ప్రశ్నిస్తే దేశద్రోహం కేసులా?
ABN , First Publish Date - 2021-03-17T08:48:02+05:30 IST
దేశద్రోహం కేసులపై లోక్సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. కఠినమైన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి ఆరోపించారు.
- చట్టం దుర్వినియోగమవుతోంది
- లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి
- 2014-19 మధ్య 326 కేసులు
- ఇదేకాలంలో తెలంగాణలో 4 నమోదు
- ఒక్కరికి కూడా శిక్ష పడలేదు
- ఈ కేసుల్లో కేంద్ర ప్రమేయం ఉండదు
- పోలీసు వ్యవస్థ రాష్ట్రాల పరిధిలోనిది
- ప్రజాస్వామ్యంపై మీరు చెప్పక్కర్లేదు
- కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
న్యూఢిల్లీ, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): దేశద్రోహం కేసులపై లోక్సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. కఠినమైన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి ఆరోపించారు. ప్రశ్నించే వారిపై దేశద్రోహం కేసులు పెడుతున్నారని విమర్శించారు. వెంటనే స్పందించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి.. ప్రజాస్వామ్యం గురించి తమకు ఇతరులు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. లోక్సభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో గడిచిన పదేళ్లలో దేశద్రోహం కేసులు ఎన్ని నమోదయ్యాయో తెలపాల ని కోరారు. దోష నిరూపణ శాతం, వేగవంతమైన దర్యాప్తు కోసం చేపట్టిన చర్యలను వెల్లడించాలని అడిగారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి స్పందిస్తూ.. మోదీ సర్కారు వచ్చిన తర్వాత 2014 నుంచి 2019 వరకు దేశవ్యాప్తంగా మొత్తం 326 దేశద్రోహం కేసులు నమోదైనట్లు తెలిపారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఈ కేసులు అతి తక్కువగా నమోదయ్యాయని చెప్పారు. దేశవ్యాప్తంగా 2014లో 47, 2015లో 30, 2016లో 35, 2017లో 51, 2018లో 70, 2019లో 93 కేసులు నమోదయ్యాయని వివరించారు.
తెలంగాణలో 2014 నుంచి 2019 మధ్య 4 దేశద్రోహం కేసులు నమోదయ్యాయని, అందులో ఒక్కరికి కూడా శిక్ష పడలేదని వెల్లడించారు. ఈ కేసుల్లో కేంద్ర ప్రభు త్వ ప్రమేయం లేదని, పోలీసు వ్యవస్థ రాష్ట్రాల పరిధిలో ఉంటుందని చెప్పారు. ఎన్సీఆర్బీ నివేదిక 2019 వరకే అందుబాటులో ఉందని, రాష్ట్రాలు ఇచ్చిన వివరాల మేరకే నివేదిక రూపొందిస్తామని తెలిపారు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే దేశద్రోహం కేసులను కూడా ఈ నివేదికలో చేర్చామని వివరించారు. రేవంత్ మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని విమర్శించడం, ప్రశ్నించడం వంటివి దేశద్రోహం కిందికి రావని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని చెప్పారు. కానీ, దేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై ఐపీసీ 124(ఏ) ప్రకారం దేశద్రోహం కేసులు పెడుతున్నారన్నారు. ఈ కేసుల్లో ఎక్కువగా శిక్షలు పడడం లేదంటే.. రాజకీయ కారణాలతోనే వీటిని నమోదు చేస్తున్నట్లు అర్థమవుతోందని తెలిపారు. అనేక కేసుల్లో ఏళ్ల తరబడి చార్జిషీటులు దాఖలు చేయడం లేదని, విచారణలు ముందుకు సాగడం లేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. రైతు ఆందోళనకు మద్దతు తెలిపినందుకు పర్యావరణ కార్యకర్త దిశా రవిపై కేసు నమోదు చేసినా కోర్టులో పోలీసులు నేరాన్ని రుజువు చేయలేకపోయారని గుర్తుచేశారు. అలాగే రైతుల నిరసనలో పాల్గొన్న అనేక మందిపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు.