16 జిల్లాల్లో తొలి డోసు 100%

ABN , First Publish Date - 2021-12-19T07:26:10+05:30 IST

కొవిడ్‌ టీకా తొలి డోసు వ్యాక్సినేషన్‌ను ఈ నెల 22లోగా నూటికి నూరుశాతం పూర్తి చేయాలని రాష్ట్ర సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది.

16 జిల్లాల్లో తొలి డోసు 100%

  • రాష్ట్రవ్యాప్తంగా మొదటి డోసు వ్యాక్సినేషన్‌ 98% పూర్తి
  • రెండోడోసు తీసుకున్నది 58 శాతమే


హైదరాబాద్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ టీకా తొలి డోసు వ్యాక్సినేషన్‌ను ఈ నెల 22లోగా నూటికి నూరుశాతం పూర్తి చేయాలని రాష్ట్ర సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. టీకా తీసుకునేందుకు అర్హులైన వయోజనులు 2.78 కోట్ల మంది ఉండగా, ఇప్పటికే 2.72 కోట్ల (98%) మందికి తొలిడోసు ఇచ్చారు. మరో 5.42 లక్షల మందికి తొలిడోసు ఇస్తే వందశాతం మొదటి డోసు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది. కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ కలకలం నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. దీంతో 16 జిల్లాల్లో 100% తొలి డోసు వ్యాక్సినేషన్‌ పూర్తయింది. మరో 3 జిల్లాలు (ఖమ్మం, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం) 99% టీకా కార్యక్రమాన్ని పూర్తి చేశాయి. ఇంకో 8 జిల్లాల్లో 90 శాతానికిపైగా వ్యాక్సినేషన్‌ జరిగింది. కేవలం 6 జిల్లాల్లో మాత్రం ఇంకా 90 శాతానికి కూడా తొలి డోసు టీకా కార్యక్రమం చేరుకోలేదు. తొలిడోసు టీకా పంపిణీలో కొమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా ఇంకా వెనుకబడే ఉంది. ఆ జిల్లాల్లో ఇప్పటివరకు 83 శాతమే వ్యాక్సినేషన్‌ జరిగింది. కామారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 84% చొప్పున, సూ ర్యాపేట జిల్లాలో 88%, నిజామాబాద్‌ జిలాలో 89% చొప్పున తొలిడోసు టీకా పంపిణీ పూర్తయింది. మొదటి డోసు 100ు పూర్తి చేసుకున్న కొన్ని జిల్లాలు రెండోడోసు విషయంలో వెనుకబడ్డాయి. నిర్మల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో తొలిడోసు వ్యాక్సినేషన్‌ 100ు జరిగినప్పటికీ, రెండో డోసు పంపిణీ మాత్రం వరుసగా 44%, 47 శాతమే జరిగింది.  


ఈ జిల్లాల్లో తొలి డోసు 100%  

రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌, నిర్మల్‌, సిద్దిపేట, హన్మకొండ, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, జయశంకర్‌  భూపాలపల్లి, నారాయణ్‌పేట, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, యాదాద్రి, జగిత్యాల, జనగాం


సెకండ్‌ డోసులో కరీంనగర్‌ టాప్‌..

ఇక కొవిడ్‌ వ్యాక్సిన్‌ రెండో డోసు పంపిణీలో వేగం లోపించింది. వయోజనుల్లో 58ు మందే రెండో డోసు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1.58కోట్ల మంది టీకా రెండో డోసు తీసుకున్నారు. ఈవిషయంలో కరీంనగర్‌ జిల్లా అగ్రభాగాన ఉంది. ఆ జిల్లాలో ఇప్పటివరకు రెండో డోసు వ్యాక్సినేషన్‌ 82% పూర్తయింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 78% మంది, రంగారెడ్డి జిల్లాలో 76ు హన్మకొండ జిల్లాల్లో 75% వయోజనులు టీకా రెండో డోసు తీసుకున్నారు. కాగా, వ్యాక్సినేషన్‌ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై ఆదిలాబాద్‌ ఇమ్యూనైజేషన్‌ విభాగం ఇన్‌చార్జి డాక్టర్‌ విజయ్‌సారధిని బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించింది. 

Updated Date - 2021-12-19T07:26:10+05:30 IST