దమ్ముంటే హుజూరాబాద్‌లో డిపాజిట్‌ తెచ్చుకో

ABN , First Publish Date - 2021-08-20T09:21:07+05:30 IST

నలుగురు ఈలలు వేస్తున్నారని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని, దమ్ముంటే హుజురాబాద్‌ ఉప ఎన్నికలో డిపాజిట్‌ తెచ్చుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు

దమ్ముంటే హుజూరాబాద్‌లో డిపాజిట్‌ తెచ్చుకో

టీపీసీసీ చీఫ్‌ కాగానే కొమ్ములొచ్చాయా?

ఈలలేస్తున్నారని ఇష్టారీతిన మాట్లాడొద్దు

రేవంత్‌ తీరు తాలిబన్ల మాదిరిగా ఉంది

నలుగురు ఈలలేస్తున్నారని ఇష్టారీతిన మాట్లాడొద్దు

నోరు అదుపులో పెట్టుకోకపోతే గజ్వేల్‌కు రాలేవు

రేవంత్‌రెడ్డిపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ధ్వజం


హైదరాబాద్‌, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): నలుగురు ఈలలు వేస్తున్నారని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని, దమ్ముంటే హుజురాబాద్‌ ఉప ఎన్నికలో డిపాజిట్‌ తెచ్చుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సవాల్‌ విసిరారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో గురువారం పార్టీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, వివేకానంద, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు తదితరులు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌లోకి నిన్నగాక మొన్న వచ్చిన రేవంత్‌రెడ్డి.. లఫంగి మాటలు మాట్లాడుతున్నాడని జీవన్‌రెడ్డి దుయ్యబట్టారు. దేశాన్ని 75 ఏళ్లుగా దోచుకుంటున్నది గాంధీ కుటుంబమేనని విమర్శించారు. రేవంత్‌కి టీపీసీసీ అధ్యక్షుడుగా ఉద్యోగం ఇచ్చిందే కేసీఆర్‌ అని అన్నారు. రాష్ట్రంలో సోనియమ్మ రాజ్యమేమోకానీ రేవంత్‌ జైలుకు వెళ్లడం మాత్రం ఖాయమన్నారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రత్యేక అజెండాతోనే బీఎస్పీలో చేరారని పేర్కొన్నారు. ప్రింటింగ్‌ ప్రెస్‌ నడిపిన రేవంత్‌రెడ్డి రూ.వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని గువ్వల బాలరాజు ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోకపోతే గజ్వేల్‌లో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించారు. ఆయన భాష చూసి 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ నేతలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు.


టీపీసీసీ చీఫ్‌ పదవి రాగానే కొమ్ములు వచ్చాయని రేవంత్‌ అనుకుంటున్నారని ఎమ్మెల్యే వివేకానంద విమర్శించారు. విమర్శలు చేస్తే సీఎం కాలేరని, అందుకు ప్రజల మనసు గెలుచుకోవాలని హితవు చెప్పారు. టీపీసీసీ చీఫ్‌ తీరు తాలిబన్ల మాదిరిగా ఉందని, కేసీఆర్‌ చేసిన అభివృద్ధిపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. రేవంత్‌ తన ఊర్లో దళితులను ఎప్పుడైనా గౌరవించారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని దళిత, గిరిజనులను కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకుగానే చూసిందని ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు అన్నారు. కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపేందుకు రేవంత్‌ కంకణం కట్టుకున్నట్టున్నారని ఎద్దేవా చేశారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంలో పాలనాపరమైన తప్పులుంటే సూచనలు చెయ్యాలే గానీ.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.


రేవంత్‌ పిచ్చికుక్కలాగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వ్యవసాయం చేసుకోలేని భూమినే ఫార్మాసిటీ కోసం ప్రభుత్వం తీసుకుందని స్పష్టం చేశారు. తాను అవినీతి చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ప్రకటించారు. ఎమ్మెల్యే భేతి సుభా్‌షరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పాలనలో నీళ్ల కోసం బిందెలు పట్టుకొని ధర్నాలు చేసిన పరిస్థితిని ప్రజలు మర్చిపోలేదన్నారు. కేసీఆర్‌ పాలనలో కరెంటు, నీళ్లు ఇస్తుంటే ప్రతిపక్షాలు చూడలేకపోతున్నాయని విమర్శించారు.

Updated Date - 2021-08-20T09:21:07+05:30 IST