‘స్థానికత’పైనే రగడ

ABN , First Publish Date - 2021-12-31T08:30:33+05:30 IST

ఉద్యోగులు, ఉపాధ్యాయుల విభజన అంశం సమస్యలకు కేంద్రంగా మారుతోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆగ్రహానికి, ఆందోళనకు కారణమవుతోంది.

‘స్థానికత’పైనే రగడ

  • ఎక్కడివారికి అక్కడ పోస్టింగులు దక్కడం లేదు.. 
  • స్థానిక జిల్లా, జోన్‌, మల్టీ జోన్‌ మారుతున్న ఉద్యోగులు
  • అక్కడ స్థానికేతరులుగా ఉండాలా? అంటూ ఆక్రోశం
  • 317 జీవో అన్యాయం చేసిందంటున్న సంఘాలు


మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కిష్టాపూర్‌ జడ్పీహెచ్‌ఎస్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శోభన్‌ అదే జిల్లా స్థానికుడు. జీవో 317లో పేర్కొన్నట్లు సీనియారిటీ ప్రకారం ఆయనను 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మల్‌ జిల్లా కుంటాల మండలానికి పంపారు. దీంతో.. ఆయన మంచిర్యాల స్థానికతను వదులుకోవాల్సి వచ్చింది. నిర్మల్‌లో నిర్బంధ స్థానికుడిగా మారాల్సి వస్తోంది. ఆయన ఇద్దరు ఆడపిల్లలు కూడా భవిష్యత్‌ చదువులతో అక్కడి స్థానికులుగా మారుతారు. అంటే.. స్థానికత విషయంలో ఆ కుటుంబం పూర్తిగా అస్తిత్వాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి..!


నైసర్గిక స్వరూపం, రెవెన్యూ, కరువు ప్రాంతాలు, వెనకబడిన ప్రాంతాలు.. ఇలా పలు ప్రాతిపదికలతో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఒక్కో ఉమ్మడి జిల్లా రెండు అంతకంటే ఎక్కువ జిల్లాలుగా విడిపోయాయి. స్థానికత ఆధారంగా కాకుండా.. సీనియారిటీ ప్రకారం కేటా యింపులు జరపడం వల్ల.. జూనియర్లు తమ స్థానికతను వదులుకుని, 100-150 కిలోమీటర్ల దూరంలోని జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.


ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఓ సందర్భంలో.. భూపాలపల్లి జిల్లావాసికి భూపాలపల్లిలోనే ఉద్యోగం రావాలంటూ వ్యాఖ్యానించారు. అలాంటప్పు డు కొత్త జీవో ప్రకారం.. ఉద్యోగులకు సొంత జిల్లాలు దక్కడం లేదు కదా? అన్న ప్రశ్నకు.. అధికారులు, ప్రభుత్వ పెద్దల నుంచి సమాధానం లేదు.

