కేసీఆర్ కేబినెట్‌లో 75 శాతం మంత్రులు టీడీపీ వాళ్లే..!
ABN , First Publish Date - 2021-07-10T08:28:26+05:30 IST
తెలంగాణ కాంగ్రెస్.. టీడీపీగా మారిందని టీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తుండడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. వాస్తవానికి టీఆర్‌ఎస్సే.. టీడీపీ అని,
టీఆర్‌ఎస్సే.. టీడీపీ
ఇప్పుడు కూడా అదే పార్టీ దిక్కయింది.. గతిలేక ఎల్.రమణ కాళ్లు పట్టుకున్నరు
75% మంత్రులు టీడీపీ వాళ్లే.. నేను బాబు మనిషినైతే కేసీఆర్ ఆయన చప్రాసి
పార్టీని కాంగ్రెస్‌లో కలుపుతానని ఒట్టేశారు.. సోనియాగాంధీ కాళ్లపై పడ్డారు
భవిష్యత్తులో టీఆర్‌ఎస్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరే.. కేటీఆర్ ఓ డ్రామారావు
నాకు పీసీసీ అధ్యక్ష పదవి వచ్చినందుకే కిషన్‌రెడ్డికి కేబినెట్ హోదా
జలవివాదాలపై ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌లవి వీధి బాగోతాలు
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 72 సీట్లు గెలుస్తుంది: రేవంత్.. మీడియాతో చిట్‌చాట్
హైదరాబాద్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ కాంగ్రెస్.. టీడీపీగా మారిందని టీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తుండడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. వాస్తవానికి టీఆర్‌ఎస్సే.. టీడీపీ అని, కేసీఆర్ కేబినెట్‌లో 75 శాతం మంత్రులు తెలుగుదేశం వాళ్లే ఉన్నారని అన్నారు. ఇప్పుడు కూడా ఆ పార్టీకి టీడీపీనే దిక్కయిందని, గతిలేక ఎల్.రమణ కాళ్లు పట్టుకున్నారని వ్యాఖ్యానించారు. తాను చంద్రబాబు మనిషినైతే.. కేసీఆర్ ఆయనకు చెప్రాసీ అని అన్నారు. శుక్రవారం రేవంత్‌రెడ్డి తన నివాసంలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. కేటీఆర్ పేరు కల్వకుంట్ల రామారావు కాదని, కల్వకుంట్ల డ్రామారావు అని అన్నారు. తన పేరును మరో విధంగా మార్చుకున్నా తనకు అభ్యంతరం లేదన్నారు. తనపై విమర్శలు చేయటానికి బావ, బావమరిది పోటీ పడుతున్నారుని చెప్పారు.
కేటీఆర్ అసలు పేరు అజయ్ అని, ఆనాడు ఎన్టీఆర్‌కు భ్రమ కల్పించేందుకు తారక రామారావుగా కేసీఆర్ మార్చారని తెలిపారు. కేటీఆర్‌ది మిడిమిడి జ్ఞానమని, హోటల్లో వెయిటర్ కూడా ఇంగ్లిష్ మాట్లాడతాడని ఎద్దేవా చేశారు. ‘‘కేసీఆర్, కేటీఆర్‌ల బతుకు టీడీపీ అయితే.. హరీశ్‌రావు బతుకు కాంగ్రెస్. కేటీఆర్ పేరే బిచ్చమెత్తుకుని పెట్టుకున్నరు. మీ దగ్గర టీడీపీ కాకుండా ఉన్నదెవరో చెప్పాలి. చంద్రబాబుకు ఊడిగం చేశాకే కేసీఆర్ టీఆర్‌ఎస్ పార్టీని పెట్టాడు. హుజూరాబాద్ ఎన్నిక కోసం టీడీపీ నుంచి ఎల్.రమణను చేర్చుకుంటున్నారు’’ అని రేవంత్ ధ్వజమెత్తారు.
కేటీఆర్ రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి..
‘‘కేటీఆర్ టీడీపీని తిట్టాలనుకుంటే మొదట వాళ్ల నాన్ననే తిట్టాలి. వాళ్ల నాన్న ముఖ్యమంత్రి పదవి ఇవ్వట్లేదనే కేటీఆర్ ఏడుపు. ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కేటీఆర్ రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి. నేను పీసీసీ అధ్యక్షుడినైతే నీకేం నొప్పి? నేను సొంతంగా ఎదిగిన. నీలాగా తండ్రి పేరుతో ఎదగటేదు. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేలు వస్తే.. అక్కడికి వెళ్లి రాళ్లతో కొట్టు. మోసానికి, దోపిడీకి మారుపేరు కల్వకుంట్ల కుటుంబం. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని సోనియాగాంధీ దగ్గర కేసీఆర్ తన పిల్లలపై ఒట్టు వేశాడు. కుటుంబమంతా వెళ్లి సోనియాగాంధీ కాళ్లపై పడలేదా?’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్, వైసీపీ నేతలు కూడబలుక్కుని తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 72 సీట్లు గెలుస్తుందన్నారు. తమ కుటుంబం నుంచి ఇంకెవరూ పోటీ చేయబోరన్నారు.
