కాలేజీ క్యాంపస్‌లలో కొలువుల పంట

ABN , First Publish Date - 2021-11-18T07:45:24+05:30 IST

ఐటీ రంగంలో కొత్త నియామకాలు జోరందుకున్నాయి. కరోనా మహమ్మారి నుంచి పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుండటంతో..

కాలేజీ క్యాంపస్‌లలో కొలువుల పంట

  • భారీగా నియామకాలు చేపడుతున్న టెక్‌ సంస్థలు
  • గత 6 నెలల్లోనే నగరంలో 40వేలకు పైగా నియామకాలు 
  • కాగ్నిజెంట్‌, టెక్‌ మహీంద్రా, విప్రోలో అత్యధిక కొలువులు
  • లక్షలాది ఖాళీలను భర్తీ చేసేందుకు
  • క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లపై ఐటీ కంపెనీల దృష్టి 
  • ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ ఎంపికల వెల్లువ
  • కరోనా ఉధృతి తగ్గడంతో ఊపందుకున్న నియామకాలు


హైదరాబాద్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఐటీ రంగంలో కొత్త నియామకాలు జోరందుకున్నాయి. కరోనా మహమ్మారి నుంచి పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుండటంతో.. కళాశాలల్లో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ల సందడి కనిపిస్తోంది. టీసీఎస్‌, కాగ్నిజెంట్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రాలతో పాటు ఇతర ప్రముఖ ఐటీ కంపెనీలు గత ఏడాదితో కంటే ఎక్కువ సంఖ్యలో కొత్త ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. దీంతో హైదరాబాద్‌తో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని కళాశాలల్లో కూడా క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లు జోరుగా సాగుతున్నాయి. ఐటీ సంస్థల నుంచి ఉద్యోగులు తమ కొలువుల్ని వీడుతుండటం ఆసక్తికరం. ఏటా ఇది సాధారణమే అయినా.. ఈ ఏడాది ఆ సంఖ్య మరీ ఎక్కువగా ఉండటమే చర్చనీయాంశం. కరోనా కారణంగా ఇంటి నుంచి విధి నిర్వహణలో సంస్థల తీరు, పనిభారం పెంచడం, ఇతర సంస్థల్లో కొత్త అవకాశాలు, విదేశాల్లో భారత నిపుణులకు పెరిగిన డిమాండ్‌, కొత్త సాంకేతికతల్లో విస్తృత ఉపాధి అవకాశాలు వంటి పలు కారణాలు ఉద్యోగుల నిష్క్రమణ వెనుక ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా కేంద్రంగా ఉన్న కాగ్నిజెంట్‌కు భారత్‌లో 2,04,500 ఉద్యోగులుండగా.. వీరిలో 60వేలకు పైగా ఉద్యోగులు సంస్థను వీడారంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. టీసీఎస్‌, టెక్‌ మహీంద్ర, విప్రో.. ఇలా ప్రధాన సంస్థలన్నీ కలుపుకొంటే దేశవ్యాప్తంగా 2.34 లక్షల మంది ఐటి ఉద్యోగులు రాజీనామా చేశారు. హైదరాబాద్‌లో గత 6 నెలల్లో ఈ సంఖ్య 40వేలు. దీంతో భారీగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు సంస్థలు కొత్త నియామకాలపై దృష్టి సారించాయి.


వేల సంఖ్యలో నియామకాలు.. 

టీసీఎస్‌: ఐటీ రంగంలో ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తున్న దేశీయ దిగ్గజ సంస్థ టీసీఎస్‌. దేశవ్యాప్తంగా 5లక్షలకు పైగా ఉద్యోగులు కలిగిన ఈ సంస్థలో గత ఏడాదికాలంలో 55వేల మంది సంస్థను వీడారు. దీంతో ఈ ఏడాది క్యాంపస్‌, ఆన్‌లైన్‌ నియామకాల ద్వారా కొత్తగా 20,400 మందిని నియమించుకుంది.

