అప్పుల బాధతో ముగ్గురు రైతుల ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-01-20T08:50:20+05:30 IST
అప్పుల బాధతో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తోడేళ్లగూడెం

డోర్నకల్, తలకొండపల్లి, చింతకాని, జనవరి 19: అప్పుల బాధతో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తోడేళ్లగూడెం గ్రామానికి చెందిన చింతకాయల వీరబాబు (24) తనకున్న మూడెకరాల భూమితో పాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకున్నాడు. అప్పులు చేసి పత్తి, మిర్చి, వరి సాగు చేశాడు. అకాల వర్షాలు, మిర్చి పంటకు తెగుళ్లు సోకడంతో పెట్టుబడి కూడా రాలేదు. దీంతో అప్పులు తీర్చే మార్గం లేక జీవితంపై విరక్తితో సోమవారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామానికి చెందిన రైతు బొగ్గారపు వెంకట నారాయణ (57) పత్తి సాగుచేయగా, అధిక వర్షాలతో పంట పూర్తిగా దెబ్బతినడంతో అప్పులు తీర్చ లేక, కౌలు చెల్లించలేక మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చీపునుంతలకు చెందిన రైతు కుమ్మరి శ్రీశైలం (43) అప్పులు తీర్చే మార్గం కానరాక మనస్తాపంతో మామిడి చెట్టుకు ఉరేసుకున్నాడు.