అధికారాన్ని బరాబర్ గుంజుకుంటాం
2022 ఆగస్టు 15 తర్వాత సీఎం కేసీఆర్ తన ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళతారని రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వరుగాక ఇవ్వరని అన్నారు. అమరవీరుల స్తూపం పేరుతో పెద్ద దోపిడీ జరిగిందని ఆరోపించారు. స్తూపం కాంట్రాక్టును ఆంధ్ర వాళ్లకు ఇవ్వడంతో అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయన్నారు. అధికారాన్ని టీఆర్‌ఎస్ నుంచి బరాబర్ గుంజుకుంటామన్నారు. ‘కేటీఆర్ మిడిమిడి జ్ణానంలో ఉన్నారు. నేను కాంగ్రెస్‌లో చేరడానికి ముందు టీడీపీ నుంచి వచ్చిన అన్ని పదవులకు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన. మీ పార్టీలో చేరిన 12 మంది ఎమ్మెల్యేలను ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి రాజీనామా ఇవ్వమనండి. 15 ఏళ్ల నా కష్టమే పీసీసీ. ప్రధానమంత్రి అయినంత కాదు.. ప్రపంచానికి అధినేత అయినంత సంతోషంగా ఉంది నాకు. కేటీఆర్‌కు ఎందుకు బాధ? నా పాదయాత్రపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పుడు జీతభత్యాలు, గన్‌మెన్లు, పీఏను ప్రభుత్వానికి సరెండర్ చేశాను. అప్పటి స్పీకర్ మధుసూదనాచారికి నా దృష్టిలో గుర్తింపు లేదు కాబట్టే ఆయనకు నా రాజీనామా లేఖ ఇవ్వలేదు’’ అని రేవంత్ అన్నారు.
నా కారణంగానే కిషన్‌రెడ్డికి కేబినెట్ హోదా
తనకు పీసీసీ అధ్యక్ష పదవి వచ్చినందుకే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కేబినెట్ హోదా వచ్చిందని రేవంత్‌రెడ్డి అన్నారు. అంతే తప్ప.. ఆయన పనితీరు వల్ల కాదన్నారు. యూపీఏ ప్రభుత్వంలో ఉమ్మడి ఏపీకి కాంగ్రెస్ పది కేంద్ర మంత్రి పదవులు ఇచ్చిందన్నారు. ‘‘వైసీపీ ఎమ్మెల్యే రోజా పాపం ఆడపిల్ల కదా.. జాలిపడదాం. మంత్రి పదవి రాలేదన్న బాధలో ఉంది. ఈ మధ్య ఆరోగ్యం కూడా బాగోలేదు’’ అని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎ్‌సతో కాంగ్రెస్‌కు పాము, ముంగిస పోరాటం కొనసాగుతుందన్నారు. ‘‘టీఆర్‌ఎస్ గాలివాటం పార్టీ. దానికి నిర్మాణం లేదు. భవిష్యత్తులో ఆ పార్టీ కుక్కలు చింపిన విస్తరి అవుతది. టీడీపీ పార్టీనే లేదు. ఆ పార్టీ అధ్యక్షుడే టీఆర్‌ఎ్‌సలో చేరాడు. ఇంక పొత్తులపై చర్చ ఏంది? బీజేపీలో చేరాక ఈటల రాజేందర్‌కు ఉద్యమంతో బంధం తెగిపోయింది. లెఫ్టిస్టు ఈటల రాజేందర్ క్యాపిటలిస్టుగా మారారు. సుధీర్‌రెడ్డి లాంటి దొంగలను ఘర్ వాపసీ రమ్మనను. గండ్ర సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నడు. హుజురాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థిపై దామోదర రాజనర్సింహ నివేదిక ఇస్తారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మా కుటుంబం. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలన అనేదే మా స్లోగన్’’ అని రేవంత్ అన్నారు.
రిలయన్స్‌కు రాజ్యసభ సీటు ఎందుకిచ్చారు?
వైఎస్ విజయలక్ష్మి, జగన్, షర్మిల.. కాంగ్రె్‌సను విమర్శించే ముందు వైఎస్సార్ మరణానికి రిలయన్స్ కారణమని ఆరోపించి వారికే రాజ్యసభ సీటు ఎందుకిచ్చారో చెప్పాలని రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘జగన్ వదిలేసిన బాణం షర్మిల. ఎవరు వదిలిన బాణం అనేది తర్వాత. రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆస్తి. రాహుల్‌గాంధీని ప్రధానిగా చూడాలనేది వైఎస్సార్ కోరిక. చంచల్‌గూడ జైల్లో విజయసాయిరెడ్డి ఉన్న రూంలో నేను రెండు రోజులు ఉన్నా. అందుకే నా మీద ఆయనకు కోపం వచ్చినట్టుంది. జల వివాదాలపై కేసీఆర్, జగన్‌లవి వీధి బాగోతాలు. రాష్ట్రం వచ్చాక ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ రూ.లక్షా 20 వేల కోట్లు మింగాడు’’ అని రేవంత్ ఆరోపించారు.’