హైదరాబాద్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు, ఉపాధ్యాయుల విభజన అంశం సమస్యలకు కేంద్రంగా మారుతోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆగ్రహానికి, ఆందోళనకు కారణమవుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత స్వస్థలాలకు వెళ్తామనుకుంటే.. జిల్లాకాని జిల్లాకు పోవాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 317తో తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆరోపిస్తున్నారు. స్థానికత ఆధారంగా శాశ్వత పోస్టింగులు ఇవ్వకుండా, ఉమ్మడి జిల్లా సీనియారిటీ ప్రకారం కేటాయింపులు చేయడం అన్యాయం అంటున్నారు. పైగా.. ఎన్నడూ లేనివిధంగా దివ్యాంగులకు 70% సమస్య ఉండాలని పేర్కొన్నారని, దీనికి సంబంధించి సర్టిఫికెట్లు పొందే అవకాశం లేకుండానే జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లవారీగా కేటాయింపులు జరిపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులను విభజించి కొత్త జిల్లాలవారీగా సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఏ జిల్లాకు చెందినవారిని ఆ జిల్లాకు పంపడం ద్వారా ‘స్థానికత’కు పెద్ద పీట వేయాలన్నది అసలు లక్ష్యం. అందరూ సర్దుబాటు అయ్యాక.. ఉద్యోగ ఖాళీలను గుర్తించడం, కేడర్‌ స్ట్రెంథ్‌ను ప్రకటించడం చేయాలని భావించింది. హైదరాబాద్‌ మినహా 9 ఉమ్మడి జిల్లాల ఆధారంగా విభజన ప్రక్రియను చేపట్టారు. ఈ క్రమంలో 317 జీవోను విడుదల చేసిన తర్వాత.. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జీవోలో ‘స్థానికత’ అంశాన్ని పేర్కొనకపోవడమే అసలు సమస్య. సీనియారిటీకే ప్రాధాన్యమిచ్చారు. అంటే.. ఉమ్మడి జిల్లాలోని ఉద్యోగుల సీనియారిటీ ఆధారంగా జాబితాలను రూపొందిస్తారు. సీనియారిటీ క్రమంలో ఆప్షన్లను స్వీకరిస్తారు. ఉమ్మడి జిల్లా నుంచి ఆవిర్భవించిన జిల్లాల్లో వారు దేనినైనా ఎంచుకోవచ్చు. ఈ నేపథ్యంలో వెనుకబడి ఉన్న జిల్లాలకు డిమాండ్‌ ఉండదు. ఆప్షన్ల పద్ధతిలో సీనియారిటీ ఉన్న వారు అలాంటి జిల్లాలను ఎంచుకోరు. నాలుగు జిల్లాలుగా విడిపోయిన ఉమ్మడి ఆదిలాబాద్‌ను ఉదాహరణగా తీసుకుంటే.. ప్రతి ఉద్యోగి నాలుగు ఆప్షన్లను ఇవ్వాలి. ఇక్కడ మంచిర్యాల, నిర్మల్‌కు డిమాండ్‌ ఉండగా.. ఆదిలాబాద్‌, కుమ్రంభీ-ఆసిఫాబాద్‌ వెనకబడి ఉన్నాయి. దీంతో అంతా మొదటి ఆప్షన్‌గా మంచిర్యాల, రెండో ఆప్షన్‌గా నిర్మల్‌, ఆ తర్వాతి స్థానాల్లో ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌లను ఎంచుకున్నారు. 


మంచిర్యాల జిల్లా సీనియర్‌ ఉద్యోగులతో నిండిపోగా.. సీనియారిటీలో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నవారితో నిర్మల్‌లోని పోస్టులు భర్తీ అయ్యాయి. జూనియర్లకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ మిగిలాయి. అంటే.. ఓ జూనియర్‌కు మంచిర్యాల స్థానికత ఉన్నా.. 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్‌ వెళ్లాల్సి వచ్చింది. జోన్లు, మల్టీ జోన్ల విషయంలో కూడా ఇలాంటి సమస్యే నెలకొంది. నిజానికి ప్రతి ఉద్యోగికి చదువు, పుట్టిన ప్రాంతం ఆధారంగా స్థానిక జిల్లాను నిర్ధారిస్తారు. ఇప్పటి వరకు 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగులుగానీ, ఉపాధ్యాయులుగానీ 80ు స్థానికులు, 20ు స్థానికేతరుల నిష్పత్తిలో ఎంపికయ్యేవారు. దాంతో అప్పుడు ఎక్కడి జిల్లావారికి అక్కడే పోస్టింగులు లభించేవి. 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం వీరు ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ ఉత్తర్వుల్లో స్థానికులకే 95ు ఉద్యోగాలు దక్కేలా నియామకాలు చేడపతామని చెప్పారు. కానీ, కొత్త విభజనలో స్థానికులకు స్థానిక జిల్లాలు దక్కడం లేదు కదా అన్నదానికి అధికారులు, ప్రభుత్వ పెద్దల నుంచి సమాధానం లేదు. పైగా.. కొత్త జిల్లాల్లో వర్కింగ్‌ స్ట్రెంథ్‌(ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య)కు అనుగుణంగానే పోస్టులను భర్తీ చేస్తున్నారు. జీవో 317 మేరకు కాకుండా తొలుత స్థానికత ఆధారంగా ఉద్యోగులను కేటాయించి.. ఆ తర్వాత డిప్యూటేషన్లు లేదా ఆర్డర్‌-టు-సర్వ్‌ ప్రకారం ఇతర జిల్లాలకు పంపితే బాగుంటుందని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదని మండిపడుతున్నారు.


