ప్రముఖ అనువాదకురాలు వెనిగళ్ల కోమల కన్నుమూత

ABN , First Publish Date - 2021-12-07T08:30:09+05:30 IST

ప్రముఖ అనువాదకురాలు వెనిగళ్ల కోమల కన్నుమూత

ప్రముఖ అనువాదకురాలు వెనిగళ్ల కోమల కన్నుమూత

అమెరికాలో తుదిశ్వాస


హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): సీనియర్‌ అనువాదకురాలు, విశ్రాంత ప్రొఫెసర్‌ వెనిగళ్ల కోమల (86) ఇక లేరు. అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు ఆమె గుండెపోటుతో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కోమల జీవిత సహచరుడు ప్రముఖ హేతువాది, సీనియర్‌ జర్నలిస్టు నరిశెట్టి ఇన్నయ్య. వీరి కుమార్తె నవీన అమెరికాలో సైకియాట్రిస్టు. కుమారుడు రాజు ప్రముఖ జర్నలిస్టు. ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’, ‘వాషింగ్‌టన్‌ పోస్టు’ ఆంగ్ల పత్రికలకు ఎడిటర్‌గానూ, ‘మింట్‌’ వ్యవస్థాపక సంపాదకుడిగా పనిచేశారు.


కోమల స్వస్థలం గుంటూరు జిల్లా మూల్పూరు. ఆంధ్రా యూనివర్సిటీలో బీఏ (ఆనర్స్‌) ఇంగ్లిష్‌ లిటరేచర్‌, ఎంఏ పూర్తి చేశారు. నారాయణగూడలోని మాడపాటి హనుమంతరావు బాలికల ఉన్నత పాఠశాలలో 1961 నుంచి 1968 వరకు ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలోని ఆంగ్ల విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. ఆపై ప్రొఫెసర్‌గా పదోన్నతి పొంది, 1995లో పదవీ విరమణ చేశారు. అమెరికా పౌరసత్వం ఉన్న కోమల, ఇన్నయ్య అక్కడే స్థిరపడ్డారు.

అనువాదాలు..

కోమల అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి పొందిన కొన్ని రచనలను తెలుగులోకి అనువదించారు. బంగ్లా రచయిత్రి తస్లీమా నస్రీన్‌ ‘సోథ్‌’ నవలకు తెలుగు అనువాదం ‘చెల్లుకు చెల్లు’ ‘ఆంధ్రజ్యోతి’ వీక్లీలో ప్రచురితమైంది. కోమల మృతికి పలువురు హేతువాదులు, రచయితలు సంతాపం ప్రకటించారు. ఆమె అంత్యక్రియలు అమెరికాలోనే నిర్వహించనున్నారు. 

Updated Date - 2021-12-07T08:30:09+05:30 IST