నేటితో వానాకాలం నీటి విడుదల బంద్‌

ABN , First Publish Date - 2021-12-15T08:14:32+05:30 IST

కృష్ణా నదిపై ఉన్న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రిజర్వాయర్లు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో వానాకాలం(ఖరీఫ్‌) నీటి విడుదల గడువు బుధవారంతో ముగియనుంది.

నేటితో వానాకాలం నీటి విడుదల బంద్‌

హైదరాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్ర జ్యోతి): కృష్ణా నదిపై ఉన్న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రిజర్వాయర్లు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో వానాకాలం(ఖరీఫ్‌) నీటి విడుదల గడువు బుధవారంతో ముగియనుంది. ఈ ఖరీ్‌ఫలో ఏపీ ఇప్పటిదాకా శ్రీశైలం, నాగార్జునసాగర్‌ నుంచి 212.43 టీఎంసీలు వాడుకోగా, తాజాగా 23.68 టీఎంసీల విడుదలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ అనుమతినిస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చింది. ఇక మొత్తం 236.13 టీఎంసీల నీటిని ఖరీ్‌ఫలో ఏపీకి కేటాయించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ రిజర్వాయర్ల నుంచి తెలంగాణకు 170.67 టీఎంసీల నీటిని కేటాయిస్తూ త్రి సభ్య కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే తెలంగాణ మాత్రం జూన్‌ 1 నుంచి గత నవంబరు 30 దాకా 81.85 టీఎంసీలు మాత్రమే వాడుకుంది.


దాంతో ఈనెల 1 నుంచి 15 దాకా 88.82 టీఎంసీల విడుదలకు త్రిసభ్య కమిటీ అనుమతి లభించింది. ఆ గడువు ఒక్కరోజులో ముగియనుండటంతో మిగిలిన నీటినంతా రబీలో వాడుకుంటామని అధికారులు గుర్తు చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద 16.43 టీఎంసీలు, మరో 1.67 టీఎంసీలు, ఇక నాగార్జునసాగర్‌ లెఫ్ట్‌ కెనాల్‌ కింద 39.34 టీఎంసీలు, ఎలిమినేటి మాధవరెడ్డి పథకం కింద 16.11 టీఎంసీలు, జంట నగరాల తాగునీటి అవసరాలకు వాటర్‌బోర్డుకు 8.30 టీఎంసీల నీటిని వినియోగించుకున్నారు. ఇక శ్రీశైలం రిజర్వాయర్‌లో 130.670 టీఎంసీలు నీటి లభ్యత ఉండగా... అందులో 76.819 టీఎంసీలు వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. నాగార్జునసాగర్‌లో 308.170 టీఎంసీల నీరుండగా... 176.501 టీఎంసీలు వినియోగించుకోవడానికి వీలుంది. మొత్తం కలిపి రెండు రిజర్వాయర్‌లలో 253.320 టీఎంసీల నీటి లభ్యత ఉంది.

Updated Date - 2021-12-15T08:14:32+05:30 IST