కిలో కూడా కొనం

ABN , First Publish Date - 2021-12-19T06:50:29+05:30 IST

‘‘తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతినేలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యాసంగి వరి ధాన్యం కొనబోమని పదే పదే చెబుతోంది.

కిలో కూడా కొనం

 • యాసంగిలో వడ్ల కొనుగోలు కేంద్రాలుండవ్‌
 • ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించండి.. 
 • పత్తి, కంది, వరి సాగుపై దృష్టి పెట్టండి
 • 28 నుంచి రైతుబంధు సొమ్ము చెల్లింపులు.. 
 • సామాజిక పెట్టుబడిగా దళిత బంధు
 • నాలుగు మండలాలకు త్వరలో నిధులు
 • కొత్త జోనల్‌కు అనుగుణంగా ఉద్యోగుల విభజన
 • భార్యాభర్తలకు ఒకేచోట పనిచేసే అవకాశమివ్వండి
 • ఉద్యోగులు మారుమూల ప్రాంతాలకెళితేనే అభివృద్ధి
 • ఒమైక్రాన్‌ వేరియంట్‌పై ఎలాంటి ఆందోళన వద్దు
 • కలెక్టర్లతో ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్‌


హైదరాబాద్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతినేలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యాసంగి వరి ధాన్యం కొనబోమని పదే పదే చెబుతోంది. ఈ దృష్ట్యా వచ్చే యాసంగిలో రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఉండవు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క కిలో వడ్లను కూడా కొనుగోలు చేయదు’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తేల్చి చెప్పారు. ఇది బాధ కలిగించే అంశమే అయినా కేంద్రం మొండి వైఖరి వల్ల ఈ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితులు తలెత్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగి రైతుబంధు సాయాన్ని ఈనెల 28వ తేదీ నుంచి అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు ప్రకటించారు. ప్రారంభమైన వారం, పది రోజుల్లోనే గతంలో మాదిరిగా వరుస క్రమంలో అందరి ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమవుతాయని తెలిపారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన శనివారం ప్రగతి భవన్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రంలో దళిత బంధు అమలు, పురోగతి, తీరుతెన్నులు, రాష్ట్రవ్యాప్తంగా అమలు కోసం చేపట్టాల్సిన చర్యలు, యాసంగి వరి ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ, ఉద్యోగుల విభజన, రైతుబంధు నిధుల విడుదల, కరోనా పరిస్థితి, ఒమైక్రాన్‌ వ్యాప్తి తదితర అంశాలపై విస్తృత స్థాయిలో సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేలా కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర రైతు వ్యతిరేక విధానాల నుంచి రాష్ట్ర రైతాంగాన్ని కాపాడుకునే బాధ్యత కలెక్టర్లు, అధికారులపై ఉందని అన్నారు. యాసంగి వడ్లను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనడం లేదోరైతులకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. యాసంగిలో వరి నాట్లకు బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను సన్నద్ధం చేయాలని నిర్దేశించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న దార్శనిక వ్యవసాయ విధానాలను ఇప్పటి వరకూ స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం అమలు చేయలేదని, ఎన్ని కష్టాలు వచ్చినా వ్యవసాయ అనుకూల విధానాలను ఇలాగే కొనసాగిస్తామని మరోసారి స్పష్టం చేశారు. వానాకాలం పంటల సాగుకు ఏయే పంటలు వేయాలో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి, అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. వానాకాలంలో ప్రధానంగా మూడు పంటలపై అంటే.. పత్తి, కంది, వరి సాగుపై దృష్టి పెట్టాలని కలెక్టర్లు, వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రైతాంగాన్ని ప్రత్యామ్నాయ, లాభసాటి పంటల సాగు దిశగా సమాయత్తం చేయాలన్నారు.


సామాజిక పెట్టుబడిగా ‘దళిత బంధు’

తరతరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం ఆత్మ గౌరవంతో తలెత్తుకునేలా ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ‘దళిత బంధు’ పథకం లక్ష్యమని సీఎం కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. పథకం ద్వారా నూరు శాతం సబ్సిడీ కింద అందించే రూ.10 లక్షలు దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేస్తాయన్నారు. తద్వారా, దళిత బంధు సామాజిక పెట్టుబడిగా మారుతుందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతంగా పటిష్ఠం చేస్తుందని అన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంతోపాటు ఇప్పటికే ప్రకటించిన నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల పరిధిలో దళిత బంధును ముందుగా ప్రకటించిన విధంగా సంతృప్త స్థాయిలో అమలు చేస్తామన్నారు. వాటికి నిధులను త్వరలోనే విడుదల చేస్తామన్నారు. అన్ని నియోజక వర్గాల్లో వంద మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి అమలు చేసే కార్యాచరణను ప్రారంభించాలని కలెక్టర్లను, అధికారులను ఆదేశించారు. ఇందుకు స్థానిక ఎమ్మెల్యేల సూచనలు తీసుకోవాలన్నారు. దశాబ్దాలుగా దళితుల్లో నెలకొని ఉన్న ఆర్తిని అర్థం చేసుకుని, వారికి భరోసా కల్పించేలా పని చేయాలని కలెక్టర్లకు సూచించారు. ‘‘మీకు ఆకాశమే హద్దు. మీరు ఇప్పటి వరకు చేసిన ఏ పనిలోనూ లేని తృప్తి దళిత బంధు పథకం అమల్లో దొరుకుతుంది. మీ జీవితంలో అత్యున్నత కార్యాచరణగా మిగిలిపోతుంది’’ అని ఉద్బోధించారు. 


దళిత కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపర్చేందుకు ఉన్న అన్ని అవకాశాలను, ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లోని అన్ని రకాల వ్యాపార, ఉపాధి మార్గాలను శోధించాలని నిర్దేశించారు. ఈ క్రమంలో దళిత సమాజం అభ్యున్నతి కోసం పాటుపడుతున్న దళిత మేధావులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, దళిత సామాజిక అభివృద్ధికాముకుల సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు. నూతన జోనల్‌ వ్యవస్థ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజనను చేపట్టాలని సీఎం కేసీఆర్‌ కలెక్టర్లకు నిర్దేశించారు. నూతన జోనల్‌ వ్యవస్థతో స్థానిక యువతకు ఉద్యోగాల కల్పనతోపాటు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాలన అమల్లోకి వస్తుందని చెప్పారు. వెనకబడిన, మారుమూల ప్రాంతాల్లోకి కూడా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి పని చేయగలిగితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. నాలుగైదు రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదికను అందజేయాలన్నారు. భార్యాభర్తలైన ఉద్యోగులు (స్పౌజ్‌ కేస్‌) ఒకే ప్రాంతంలో ఉంటేనే వారు ప్రశాంతంగా పని చేయగలుగుతారని తెలిపారు. స్థానిక యువత ఉద్యోగాలకు విఘాతం కలగకుండా మానవీయ కోణంలో స్పౌజ్‌ కేసులను పరిష్కరించాలని ఆదేశించారు.‘ఒమైక్రాన్‌’ గురించి ఆందోళన వద్దు

‘ఒమైక్రాన్‌’ వ్యాప్తి వార్తల నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్‌ పురోగతిని కలెక్టర్లు, వైద్య ఆరోగ్య అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించారు. రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. ఈ సందర్భంగా.. ‘ఒమైక్రాన్‌’ విషయంలో ఆందోళన అక్కర్లేదని, ముఖ్యమంత్రి అన్నారు. తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు.

Updated Date - 2021-12-19T06:50:29+05:30 IST