తుపాకీతో బెదిరింపులు!

ABN , First Publish Date - 2021-05-30T08:09:49+05:30 IST

వికారాబాద్‌లో తుపాకీ కలకలం రేపింది. అర్ధరాత్రి ఇరువురి మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీయగా..

తుపాకీతో బెదిరింపులు!

  • డిప్యూటీ తహసీల్దార్‌పై పోలీసులకు ఫిర్యాదు 
  • ఇంటికి వెళ్లిన పోలీసులకు నగ్నంగా దర్శనం!

వికారాబాద్‌, మే 29: వికారాబాద్‌లో తుపాకీ కలకలం రేపింది. అర్ధరాత్రి ఇరువురి మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీయగా.. గొడవలో భాగమైన డిప్యూటీ తహసీల్దార్‌ తుపాకీ తీసి బెదిరించారు. దీనిపై అవతలి వ్యక్తి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు డిప్యూటీ తహసీల్దార్‌ ఇంటికి వెళ్లగా ఆయన నగ్నంగా దర్శనమివ్వడంతో నివ్వెరపోయారు. అదుపులోకి తీసుకుని తనిఖీలు చేయగా.. ఎయిర్‌ గన్‌, తల్వార్లతోపాటు కత్తులు కనిపించాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన ప్రకారం వికారాబాద్‌ కలెక్టరేట్‌లో షేక్‌ ఫయాజ్‌ అహ్మద్‌ డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్నారు. కమలానగర్‌కు చెందిన ప్రణీత్‌ కుమార్‌ శుక్రవారం రాత్రి పార్కులో వాకింగ్‌ చేసి గౌలికర్‌ ఫంక్షన్‌ హాల్‌ వెనుక ఖాళీ స్థలంలో మూత్రవిసర్జనకు వెళ్లాడు. అదే సమయంలో ఫయాజ్‌ కారులో వేగంగా వచ్చి ప్రణీత్‌ వద్ద ఆపారు. అర్ధనగ్నంగా కిందకు దిగి.. కత్తితో, తర్వాత తుపాకీ గురిపెట్టి భయపెట్టారు. ప్రణీత్‌ భయంతో క్షమాపణ చెప్పి జారుకున్నాడు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పోలీసులు ఫయాజ్‌ ఇంటికి వెళ్లగా నగ్నంగా కనిపించారు. ఆయనను అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించారు.

Updated Date - 2021-05-30T08:09:49+05:30 IST