దివ్యాంగులకు సమస్యే

దివ్యాంగుల విషయంలో ప్రభుత్వం మరీ అన్యాయంగా వ్యవహరించిందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు దివ్యాంగులకు 40% అంగవైకల్యాన్ని పరిగణనలోకి తీసుకునేవారు. తాజా ఉత్తర్వుల్లో దాన్ని 70శాతంగా ఖరారు చేశారు. ఇది ఇబ్బందికరంగా మారింది. 40-60% అంగవైకల్యం ఉన్న దివ్యాంగులు సొంత జిల్లాలను వదులుకునే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 70% అంగవైకల్య సర్టిఫికెట్లు పొందే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. మంచిర్యాల జిల్లా.. జన్నారం మండలం కిష్టాపూర్‌ పాఠశాలకు చెందిన నటరాజు 40% అంగవైకల్యంతో అప్పుట్లో పీహెచ్‌సీ కోటా కింద ఉద్యోగం పొందారు. ఆయనకు ఏడాది కిందట 68% వరకు వైకల్యం పెరిగినట్లు సర్టిఫికెట్‌ ఇచ్చారు. కానీ.. 70% నిబంధన ఉండడంతో ఆయనకు విభజన సందర్భంలో ప్రాధాన్యం లభించలేదు. ఇప్పుడు పరీక్ష చేయించుకుంటే ఆయనకు 80 శాతానికి పైగా సమస్య తేలుతుందని తోటి ఉపాధ్యాయులు వివరిస్తున్నారు. దీనికి సంబంధించి సర్టిఫికెట్‌ పొందాలంటే మెడికల్‌ బోర్డు నిర్ధారించాల్సి ఉంటుంది. ఇందుకు 15-30 రోజులు పడుతుంది. కానీ.. విభజన మెసేజ్‌లు రాగానే.. మూడు రోజుల్లో తమకు కేటాయించిన ప్రాంతాల్లో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో నటరాజుకు 80ు సమస్య ఉన్నా మంచిర్యాలలో కాకుండా ఆసిఫాబాద్‌లో పోస్టింగ్‌ ఇచ్చారు.

 

కొత్త ఉద్యోగ నియామకాలకే ‘స్థానికత’

‘స్థానికత’ అంశంపై ప్రభుత్వ వర్గాల వాదన మరో విధంగా ఉంది. 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లతో అమల్లోకి వచ్చిన ‘రాష్ట్రపతి ఉత్తర్వులు-2018’ ప్రకారం వివిధ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయడానికి చేపట్టే రికూ్ట్రట్‌మెంట్ల సందర్భంలోనే ‘స్థానికత’ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారని వివరిస్తున్నాయి. ప్రస్తుత ఉద్యోగుల విభజనలో ‘స్థానికత’ అంశం పరిగణలోకి రాదని చెబుతున్నాయి. కొత్త నియామకాలకే స్థానికులకు 95ు.. స్థానికేతరులకు 5ు ఉద్యోగాలు ఇవ్వాలన్న వివరణ ఉందని తెలిపాయి.


‘స్థానికత’ ఆధారంగా కేటాయింపులు

‘స్థానికత’ ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలి. ఉద్యోగులకు ఇతర జిల్లాలకు కేటాయించడం వల్ల వారు శాశ్వతంగా స్థానికేతరులుగా మారుతారు. ఇది చాలా అన్యాయం. ముందుగా ఎవరి జిల్లాకు వారిని, ఎవరి జోన్‌కు వారిని కేటాయించాలి. కావాలనుకుంటే అక్కడి నుంచి తాత్కాలిక సర్దుబాటు కింద ఇతర ప్రాంతాలకు పంపించుకోవచ్చు. 

- చిలగాని సంపత్‌కుమార స్వామి, తెలంగాణ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

Updated Date - 2021-12-31T08:30:33+05:30 IST