రాష్ట్రంలో ఒక్క రోజే 12 ఒమైక్రాన్‌ కేసులు

ABN , First Publish Date - 2021-12-19T07:23:18+05:30 IST

రాష్ట్రంలో శనివారం ఒక్క రోజే 12 ఒమైక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఒక్క రోజే 12 ఒమైక్రాన్‌ కేసులు

  • వీరిలో 9 మంది విదేశీయులు.. ముగ్గురు తెలంగాణ వాసులు
  • హైదరాబాద్‌లో సోమాలియా వ్యక్తికి చికిత్స చేసిన వైద్యుడికీ..
  • జనంలోకి వేరియంట్‌.. కట్టడి చేయలేని పరిస్థితి మొదలైందా?
  • నగరంలోని పారామౌంట్‌ కాలనీలో పాజిటివ్‌ వస్తే ఒమైక్రానే?
  • 1,100 మంది స్థానికులకు టెస్టులు.. భారీగా కేసుల నమోదు!
  • వివరాలపై గోప్యత పాటిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు


హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శనివారం ఒక్క రోజే 12 ఒమైక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 9 మంది విదేశీయులు కాగా, ముగ్గురు తెలంగాణకు చెందినవారు. కెన్యా నుంచి వచ్చిన ఆరుగురికి, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరికి, యూఏఈ నుంచి వచ్చిన ఇద్దరికి, ఘనా, టాంజానియా నుంచి వచ్చిన ఒక్కొక్కరికి కొత్త వేరియంట్‌ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో ఇద్దరే ముప్పు జాబితాలోని దేశాల నుంచి వచ్చిన వారు. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమైక్రాన్‌ కేసుల సంఖ్య 20కి పెరిగింది. మరో ముగ్గురి జన్యు విశ్లేషణ ఫలితాలు రావాల్సి ఉంది. కాగా రాష్ట్రంలోని ప్రవేశించిన 4 రోజుల్లోనే ఒమైక్రాన్‌ జనంలోకి వెళ్లిపోయిందా? స్థానిక వ్యాప్తి mమొదలైందా? హైదరాబాద్‌ పారామౌంట్‌ కాలనీలో భారీగా కేసులున్నాయా? అంటే ఔననే సమాధానాలు వస్తున్నాయి.


పారామౌంట్‌ కాలనీలో వందపైగా..?

హైదరాబాద్‌ టోలీచౌకీ ప్రాంతంలోని పారామౌంట్‌ కాలనీలో తొలి ఒమైక్రాన్‌ కేసు నమోదైనప్పటి నుంచి శుక్రవారం సాయంత్రం దాక 1,172 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇందులో వందకుపైగా పాజిటివ్‌లు వచ్చినట్లు తెలుస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ దీనిని ధ్రువీకరించడం లేదు. అయితే, ఇప్పటివరకు ఒమైక్రాన్‌ పాజిటివ్‌గా తేలిన కేసుల్లో ఎక్కువ శాతం టోలిచౌకీ, పారామౌంట్‌ కాలనీలకు చెందిన విదేశీయులేనని సమాచారం. మరోవైపు పారామౌంట్‌ కాలనీలో చేసిన కొవిడ్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినవారిలోనూ విదేశీయులే అధికమని వైద్య సిబ్బంది చెబుతున్నారు. అక్కడ పాజిటివ్‌ వచ్చిందంటే ఒమైక్రానే అని వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఉంటున్నవారిలో 90 శాతం విదేశీయులే. పైగా ఇతర దేశాల నుంచి కొత్తగా ఒక్కరు వచ్చినా.. అంతా గెట్‌  టు గెదర్‌ అవుతుంటారని పరిశీలనలో తేలింది. దీంతో వైద్యశాఖ అంచనా కంటే ఇక్కడ భారీగా పాజిటివ్‌లు నమోదవుతున్నాయి. 


ఓ విధంగా ఒమైక్రాన్‌ స్థానిక వ్యాప్తి మొదలైనట్టేనని వైద్యనిపుణులు చెబుతున్నారు. కాగా, వేరియంట్‌ పుట్టిన దక్షిణాఫ్రికాలో నవంబరు 9న తొలి కేసు వచ్చింది. అప్పటికి రోజూ 500 కొవిడ్‌ కేసు లు వచ్చేవి. ఇప్పుడు 20 వేల వరకు నమోదవుతున్నాయి. వీటిలో 80 శాతం ఒమైక్రాన్‌ కేసులేనని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఈ ఉదాహరణను ప్రస్తావిస్తూ.. విపరీతమైన జన సంచారం ఉండే మనదగ్గర ఒమైక్రాన్‌ను కట్టడి చేయడం కష్టమేనని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఎటువంటి ఆంక్షలు లేవని.. ప్రజలు కూడా సరిగా మాస్క్‌లు ధరించడం లేదని.. భౌతిక దూరం పాటించడం లేదని గుర్తుచేస్తున్నారు. కొవిడ్‌ వ్యాప్తి తొలినాళ్లలో విదేశాల నుంచి వచ్చేవారికి చేతిపై స్టాంపింగ్‌ వేసేవారు. దాంతో కచ్చితంగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చేది. బయటకు వచ్చినా తెలిసిపోయేది. ప్రస్తుతం అటువంటిదేమీ లేదు. దీంతో విదేశాల నుంచి వచ్చినవారు యథేచ్ఛగా తిరుగుతు న్నారు. ఒమైక్రాన్‌ ముప్పు నేపథ్యంలోనూ, వైద్యం పేరుతో ఇక్కడికి వచ్చే విదేశీయులపై కనీస నిఘా ఉండటం లేదు. దాంతో హైదరాబాద్‌ లో వేరియంట్‌ చాలా వేగంగా వ్యాప్తి జరిగేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


కార్పొరేట్‌ ఆస్పతి వైద్యుడికి ఒమైక్రాన్‌

హైదరాబాద్‌లో ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి వైద్యుడికి ఒమైక్రాన్‌ నిర్ధారణ అయింది. ఈ వైద్యుడిని ఆస్పత్రిలో ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సోమాలియా నుంచి వచ్చి.. ఒమైక్రాన్‌ నిర్ధారణ (రాష్ట్రంలో తొలి కేసు ఇతడే) అయిన వ్యక్తి ద్వారా వైద్యుడికి వేరియంట్‌ సోకినట్లు తెలుస్తోంది. సోమాలియా వ్యక్తి తన తండ్రిని వైద్యం కోసం ఈ డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లాడు. మరోవైపు వైద్యుడి కుటుంబ సభ్యులు, ఆయనను కలిసిన ఇతర ఆస్పత్రి సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. వైద్యుడికి మినహా మరెవరికి ఒమైక్రాన్‌ లేదని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. వైద్యుడిని ఇటీవల ఎంతమంది రోగులు కలిశారు? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.


కొత్తగా 185 కరోనా కేసులు

రాష్ట్రంలో శనివారం 41,484 మందికి పరీక్షలు చేయగా 185 మందికి కరోనా నిర్ధారణ అయింది. వైర్‌సతో ఒకరు మృతిచెందారు. ఇంకా 3,761 యాక్టివ్‌ కేసులున్నాయి. తాజా పాజిటివ్‌లలో జీహెచ్‌ఎంసీలో 78, మేడ్చల్‌లో 15, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో 14 చొప్పున నమోదయ్యాయి. కొత్తగా 3.83 లక్షల మంది టీకా పొందారు.

Updated Date - 2021-12-19T07:23:18+05:30 IST