గొంతు నులిమి.. గోడకేసి కొట్టి..
ABN , First Publish Date - 2021-10-29T08:10:18+05:30 IST
ఆస్తి కోసం కన్న తల్లినే గొంతు నులిమి.. గోడకేసి కొట్టి.. దారుణంగా కడతేర్చాడో కొడుకు. పైగా తన తల్లిది సహజ మరణంగా చిత్రీకరించేందుకు యత్నించాడు.

- ఆస్తికోసం కన్న తల్లిని హతమార్చిన కొడుకు
చందూరు(వర్ని), అక్టోబరు 28: ఆస్తి కోసం కన్న తల్లినే గొంతు నులిమి.. గోడకేసి కొట్టి.. దారుణంగా కడతేర్చాడో కొడుకు. పైగా తన తల్లిది సహజ మరణంగా చిత్రీకరించేందుకు యత్నించాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. చందూరు మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన ముక్కెర సాయమ్మ (50) పేరిట ఐదు ఎకరాల భూమి ఉంది. దాన్ని తన పేరిట రిజిస్ర్టేషన్ చేయాలంటూ కొంత కాలంగా ఆమెను కుమారుడు ముక్కెర నారాయణ వేధిస్తున్నాడు. భూమి తన పేరిట మార్చాలని బుధవారం కూడా ఒత్తిడి చేశాడు. ఇందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన నారాయణ తన తల్లిని అడ్డుతొలగించుకుంటే భూమి తన సొంతం అవుతుందని వ్యూహం పన్నాడు. ఇందులో భాగంగానే గురువారం తెల్లవారుజామున మద్యం తాగిన నారాయణ.. ఆ తర్వాత ఇంటికి వెళ్లి తల్లి సాయమ్మతో భూమికోసం గొడవ పడ్డాడు. ఈ క్రమంలో తల్లిని హతమార్చాడు. అనంతరం, తన తల్లి రాత్రి ఎప్పటిలాగే నిద్రించిందని, ఉదయం తాను లేచి చూసే సరికి చనిపోయి ఉందని గ్రామస్థులను నమ్మించే ప్రయత్నం చేశాడు. అతడి తీరుపై అనుమానించిన గ్రామస్థులు.. పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం వెలుగు చూసింది.