నేడు, రేపు కాంగ్రెస్‌ అవగాహనా సదస్సు

ABN , First Publish Date - 2021-11-09T07:21:34+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ డిజిటల్‌ సభ్యత్వ నమోదుపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులు, పట్టణ, నగర, మండల, బ్లాకు అధ్యక్షులకు అవగాహన కల్పించడంతో పాటు పలు అంశాలపై టీపీసీసీ రెండు రోజుల సదస్సు నిర్వహించనుంది.

నేడు, రేపు కాంగ్రెస్‌ అవగాహనా సదస్సు

  • హాజరుకానున్న డీసీసీ, పార్టీ పట్టణ, నగర, మండల అధ్యక్షులు 
  • సభ్యత్వ నమోదుపైనే కార్యక్రమం


హైదరాబాద్‌, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ డిజిటల్‌ సభ్యత్వ నమోదుపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులు, పట్టణ, నగర, మండల, బ్లాకు అధ్యక్షులకు అవగాహన కల్పించడంతో పాటు పలు అంశాలపై టీపీసీసీ రెండు రోజుల సదస్సు నిర్వహించనుంది. కొంపల్లిలోని ఓ ఫంక్షన్‌ హాల్లో మంగళవారం ఈ సదస్సు ప్రారంభం కానుంది. పార్టీ నిర్మాణం, సిద్ధాంతం, భావజాలం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు, నీటిపారుదల, విద్యుత్తు తదితర అంశాలపైనా కాంగ్రెస్‌ ముఖ్యనేతలు అవగాహన కల్పిస్తారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తదితరులు హాజరుకానున్నారు. తొలుత రేవంత్‌రెడ్డి అధ్యక్ష ఉపన్యాసం ఉంటుంది. అనంతరం డిజిటల్‌ సభ్యత్వ నమోదుపై అవగాహనకు సంబంధించి సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి హర్కార వేణుగోపాల్‌ అవగాహన కల్పిస్తారు. అలాగే పార్టీ నిర్మాణంపై సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, పార్టీ సిద్ధాంతం, భావజాలంపై ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరిస్తారు.  


‘హుజూరాబాద్‌’పై అధ్యయనానికి కమిటీ

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ఓటమికి కారణాలను అధ్యయనం చేసేందుకు కర్ణాటక మాజీ ఎమ్మెల్యే సంజన్యన్‌ మత్‌ పరిశీలకుడిగా ఏఐసీసీ ఏక సభ్య కమిటీని నియమించింది. పార్టీ అభ్యర్థికి సంప్రదాయ ఓట్లు కూడా రాకపోవడంపై అధ్యయనం చేసి నెల రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. 


శ్రీవారి సేవలో రేవంత్‌రెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సోమవారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో కుటుంబ సమేతంగా ఆలయంలోకి వెళ్లిన ఆయన ముందుగా ధ్వజ స్తంభానికి మొక్కుకున్నారు. వేదపండితుల ఆశీర్వచనం తర్వాత అధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. 

Updated Date - 2021-11-09T07:21:34+05:30 IST