కరోనా విపత్తులో జర్నలిస్టుల పాత్ర భేష్‌

ABN , First Publish Date - 2021-10-25T08:35:28+05:30 IST

కరోనా కష్టకాలంలో సమాచార సేకరణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేసిన పాత్రికేయులను ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా..

కరోనా విపత్తులో జర్నలిస్టుల పాత్ర భేష్‌

  • ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా గుర్తించేందుకు కృషి చేస్తా
  • ఐజేయూ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి


హైదరాబాద్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): కరోనా కష్టకాలంలో సమాచార సేకరణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేసిన పాత్రికేయులను ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా గుర్తించేలా కృషి చేస్తానని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ (ఐజే యూ) జాతీ య కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి కిషన్‌రెడ్డి అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో జరిగిన చర్చను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి జర్నలిస్టులను ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా గుర్తించేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.


కొవిడ్‌ బాధిత కుటుంబాలను ఆదుకోవాలి

 సమావేశం పలు తీర్మానాలను ఆమోదించింది. దేశవ్యాప్తంగా కొవిడ్‌ బారిన పడి మృతి చెందిన దాదాపు 600 మంది జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ ఏడాది హత్యలకు గురైన ఐదుగురు జర్నలిస్టుల కుటుంబాలకు పరిహారం అందించాలని మరో తీర్మానంలో డిమాండ్‌ చేసింది. దేశంలో జర్నలిస్టులు, మీడియా సంస్థలపై సంఘ వ్యతిరేక శక్తులు, కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలను సమావేశం తీవ్రంగా ఖండించింది. ఇటీవల మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో విలేకరి ప్రవీణ్‌కుమార్‌ గౌడ్‌ ఆత్మహత్య చేసుకోవడం పట్ల ఐజేయూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి సదరు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖను డిమాండ్‌ చేసింది. 

Updated Date - 2021-10-25T08:35:28+05:30 IST