బుల్లెట్‌ బైక్‌ దొంగల ఆటకట్టు

ABN , First Publish Date - 2021-10-30T05:09:07+05:30 IST

బుల్లెట్‌ బైక్‌ దొంగల ఆటకట్టు

బుల్లెట్‌ బైక్‌ దొంగల ఆటకట్టు

 హనుమకొండ, అక్టోబరు 29: ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న ఇద్దరిని హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు.. శుక్రవారం వరంగల్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో సీపీ తరుణ్‌జోషి ఇద్దరు నిందితులను మీడియాకు చూపించి వివరాలను వెల్లడించారు. నిందితుల నుంచి సుమారు రూ. 11 లక్షల విలువగల ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామానికి చెందిన షేక్‌ సైదా ప్రస్తుతం హనుమకొండ కుమార్‌పల్లిలో నివాసం ఉంటున్నాడు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు చెందిన ఎమ్డీ అబ్దుల్‌ ఆరీఫ్‌ కూడా కుమార్‌పల్లిలో నివాసం ఉంటున్నాడు. షేక్‌ సైదాకు స్వగ్రామంలో అప్పులు ఎక్కువ కావడంతో కూలి కోసం హనుమకొండకు వచ్చాడు. అబ్దుల్‌ ఆరీఫ్‌ హనుమకొండలో ఓ ప్రైవేటు కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌లో పనిచేస్తున్నాడు. ఇద్దరు కుమార్‌పల్లిలో నివాసం ఉండడంతో పరిచయం ఏర్పడింది. వచ్చే ఆదాయం సరిపోక పోవడంతో దొంగతనాలను చేయాలని నిర్ణయించుకున్నారు. వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో ఖరీదైన బుల్లెట్‌ వాహనాలను దొంగతనం చేసి ఆంధ్రాలో విక్రయించారు. అలా ఏడు బుల్లెట్‌ వాహనాలను అపహరించారు. కొన్ని వాహనాలను హనుమకొండ బస్‌స్టేషన్‌ సమీపంలోని పార్కింగ్‌ ప్రదేశాల్లో భద్రపరిచేవారు. 

వాహనదారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా ఇద్దరిని గుర్తించారు.  వాహనాలు తనిఖీ చేసి ఇద్దరిని కొత్తబ్‌సస్టేషన్‌ సమీపంలో అరెస్టు చేశారు.  బుల్లెట్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కేసును చేధించడంలో ప్రతిభ కనబరిచిన హనుమకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డి, సీఐ వేణుమాధవ్‌, ఎస్‌ఐ రఘుపతి, కానిస్టేబుళ్లు శివకృష్ణ, గౌస్‌పాష, బావుసింగ్‌, నగేశ్‌, సుమన్‌, వినోద్‌, విజేందర్‌, హోంగార్డు రవిలను సీపీ అభినందించాడు.
Updated Date - 2021-10-30T05:09:07+05:30 IST