యూఏఈ మరో సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2021-12-08T09:55:37+05:30 IST

అధికారిక పని దినాలను కుదిస్తూ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) మరో సంచలన నిర్ణయం తీసుకొంది.

యూఏఈ మరో సంచలన నిర్ణయం

శుక్ర, శనివారాలకు బదులు.. శని, ఆదివారాలు సెలవు

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి) : అధికారిక పని దినాలను కుదిస్తూ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) మరో సంచలన నిర్ణయం తీసుకొంది.  వారాంతపు సెలవు దినాలను కూడా సవరించింది. కొత్త టైమ్‌టేబుల్‌ ప్రకారం.. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి వారానికి నాలుగున్నర రోజులే అధికారిక పని దినాలు ఉంటా యి. రెండున్నర రోజులు సెలవు. ఇప్పటి వరకూ ముస్లీంల ప్రార్థనల కోసం శుక్రవారం పూర్తిగా సెలవు దినంగా పరిగణించేవారు. ఇకపై శుక్రవారం మధ్యాహ్నం 12గంటల నుంచి సెలవు ఇస్తారు. అవసరమైతే ఆ రోజున ఇంటి నుంచే  విధులు నిర్వర్తించే వెసులుబాటు కల్పించారు. ఏడాది పొడవునా శుక్రవారంనాడు మధ్యాహ్నం నమాజు వేళను 1.15గా నిర్ణయించారు. సోమవారం తిరిగి విధులకు రావాల్సి ఉంటుంది. వారాంతపు సెలవుల్లో మార్పుతో అరబ్‌ యేతర ప్రపంచానికి అనుగుణంగా యూఏఈ  మారిందని అధికారులు పేర్కొన్నారు. పోటీ తత్వాన్ని మెరుగుపరచే లక్ష్యంతోపాటు ప్రపంచ మార్కెట్లు, వాణిజ్యాన్ని పరిగణనలోకి తీసుకొని వారాంతాన్ని శని, ఆదివారాలకు మార్పు చేయడం జరిగిందని తెలిపారు. కాగా.. శుక్ర, శనివారాలు అధికారిక సెలవులకుతోడు ఆదివారం అంతర్జాతీయంగా సెలవు కావడంతో చాలా నష్టపోతున్నామని దుబాయ్‌, అబుదాబి వాణిజ్య వర్గాలు చాలాకాలం నుంచి గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పటికే.. హిందూ, క్రైస్తవుల సంప్రదాయాలకు అనుగుణంగా వారి చట్టాల ప్రాకారమే వివాదాలను పరిష్కరించడానికి ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు.. మద్యపాన నిషేధ ఆంక్షలను సడలించడం తదితర సాహసోపేత నిర్ణయాలను యూఏఈ తీసుకొంది. వాటినీ వచ్చే ఏడాది నుంచి అమలు చేయనుంది.

Updated Date - 2021-12-08T09:55:37+05:30 IST