పంజా విసిరిన పులి

ABN , First Publish Date - 2021-11-09T05:30:00+05:30 IST

పంజా విసిరిన పులి

పంజా విసిరిన పులి
మంగపేట మండలంలో పులి దాడి చేయడంతో మృతి చెందిన దూడ

ములుగు జిల్లాలో మళ్లీ కలకలం 

పశువుల మందపై దాడి

మంగపేట మండలంలో దూడ మృతి

భయం గుప్పిట్లో ఏజెన్సీ వాసులు

మంగపేట, నవంబరు 9: పులి మళ్లీ పంజా విసిరింది. ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతంలో కలకలం సృష్టింది. మేత కోసం వచ్చిన పశువులపై దాడి చేసింది.  మంగపేట మండలంలో కొత్తూరు మొట్లగూడెం, కోమటిపల్లి గ్రామాల మధ్య మంగళవారం మధ్యాహ్నం ఆవు మందపై దాడి చేసి లేగదూడను చంపింది. తాడ్వాయి అటవీ ప్రాంతంలో సోమవారం పశువుల మందపై దాడి చేసిన విషయం విదితమే. మళ్లీ మంగపేట మండలంలో పులి ప్రత్యక్షం కావడం స్థానికంగా భయాందోళన కలిగిస్తోంది. 

కొత్తూరు మొట్లగూడెం పంచాయతీ పరిధిలోని గొత్తికోయ గూడెం శ్రీరాంనగర్‌ వాసి ఎల్లయ్యకు చెందిన ఆవుల మం దను కాపరి సమ్మయ్య రోజూ లాగే అటవీ ప్రాంతానికి తోలు కెళ్లాడు. ఈ క్రమంలో చెట్ల మాటున ఉన్న పులి ఒక్కసారిగా మందపై దాడి చేసింది. దీంతో ఓ లేగదూడ మృతి చెందింది. మిగతా అవులు చెల్లాచెదురయ్యాయి. కాపరి బిగ్గరంగా అరవడంతో పులి అక్కడి నుంచి పారిపోయింది. భయంతో పరిగెత్తుకుంటూ వచ్చిన సమ్మయ్య ఈ విషయాన్ని చెప్పడం తో గ్రామస్థులు పంచాయతీ కార్యదర్శి చందూలాల్‌కు సమా చారం ఇచ్చారు. ఆయన ద్వారా విషయం తెలుసుకున్న ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌ షకీల్‌ పాషా తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. పులి దాడిలో మృతి చెం ది  దూడను స్వాధీనం చేసుకున్నారు. పులి ఆనవాళ్లను పరిశీలించేందుకు ఆ ప్రదేశంలో సీసీ కెమెరాలు అమర్చారు. మృతి చెందిన దూడ విలువ రూ. 20 వేలు ఉంటుందని బాధితుడు ఎల్లయ్య తెలిపాడు. ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఇదిలా ఉండగా ములుగు ఏజెన్సీలో రెండుమూడు రోజులుగా పులి సంచరించడం కలక లం రేపుతోంది. తాడ్వాయి అడవుల్లో సోమవారం పశువుల మందపై పులి దాడి చేసింది. మళ్లీ మంగళవారం కూడా అలాంటి సంఘటనే చోటు చేసుకోవడం, దూడను చంప డంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

Updated Date - 2021-11-09T05:30:00+05:30 IST