మంత్రులే కబ్జా చేస్తున్నారు

ABN , First Publish Date - 2021-05-08T07:58:47+05:30 IST

దళితులు, ప్రభుత్వ భూములపైన టీఆర్‌ఎస్‌ నేతలు రాబందుల్లా పడి దోచుకుతింటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు.

మంత్రులే కబ్జా చేస్తున్నారు

  • ఆధారాలతో కోర్టుకెళ్తాం : ఉత్తమ్‌ 
  • భూ కబ్జాలపై సంపత్‌ ప్రజంటేషన్‌ 


హైదరాబాద్‌, మే 7(ఆంధ్రజ్యోతి): దళితులు, ప్రభుత్వ భూములపైన టీఆర్‌ఎస్‌ నేతలు రాబందుల్లా పడి దోచుకుతింటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ దోడిడీలపై ఆధారాలతో కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. భూదందాలకు పాల్పడిన వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు లేఖ రాయనున్నట్లు చెప్పారు. అధికార పార్టీ నేతల భూ అక్రమాలపై వివరాలను అందించాలని డీసీసీ అధ్యక్షులను ఉత్తమ్‌ కోరారు. ‘‘గరీబోళ్ల భూముల్లో గులాబీ గద్దలు’’ అనే అంశంపైన ఇందిరా భవన్‌లో శుక్రవారం ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. జూమ్‌ యాప్‌ ద్వారా ఈ కార్యక్రమంలో ఉత్తమ్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ రేవంత్‌ తదితరులు పాల్గొన్నారు. 


సీఎంకు కనిపిపంచడం లేదా: సంపత్‌

తెలంగాణలో భూ కబ్జాలు తారస్థాయికి చేరాయని, మంత్రులే దేవుడి మాన్యాలు, దళితుల భూములను ఆక్రమిస్తున్నారని పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ చేసిన సంపత్‌ ఆరోపించారు. జన్వాడ ఫామ్‌ హౌస్‌ నిర్మాణంలో మంత్రి కేటీఆర్‌ నిబంధనలు ఉల్లంఘించారని, దేవరయాంజాల్‌లో దేవుని భూములనూ ఆక్రమించారన్నారు. మంత్రి మల్లారెడ్డి దేవరయాంజాల్‌లో భూములను ఆక్రమించి ఫామ్‌హౌస్‌ కట్టారని పేర్కొన్నారు. పార్టీ మారినందుకుగాను ఖమ్మం పట్టణంలోని ఎన్‌ఎస్పీకి చెందిన రూ.50 కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు అప్పనంగా ఇచ్చిందని ఆరోపించారు. 


మంత్రి నిరంజన్‌రెడ్డి.. పెబ్బేరు, కొత్తపేట గ్రామాల్లో రూ.కోట్ల విలువైన భూములను ఆక్రమించారని, 200ఎకరాల్లో విలాసవంతమైన ఫామ్‌హౌ్‌సను నిర్మించుకున్నారన్నారు. మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ రూ.కోట్ల విలువైన భూములను ఆక్రమించారని ఆరోపించారు. తలసాని శ్రీనివా్‌స యాదవ్‌.. కుష్ఠు రోగుల ఆస్పత్రి భూముల్ని కూడా వదల్లేదన్నారు. మంత్రి గంగుల కమలాకర్‌ కాజీపూర్‌లోని సర్వే నెం 126లో వక్ఫ్‌ భూములు కబ్జా చేశారని ఆరోపించారు. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి నిర్మల్‌ పట్టణంలో కోట్ల విలువైన 5 ఎకరాలను ఆక్రమించారన్నారు. రాష్ట్ర మంత్రి వర్గంలో మొత్తం 12 మంది మంత్రులపైన భూ కబ్జా ఆరోపణలున్నాయన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో 7 లక్షల ఎకరాలు కబ్జా అయినట్లుగా రియల్టర్ల అసోసియేషన్‌ ఆరోపించిందని తెలిపారు. వీటన్నింటిపైనా సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-05-08T07:58:47+05:30 IST