దళితబంధును ఆపింది టీఆర్‌ఎస్‌, బీజేపీలే

ABN , First Publish Date - 2021-10-20T08:39:42+05:30 IST

దళితబంధును ఆపింది టీఆర్‌ఎస్‌, బీజేపీలే

దళితబంధును ఆపింది టీఆర్‌ఎస్‌, బీజేపీలే

ఆ రెండు పార్టీలు తోడు దొంగలు

 ఎన్నికల సమయంలో రైతుబంధు ఇచ్చారు..

 దళితబంధు ఇవ్వడానికి ఏంది అడ్డంకి? 

 హరీశ్‌పై చర్యలు తీసుకోవాలి: రేవంత్‌రెడ్డి 


హైదరాబాద్‌/రాంగోపాల్‌పేట, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): వ్యూహంలో భాగంగానే దళితబంధును టీఆర్‌ఎస్‌, బీజేపీలు ఆపాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆ రెండు పార్టీలూ తోడు దొంగలని విమర్శించారు. గతంలో ఎన్నికల సమయంలో రైతుబంధు డబ్బులు పడగా లేనిది.. దళిత బంధుకు ఏంటి అడ్డంకి అని అన్నారు. దళితబంధు అమలు కోసం బీజేపీ, టీఆర్‌ఎ్‌సలు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఎందుకు కలవట్లేదని ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో ఓ నిరుద్యోగ యువతిపై దాడి చేసిన టీఆర్‌ఎస్‌ నేతలపైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ను రేవంత్‌రెడ్డి కోరారు. మంగళవారం ఆయనను కలిసి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం మీడియాతో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. దళితుడిని సీఎంను చేయాలని, కుటుంబానికి మూడెకరాల భూమి ఇవ్వాలని దళితులు అడగకున్నా కేసీఆరే ప్రకటించి.. తర్వాత మాట తప్పారని మండిపడ్డారు. ఇప్పుడూ దళితులు దళితబంధును అడగకున్నా ప్రకటించారని, ఇదీ ఇవ్వబోరని అనుమానం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కేసీఆర్‌ తరపున నామినేషన్‌ వేసిన వారిలో ఒక్క దళిత బిడ్డ కూడా లేరన్నారు. కేటీఆర్‌కు దమ్ముంటే దీనిపైన నవంబరు 15లోపు బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. సొంత చెల్లెల్ని గెలిపించుకోలేకపోయిన కేటీఆర్‌కు తన గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు. అన్నింటిలోనూ కేటీఆర్‌ తనకంటే జూనియర్‌ అన్నారు. హుజూరాబాద్‌లో మంత్రి హరీశ్‌, ఈటల రాజేందర్‌ నిబంధనలను తుంగలో తొక్కారని, ఈ ఎన్నికను దేశంలోనే ఖరీదైన ఎన్నికగా మార్చారని రేవంత్‌ మండిపడ్డారు. పంపకాలలో వచ్చిన తేడా వల్లే హరీశ్‌, ఈటల మధ్య మాటల యుద్థం నడుస్తోందన్నారు. హుజూరాబాద్‌కు చెందిన నిరోష అనే యువతి.. నిరుద్యోగ భృతి అంశాన్ని మంత్రి హరీశ్‌ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఆమెపైన టీఆర్‌ఎస్‌ నేతలు దాడి చేశారని, పోలీసులూ ఆమెనే తిట్టారన్నారు. ప్రశ్నించే వారిపై దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ తప్పిదాలను వెలికితీసిన బల్మూరి వెంకట్‌పైనా దాడులు చేశారని, అందుకే ఆయననే హుజూరాబాద్‌ బరిలోకి దింపామని చెప్పారు. ఈ ఎన్నికల్లో రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్న హరీశ్‌రావుపైన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల అధికారికి తాము ఫిర్యాదు చేసినట్లు రేవంత్‌ రెడ్డి తెలిపారు.

Updated Date - 2021-10-20T08:39:42+05:30 IST