గౌరవెల్లి నిర్వాసితుల పోరుబాట

ABN , First Publish Date - 2021-12-26T08:53:06+05:30 IST

పరిహారం కోసం గౌరవెల్లి రిజర్వాయర్‌ నిర్వాసితులు పోరుబాట పట్టడం ఉద్రిక్తంగా మారుతోంది. రిజర్వాయర్‌ పనులు మొదలై పద్నాలుగేళ్లు గడిచినా తమకు సరైన న్యాయం చేయలేదని..

గౌరవెల్లి నిర్వాసితుల పోరుబాట

  • 14 ఏళ్లయినా పరిహారం సమస్యలు తీరలేదని ఆందోళన 
  • నెలరోజుల్లో మిగతా 10 శాతం పనుల పూర్తికి చర్యలు
  • తమ సమస్యలు తీర్చాకే పనులు చేపట్టాలని నిర్వాసితుల డిమాండ్‌ 

హుస్నాబాద్‌, డిసెంబరు 25: పరిహారం కోసం గౌరవెల్లి రిజర్వాయర్‌ నిర్వాసితులు పోరుబాట పట్టడం ఉద్రిక్తంగా మారుతోంది. రిజర్వాయర్‌ పనులు మొదలై పద్నాలుగేళ్లు గడిచినా తమకు సరైన న్యాయం చేయలేదని.. పరిహారం చెల్లించిన తర్వాతే పనులు నిర్వాహించాలని నిర్వాసితులు డిమాండ్‌ చేశారు. రిజర్వాయర్‌కు సంబంధించిన మిగతా 10ు పనులను నెలరోజుల్లో పూర్తిచేసి, నీటిని నింపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టగా గురువారం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరిన నిర్వాసితులు పనులను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో గౌరవెల్లి రిజర్వాయర్‌ పనులు ప్రారంభించించి 14 ఏళ్లు దాటాయి. ఆ తర్వాత జిల్లాలో చేపట్టిన రంగనాయకసాగర్‌, కొండపోచమ్మ, మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారమైనా తమకు చెల్లించాల్సిన పరిహారం సమస్య కొలిక్కిరావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనకు దిగిన నిర్వాసితులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. 


సమస్య ఏమిటి?  

గౌరవెల్లి రిజర్వాయర్‌ పనులను 2007లో ప్రారంభించారు. అప్పటి నుంచి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఇప్పటి వరకు మూడు రకాలుగా పరిహారం అందించారు. రిజర్వాయర్‌ నిర్మాణానికి 3,870 ఎకరాలకు గాను.. 3,598 ఎకరాల సేకరణ  పూర్తయింది. 2007-08లో భూములకు గ్రేడుల వారీగా ఎకరానికి రూ.2.10లక్షల చొప్పున పరిహారం అందించారు. ఈ పరిహారం న్యాయసమ్మతంగా లేదని గుర్తించిన ప్రభుత్వం 2015లో 30ఏ ప్రకారం ఎకరానికి రూ.6.95లక్షల చొప్పున చెల్లించింది. దీనిని 272 ఎకరాలకు చెందిన 71 మంది రైతులు వ్యతిరేకిస్తూ.. కోర్టును ఆశ్రయించారు. ఇటీవల దీనికి సంబంధించి ఎకరానికి రూ.15లక్షల చొప్పున పరిహారం చెల్లించి 162 ఎకరాలను సేకరించారు. కోర్టును ఆశ్రయించినవారిలో 110 ఎకరాలకు సంబంధించిన భూ నిర్వాసితులు ఈ పరిహారం డబ్బులు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. మొదట 1.4 టీఎంసీకి సంబంధించి 927 మంది ముంపు బాధితులకు రూ.8లక్షల చొప్పున పునరావాస ప్యాకేజీని అందజేశారు. జాబితాకు ఎక్కని 10 కుటుంబాలకు వడ్డీతో కలిపి రూ.10లక్షలు చెల్లించాలని కోరగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు. అలాగే 2015 జనవరి 1నుంచి 2021 అక్టోబరు 15 వరకు  18 ఏళ్లు నిండిన 338 మంది గుర్తించి వారికి రూ.6లక్షల చొప్పున చెల్లించేందుకు ప్రతిపాదనలు పంపించినట్లు అధికారులు చెబుతున్నారు.


మల్లన్నసాగర్‌ తరహాలో ఇవ్వాలి

మల్లన్నసాగర్‌ నిర్వాసితుల తరహాలో ఆర్‌ అండ్‌ ఆర్‌ పరిహారం చెల్లించి నివాస స్థలాలు ఇవ్వాలని గుడాటిపల్లికి చెందిన నిర్వాసితులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2021-12-26T08:53:06+05:30 IST