్మాణ ప్రయాణం దిగ్విజయంగా కొనసాగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కోసం పాటుపడుతున్న ప్రజా ప్రతినిధులకు, నాయకులకు,  కార్యకర్తలకు కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రు లు, ఎంపీలు, తుమ్మల నాగేశ్వర రావు పాల్గొన్నారు.


పరిమిత సంఖ్యలో అనుమతి

కరోనా ప్రొటోకాల్‌ మేరకు కార్యక్రమానికి దాదాపు 200 మంది వరకు హాజరయ్యారు. కేవలం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులను మాత్రమే లోనికి పంపించారు. ప్రాంగణం బయట దాదాపు 500 మంది కార్యకర్తలు, నాయకులు ఉండిపోవాల్సి వచ్చింది. కొంతమంది ముఖ్య నేతలను కూడా చివరి వరకు పోలీసులు లోపలికి అనుమతించలేదు.


గర్వంగా ఉంది: ప్రశాంత్‌ రెడ్డి

దేశ రాజధానిలో టీఆర్‌ఎస్‌ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడంతో గర్వంగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు.  2001లో జలదృశ్యంలో ఒక్క అడుగుతో మొదలైన టీఆర్‌ఎస్‌ ప్రస్తానం ఢిల్లీ నడిబొడ్డుపై జెండా ఎగరేసే వరకు ఎదిగిందని తెలిపారు. కేసీఆర్‌ జనరంజక పాలన, అమలు చేస్తున్న పథకాల వివరాలను మొత్తం దేశానికి తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందని, అందుకు ఢిల్లీ టీఆర్‌ఎస్‌ కార్యాలయం వేదిక కాబోతుందని అన్నారు.


ఘనంగా టీఆర్‌ఎస్‌ జెండా పండుగ

పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం పిలుపు మేరకు గురువారం తెలంగాణ అంతటా పార్టీ శ్రేణులు జెండా పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాయి. గ్రామాలు, మండల కేంద్రాలు, పట్టణాలు, నగరాల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు జెండాను ఆవిష్కరించారు. పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు టీఆర్‌ఎస్‌ జెండా పండుగలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ జెండాను పార్టీ సీనియర్‌ నేత పర్యాద కృష్ణమూర్తి ఆవిష్కరించారు. కాగా, జెండా పండుగను విజయవంతం చేసిన టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కె.తారకరామారావు ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జెండా పండుగను విజయవంతం చేసినట్లుగానే, నిర్ణీత గడువులోగా పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేయాలని సూచించారు. పార్టీ యంత్రాం గం మొత్తం వార్డు, మండల, పట్టణ కమిటీలను నియమించుకునే ప్రక్రియను కొనసాగించాలని కేటీఆర్‌ కోరారు. ఇక, అధిష్ఠానం ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం గురువారం గ్రామ పంచాయతీ, వార్డుల్లో పార్టీ కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రక్రియను ఈ నెల 12లోగా పూర్తి చేయాలని పార్టీ అధిష్ఠానం నిర్దేశించింది. 


ఉత్తమ టీచర్ల ఎంపిక పూర్తి

రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుకు సంబంధించిన కసరత్తును ప్రభుత్వం పూర్తి చేసినట్లు ప్రభు త్వ వర్గాలు వెల్లడించాయి. ఆదివారం నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో బహమతి ప్రదానం చేయనున్నట్లు తెలుస్తోంది. విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా నేతృత్వంలో గురువారం జరిగిన విద్యాశాఖ అధికారుల సమావేశంలో ఈ విషయంపై ప్రత్యేకంగా చర్చించారు. మొత్తంగా.. ఈ ఏడాది సుమారు 48 మంది ఉపాధ్యాయులను అవార్డుకు ఎంపిక చేసినట్టు సమాచారం. 

Updated Date - 2021-09-03T08:30:43+05:30 IST