నేడే జన ఆశీర్వాద యాత్ర

ABN , First Publish Date - 2021-08-20T05:35:20+05:30 IST

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి శుక్రవారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ‘జన ఆశీర్వాద యాత్ర ’ చేపట్టనున్నారు. కేంద్ర మంత్రి పర్యటన ఉదయం నుంచి రాత్రి వరకు మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ జిల్లాల మీదుగా సాగుతుంది.

నేడే జన ఆశీర్వాద యాత్ర

దంతాలపల్లి నుంచి పెంబర్తి వరకు పర్యటించనున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
నగరంలో భద్రకాళి, వేయిస్తంభాల ఆలయాల్లో పూజలు
చేతి వృత్తుల వారితో భేటీ... స్థానిక కార్యక్రమాలకు హాజరు
ఘనస్వాగతానికి బీజేపీ నేతల సన్నాహాలు


హనుమకొండ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి శుక్రవారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో  ‘జన ఆశీర్వాద యాత్ర ’ చేపట్టనున్నారు. కేంద్ర మంత్రి పర్యటన ఉదయం నుంచి రాత్రి వరకు  మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ జిల్లాల మీదుగా సాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా స్థానికంగా ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో కిషన్‌ రెడ్డి పాల్గొంటారు. పలు చారిత్రక ప్రాంతాలు, ఆలయాలను సందర్శిస్తారు. వివిధ చేతివృత్తులవారిని కలుసుకొని వారితో కొద్దిసేపు ఇష్టాగోష్టి జరుపుతారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇంతకు ముందు హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్‌ రెడ్డి.. శాఖ మారిన తర్వాత హనుమకొండకు రావడం ఇదే మొదటిసారి. అనేక దర్శనీయ స్థలాలు ఉన్న వరంగల్‌, హనుమకొండ జిల్లాలో పర్యాటక శాఖ మంత్రిగా ఆయన పర్యటన ప్రాధాన్యతను సంతరించుకున్నది.

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సూర్యపేట మీదుగా ఉదయం 8.45 గంటలకు మహబూబాబాద్‌ జిల్లాలోని దంతాలపల్లికి చేరుకోవడంతో ఆయన పర్యటన ప్రారంభమవుతుంది. దంతాలపల్లిలో స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 9.20  గంటలకు తొర్రూరుకు వస్తారు. ఇక్కడ స్థానికంగా కొన్ని కార్యక్రమాలకు హాజరవుతారు. 10  గంటలకు వరంగల్‌ జిల్లా  పరిధిలోని రాయపర్తికి చేరుకుంటారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం 10.25 గంటలకు వర్ధన్నపేటకు చేరుకుంటారు. ఇక్కడ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత మధ్యాహ్నం 12.20 గంటలకు వరంగల్‌ నగరంలోకి ప్రవేశిస్తారు. సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలోని వ్యాక్సినేషన్‌ సెంటర్‌ను సందర్శిస్తారు.

అక్కడి నుంచి 12.55 గంటలకు భద్రకాళి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. 1.25గంటలకు హనుమకొండలోని వేయిస్తంభాల గుడిని సందర్శించి పూజలు చేస్తారు. 1.50 గంటలకు హన్మకొండ చౌరస్తాకు చేరుకుంటారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మాజీ ఎంపీ జంగారెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో కొద్దిసేపు భేటీ అవుతారు. 2.30 గంటలకు సుబేదారిలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి నివాళులర్పిస్తారు.

మధ్యాహ్న భోజన విరామం తర్వాత 3 గంటలకు వరంగల్‌ నుంచి బయలుదేరుతారు. సాయంత్రం 4.10 గంటలకు జనగామ జిల్లాలోని రఘునాథపల్లికి చేరుకుంటారు. అక్కడ కొద్దిసేపు ఆగిన తర్వాత 4.35 గంటలకు ఖిలాషాపూర్‌కు చేరుకొని సర్వాయి పాపన్నకు నివాళులర్పిస్తారు. సాయంత్రం 4.35 గంటలకు రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌, స్వయం సేవక్‌ గుజ్జుల నర్సయ్య సత్కార కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. సాయంత్రం 6.15 గంటలకు జనగామ పట్టణానికి చేరుకొని స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాత్రి 7.30 గంటలకు పెంబర్తికి చేరుకొని ఇత్తడి హస్తకళాకారులతో భేటీ అవుతారు. రాత్రి 8 గంటలకు భువనగిరి జిల్లా ఆలేరుకు బయలుదేరి వెళ్లడంతో మంత్రి కిషన్‌ రెడ్డి ఉమ్మడి జిల్లా పర్యటన ముగుస్తుంది. కిషన్‌రెడ్డికి ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. దంతాలపల్లిలో ఘనస్వాగతం పలుకనున్నారు.

పథకాల ప్రచారం.. ప్రజలతో మమేకం
మట్టెవాడ(వరంగల్‌), ఆగస్టు 19 : కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆశీర్వాద యాత్ర భారీ వాహనశ్రేణితో మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ జిల్లాల పరిధిలో శుక్రవారం సాగనుంది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం  చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో ప్రజలను భాగస్వామ్యం చేయడమే ఈ జన ఆశీర్వాద యాత్ర ముఖ్యఉద్దేశం. ప్రధానంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌,  కేంద్రం అందిస్తున్న ఉచిత బియ్యం తదితర అంశాలపై కిషన్‌రెడ్డి మాట్లాడనున్నారు.

కమలాపూర్‌లో రోడ్‌ షో
నగరంలో ఆశీర్వాదయాత్ర ముగిసిన అనంతరం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కమలాపూర్‌లో మండలంలో పర్యటిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. హనుమకొండ నుంచి అంబాల మీదుగా కమలాపూర్‌ చేరుకుంటారని, అక్కడ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు మద్దతుగా రోడ్‌ షోలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం జనగామ జిల్లా రఘునాథపల్లి నుంచి యాత్రను తిరిగి ప్రారంభిస్తారని వారు చెప్పారు.

Updated Date - 2021-08-20T05:35:20+05:30 IST