రాష్ట్రంలో రైతుల మరణ మృదంగం: రేవంత్ రెడ్డి

ABN , First Publish Date - 2021-12-30T23:31:42+05:30 IST

సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి బహిరంగ

రాష్ట్రంలో రైతుల మరణ మృదంగం: రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలతో మరణ మృదంగం మోగుతోందని ఆయన పేర్కొన్నారు. వరి, మిర్చీ రైతుల ఆత్మహత్యలు కలచివేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తామర పురుగు తెగులుతో మిర్చీ రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. పంట నష్టపోవడంతో ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారన్నారు. రైతుల ప్రాణాలంటే కేసీఆర్ ప్రభుత్వానికి గడ్డిపోచతో సమానంగా కనిపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. రోజూ పదుల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే దున్నపోతుపై వర్షం పడిన చందంగా ప్రభుత్వ తీరు ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


పంట నష్టపోయిన మిర్చీ రైతులకు తక్షణం పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఇవ్వాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు మిర్చీ రైతుల్లో భరోసా నింపేందుకు తక్షణం మంత్రుల బృందం క్షేత్రానికి వెళ్లాలన్నారు. రూ. లక్ష రుణమాఫీని తక్షణం అమలు చేయాలన్నారు. 

Updated Date - 2021-12-30T23:31:42+05:30 IST