 

విప్రో: విప్రోలో ఉద్యోగులు వీడినవారి శాతం 20.5ుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 2 లక్షలకు పైగా ఉద్యోగులు ఉండగా.. భారత్‌లో 1.60 లక్షల మంది ఉన్నారు. గత ఏడాదికాలంలో భారత్‌లో దాదాపు 32వేల మంది సంస్థను వీడటంతో.. ఖాళీల భర్తీపై దృష్టి సారించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో కొత్తగా 20,400 ఉద్యోగులను నియమించుకుంది. వీరిలో అత్యధికులను క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల ద్వారానే ఎంచుకుంది. ఉన్న ఖాళీలతో పాటు కొత్తగా పెద్దసంఖ్యలో ఉద్యోగులను ఎంపికచేయాలన్న లక్ష్యంతో ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది.


కాగ్నిజెంట్‌: అమెరికా కేంద్రంగా ఉన్న కాగ్నిజెంట్‌కు ప్రపంచవ్యాప్తంగా 2,89,500 ఉద్యోగులుండగా.. ఇందులో 2,04,500 (70ు) భారత్‌లోనే ఉన్నారు. ఈ సంవత్సరంలో రెండో త్రైమాసికం నాటికి భారత్‌లో సంస్థలో మూడోవంతు(33ు) మంది ఉద్యోగులు కంపెనీని వీడారు. ఖాళీల భర్తీకోసం కొత్త నియామకాలపై ప్రధానంగా దృష్టిసారించిన సంస్థ.. గత ఏడాది 17వేల మందిని క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్ల ద్వారా ఎంపికచేసుకోగా.. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో మరో 17,200వేల మందిని తీసుకుంది. ఈ ఏడాది ఆఖరునాటికి కొత్తగా మరో 23వేల మందిని నియమించుకోనున్నట్టు ఇటీవలే ప్రకటించింది. 


టెక్‌ మహీంద్రా: భారత్‌లో 1.5 లక్షలకు పైగా ఉద్యోగులు కలిగిన టెక్‌ మహీంద్రాలో గత మూడు నెలల్లో 21ు మంది ఉద్యోగులు కంపెనీ వీడారు. ఐటీ రంగంలో కాగ్నిజెంట్‌ తర్వాత అత్యధిక ఉద్యోగులు వీడిన సంస్థ ఇదే. 3 నెలల్లో క్యాంపస్‌ నియామకాల ద్వారా 14,930 మంది ఉద్యోగులను నియమించుకుంది. 


ఇన్ఫోసిస్‌: 2,79,617 ఉద్యోగులతో ఇన్ఫోసిస్‌ దేశంలో టీసీఎస్‌ తర్వాత ఎక్కువ ఉద్యోగులను కలిగి ఉంది. గత ఏడాది కాలంలో సంస్థను వీడిన ఉద్యోగుల సంఖ్య 20.1%గా ఉంది. గత ఏడాది 35వేల మందిని కొత్త ఉద్యోగులను ఎంపికచేయగా.. ఈ ఏడాది 45వేల మం దిని లక్ష్యంగా పెట్టుకుని నియామకాలు చేపడుతోంది.


ఇతర నగరాల్లోనూ పెద్దఎత్తున.. 

ఐటీ ప్రొడక్ట్‌ డెవల్‌పమెంట్‌, సర్వీసెస్‌ రంగంలో ప్రపంచంలోనే ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ జేపీ మోర్గాన్‌కు దేశవ్యాప్తంగా మొత్తం 35వేల మంది ఉద్యోగులుండగా.. హైదరాబాద్‌లోనే 25వేలమంది ఉన్నారు. కొత్త ఉద్యోగులను ఇప్పటి వరకూ హైదరాబాద్‌లోని కేవలం నాలుగైదు ప్రముఖ ఇంజనీరింగ్‌ కాలేజీల నుంచే ఎంపిక చేస్తూ వచ్చిన సంస్థ.. ఇప్పుడు వరంగల్‌, కరీంనగర్‌లోని కాలేజీలకు వెళ్తోంది. ఇతర సంస్థలు సైతం వర్సిటీ క్యాంప్‌సలతో పాటు ద్వితీయ, తృతీయయ శ్రేణి నగరాల్లోని కాలేజీల్లోనూ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లు నిర్వహిస్తున్నాయి. కరోనాతో రెండేళ్ల పాటు పెద్దగా నియామకాలు లేక నిస్సత్తువగా ఉన్న యువతలో తాజా అవకాశాలు కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

Updated Date - 2021-11-18T07:45:24+05:30 IST