చీడపీడల్లా మోదీ, కేసీఆర్
ABN , First Publish Date - 2021-11-21T07:56:17+05:30 IST
పీఎం మోదీ, సీఎం కేసీఆర్‌లు రైతుల పాలిట చీడపీడల్లా తయారయ్యారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. కల్లాల్లో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మూలుగుతోందని,

- కేసీఆర్ జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేయాలి రేవంత్
ఖైరతాబాద్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): పీఎం మోదీ, సీఎం కేసీఆర్‌లు రైతుల పాలిట చీడపీడల్లా తయారయ్యారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. కల్లాల్లో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మూలుగుతోందని, కేసీఆర్ మొదట వాటిని కొనాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఇక్కడ ధర్నాలు చేయడం ఆపి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రైతుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అన్నదాతల ఆత్మశాంతి కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీవీ మార్గంలోని పీపుల్స్‌ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఉత్తర భారతదేశ రైతులు చేసిన పోరాటం ఫలితంగానే ప్రధాని మోదీ దిగివచ్చి సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నారని రేవంత్ అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు గీతారెడ్డి, షబ్బీర్ అలీ, మధుయాష్కీ గౌడ్, సీతక్క, చిన్నారెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, సునీతారావు, రోహిణ్‌రెడ్డి, మహే్‌షకుమార్ గౌడ్, బలమూరి వెంకట్, నూతి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్రంలో ధాన్యం సేకరణ చాలా నెమ్మదిగా జరుగుతోందంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు.
యాసంగిలో క్రాప్ హాల్డే ప్రకటిస్తారా?: ఉత్తమ్
హుజూర్నగర్/వైరా/పెద్దపల్లి: రాష్ట్రంలో యాసంగికి ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటిస్తుందా? అలా చేస్తే ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలని నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన శనివారం సందర్శించారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా దాచాపురంలో రైతులకు భరోసా ఇచ్చారు.