రాష్ట్రంలో 45 దాటిన వారు 48 లక్షలు
ABN , First Publish Date - 2021-03-24T07:55:33+05:30 IST
కోమార్బిడిటీ్‌సతో సంబంధం లేకుండా.. నలభై ఐదేళ్లు దాటినవారందరికీ ఏప్రిల్ 1 నుంచి టీకా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర వైద్య శాఖ అందుకు సమాయత్తమవుతోంది.

- కేంద్రం నిర్ణయంతో వారందరికీ టీకా
- సమాయత్తమవుతున్న వైద్య శాఖ
- 60 పైబడినవారిని కూడా కలుపుకొంటే మొత్తం కోటిమంది అవుతారని అంచనా
హైదరాబాద్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): కోమార్బిడిటీ్‌సతో సంబంధం లేకుండా.. నలభై ఐదేళ్లు దాటినవారందరికీ ఏప్రిల్ 1 నుంచి టీకా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర వైద్య శాఖ అందుకు సమాయత్తమవుతోంది. రాష్ట్రంలో 45 ఏళ్లు దాటిన వారు 48 లక్షల మంది దాకా ఉంటారని వైద్యశాఖ అంచనా. వారితో పాటు 60 పైబడిన వారిని కలుపుకొంటే మొత్తం కోటి మంది వరకూ ఉంటారని వైద్య వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం తెలంగాణలో రోజుకు లక్ష మందికి టీకాలు వేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. కేంద్రం తాజా నిర్ణయంతో రోజుకు 2 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుందని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొన్నిచోట్ల టీకాలు వేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి అన్ని పీహెచ్‌సీల్లోనూ వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూరల్, అర్బన్ ప్రాంతాల్లో కలిపి 865 వరకు పీహెచ్‌సీలున్నాయి. వీటిలో పాటు ఏరియా, సీహెచ్‌సీ ఆస్పత్రుల్లోనూ టీకాలివ్వనున్నారు.
2 వేలకుపైగా కేంద్రాల్లో
కొవిడ్ టీకాలను ప్రజలు ఎక్కువగా ప్రైవేటు ఆస్పత్రుల్లోనే తీసుకుంటున్నారు. దాంతో 20 పడకలు దాటిన అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ వేసేందుకు అనుమతినివ్వాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖకు తెలంగాణ సర్కారు లేఖ రాసింది. వాటిల్లో కూడా అనుమతి స్తే, మరో వేయి కేంద్రాలు అందుబాటులోకి వస్తాయి. దాంతో ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి 2200 కేంద్రాల్లో టీకాలు వేసేందుకు అవకాశం ఉంటుందని వైద్య వర్గాలు వెల్లడించాయి. కాగా.. రాష్ట్రంలో 5-6 కోట్ల టీకా వయల్స్‌ను నిల్వ చేసే కోల్డ్‌స్టోరేజ్ కేంద్రాలు ఇప్పటికే సిద్దంగా ఉన్నాయి. కొటి మందికి రెండు డోసులంటే రెండు కోట్ల టీకాలు కావాలని.. టీకా వయల్స్‌ను కేంద్రం దశలవారీగా పంపుతుంది కాబట్టి ప్రస్తుతం ఉన్న కేంద్రాలు నిల్వకు సరిపోతాయని, వాటిని పెంచాల్సిన అవసరం లేదని అధికారులు వివరించారు.