టీఎస్‌పీఎస్సీ సభ్యుడిగా కారం రవీందర్‌రెడ్డి
ABN , First Publish Date - 2021-05-20T05:50:00+05:30 IST
టీఎస్‌పీఎస్సీ సభ్యుడిగా కారం రవీందర్‌రెడ్డి

అభినందనలు తెలిపిన టీఎన్‌జీవోస్ నేతలు
వరంగల్ అర్బన్ కలెక్టరేట్, మే 19: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన టీఎన్జీవోస్ కేంద్ర సంఘం మాజీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి నియామకమయ్యారు. సీఎం కేసీఆర్ బుధవారం సీనియర్ ఐఏఎస్ అధికారి బి.జనార్దన్‌రెడ్డి చైర్మన్‌గా టీఎస్‌పీఎస్‌సీ కమిషన్‌ను నియమించారు. కమిషన్‌లో జిల్లాకు చెందిన కారం రవీందర్‌రెడ్డిని సభ్యుడిగా నియమితులయ్యారు. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం వేలేరు గ్రామానికి చెందిన కారం రవీందర్ రెడ్డికి తల్లిదండ్రులు నర్సమ్మ-పాపిరెడ్డి, భార్య జ్యోతి, ఇద్దరు కుమారులు ఉన్నారు.
టైపిస్టుగా మొదలు
కారం రవీందర్ రెడ్డి ఉద్యోగ సంఘంలో అంచెలంచెలుగా రాష్ట్ర స్థాయికి ఎదిగారు. రవీందర్ రెడ్డి ఉద్యోగ ప్రస్థానం ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపూర్‌లోని ఏపీ రెయాన్స్ ప్యాక్టరీలో టైపిస్టుగా 1984లో ప్రారంభమైంది. తర్వాత 1985లో అప్పటి వరంగల్ కలెక్టరేట్‌లోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేశారు. 1987లో డీఎస్సీ ద్వారా రెవెన్యూ శాఖకు ఎంపికయ్యారు. 2007లో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రవీందర్ రెడ్డి డీటీగా ఉన్నారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సమయంలో డీటీలకు గెజిటెడ్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వ్యులు జారీ చేసింది. దీంతో నాన్ గెజిటెడ్ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న రవీందర్‌రెడ్డి డీటీ నుంచి సీనియర్ అసిస్టెంట్‌గా రివర్షన్ తీసుకున్నారు. ఆయన వరంగల్ ఆర్డీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంగా 2020లో ఉద్యోగ విరమణ పొందారు.
నేతగా..
ఉద్యోగ సంఘాల జేఏసీ నేతగా ఉన్న సురేందర్ రెడ్డి స్ఫూర్తితో రవీందర్ రెడ్డి ఉద్యోగ సంఘాల్లో చురుకుగా పనిచేశారు. ఈ క్రమంలో కలెక్టరేట్ రెవెన్యూ సంఘానికి నాయకత్వం వహించారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రెండోసారి కూడా జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి రెండేళ్లకాలం పూర్తికాగానే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అవకాశం వచ్చింది. అనంతరం టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర
తెలంగాణ మలిదశ ఉద్యమంలో రవీందర్‌రెడ్డి కీలక పాత్ర పోషించా రు. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం పక్షాన స్వరాష్ట్రం కోసం ఉద్యమించారు. 18 రోజుల పెన్‌డౌన్, 2011 సెప్టెంబరు 13న ప్రా రంభమైన సకల జనుల సమ్మె 55రోజుల పాటు సాగింది. లక్షగొంతు లు, లక్షగళాల వంటి ఆందోళన కార్యక్రమాల్లో జిల్లా ఉద్యోగుల పాత్ర కీలకం. ఈసమయంలో ఉద్యమంలో ఉద్యోగులను ముందుండి నడి పించిన వారిలో రవీందర్‌రెడ్డి కీలక వ్యక్తి. ఉద్యోగుల సమస్యలు, పీఆర్సీ కోసం జరిగిన ఆందోళనల్లో రవీందర్ రెడ్డి పాత్ర ఎంతో ఉంది. కాగా, కారం రవీందర్‌రెడ్డిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా నియమించడంతో ఉద్యోగ సంఘాల నేతలు పరిటాల సుబ్బారావు, అన్నమనేని జగన్ మోహన్ రావు, ఆకుల రాజేందర్, కోలా రాజేష్, పుల్లూరు వేణుగోపాల్, బైరీ సోమన్న అభినందనలు తెలిపారు.