హుజూరాబాద్‌ ఉప ఎన్నికతో ప్రభుత్వం కూలిపోదు

ABN , First Publish Date - 2021-08-25T08:24:56+05:30 IST

‘‘టీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకూ పదుల సంఖ్యలో ఎన్నికలను ఎదుర్కొన్నాం.

హుజూరాబాద్‌ ఉప ఎన్నికతో ప్రభుత్వం కూలిపోదు

  • కేంద్రంలో అధికారంలోకి వచ్చేదీ లేదు
  • అది చిన్న ఉప ఎన్నిక మాత్రమే.. మాకు పెద్ద లెక్క కాదు
  • సెప్టెంబర్‌ 2న ఢిల్లీ ఆఫీసుకు పునాది
  • నవంబరులో ఘనంగా టీఆర్‌ఎస్‌ ద్వి దశాబ్ది ఉత్సవ సభ: కేటీఆర్‌


హైదరాబాద్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ‘‘టీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకూ పదుల సంఖ్యలో ఎన్నికలను ఎదుర్కొన్నాం. వాటిలో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కూడా ఒకటైతది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. హుజూరాబాద్‌ చిన్న ఉప ఎన్నిక. దాంతో, ప్రభుత్వం కూలిపొయ్యేది లేదు. మేం వెంటనే కేంద్రంలో అధికారంలోకి వచ్చేదీ లేదు. చిన్న ఉప ఎన్నిక గురించి ఆదుర్దా, హైరానా పడాల్సిన అవసరం లేదు’’ అని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. పార్టీ పుట్టినప్పటి నుంచీ అప్పట్లో కమలాపూర్‌ అయినా, ఇప్పటి హుజూరాబాద్‌ అయినా అండగానే ఉందని, రేపు కూడా అండగానే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.


2001లో పార్టీ ఏర్పాటు కాగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్‌ ఎన్నికల్లో అక్కడి ప్రజలు టీఆర్‌ఎ్‌సను గెలిపించారని, ఈటల రాజేందర్‌ 2003లో పార్టీలో చేరి తర్వాత ఎమ్మెల్యే అయ్యారని గుర్తు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగింది. అనంతరం సమావేశం వివరాలను కేటీఆర్‌ విలేకరులకు వెల్లడించారు. సమావేశంలో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అనే ప్రస్తావనే రాలేదని చెప్పారు. రెండున్నర గంటలపాటు జరిగిన సమావేశంలో మొత్తం దానిపైనే చర్చించామని ఎవరైనా అనుకుంటే అది వారి వెర్రితనమే అవుతుందని అన్నారు. ఉప ఎన్నిక చర్చ నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాతే వస్తుందన్నారు. నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత కార్యవర్గం మళ్లీ సమావేశమై ఉప ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తామన్నారు. ఇతర రాజకీయ పార్టీల మనసంతా ఉప ఎన్నిక చుట్టే పరిభ్రమిస్తుండవచ్చునని, కానీ.. తాము ఎదుర్కొన్న ఎన్నో ఎన్నికల్లో అది కూడా ఒకటని, అది తమకు పెద్ద లెక్క కూడా కాదని వ్యాఖ్యానించారు. 


పని చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఎలా ఆశీర్వదిస్తారో వరుసగా గెలుపులు చూపించాయని, ఈ ఎన్నికలోనూ ప్రజల ఆశీర్వాదం తమకే అనుకూలంగా ఉంటుందన్న ధీమాను వ్యక్తం చేశారు. దళిత బంఽధుకు సంబంధించి ప్రతిపక్షాలు, పని లేని కొంతమంది పిచ్చి ప్రేలాపనలను తాము పట్టించుకోబోమన్నారు. 75 ఏళ్లలో అధికారంలో ఉన్నప్పుడు తాగునీరు, కరెంటు ఇవ్వలేని, పేదరిక నిర్మూలన చేయలేని అసమర్థుల పిచ్చి ప్రేలాపనలకు తాము స్పందించబోమని అన్నారు. ‘‘ఏ సామాజిక, ఆర్థిక విశ్లేషణ తీసుకున్నా కడు పేదరికంలో ఉన్నది దళితులే. దారిద్య్ర రేఖకు అట్టడుగున ఉన్న ఒక జాతిని పైకి తీసుకురావాలన్న మంచి సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ఈ కార్యక్రమం తీసుకుంటే కోడిగుడ్డుపైన ఈకలు పీకుతున్నారు. రెండు జాతీయ పార్టీలూ.. అవి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దళిత బంధును, వారు డిమాండ్‌ చేస్తున్నట్లుగా బీసీ బంధునూ అమలు చేయవచ్చు కదా! పనికి మాలిన మాటలు మాట్లాడే వారికి చిత్తశుద్ధి ఉంటే.. హుజూరాబాద్‌లో పైలెట్‌గా అమలు చేస్తున్న దళిత బంధులో వారూ వచ్చి పాలు పంచుకోవచ్చు కదా! ఈ కార్యక్రమం కింద ఇచ్చే రూ.10 లక్షలను రూ.20.. 30 లక్షలు ఎట్లా చేయాలన్న దానిపై గైడ్‌ చేస్తే మేమేమీ వద్దనము కదా!’’ అని వ్యాఖ్యానించారు. ఎంతసేపూ వారి మనసు ఉప ఎన్నికల చుట్టే పరిభ్రమించడం ఎందుకని ప్రశ్నించారు.


దళితబంధు పైలెట్‌ ప్రాజెక్టు హుజూరాబాద్‌లో విజయవంతమైతే దేశమంతా తెలంగాణ వైపు చూస్తుందని అన్నారు. దేశానికి తాము మార్గదర్శకులు (టార్చ్‌ బేరర్‌)గా మారాలనుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి ఎప్పటికైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అని అన్నారు.


సెప్టెంబరులో సంస్థాగతంగా పార్టీ నిర్మాణం

సెప్టెంబరులో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేసుకోబోతున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు. రాష్ట్రంలోని 25 జిల్లాల్లో ఇప్పటికే పార్టీ కార్యాలయాల నిర్మాణం పూర్తయిందని, హైదరాబాద్‌, వరంగల్‌ మినహా మిగిలిన జిల్లాల్లోనూ 80 నుంచి 90 శాతం మేరకు పూర్తయ్యాయని చెప్పారు. వాటిని కూడా పూర్తి చేసి జిల్లా కార్యాలయాలన్నింటినీ అక్టోబర్‌లో ప్రారంభించాలని కార్యవర్గ సమావేశంలో సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని తెలిపారు. విజయ దశమి పండుగకు అటు ఇటుగా అవన్నీ కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభం కానున్నట్లు చెప్పారు. ఢిల్లీలో కూడా పార్టీ భవన నిర్మాణానికి సెప్టెంబరు 2న సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేయనున్నట్లు వెల్లడించారు. హస్తినలో భవన నిర్మాణానికి 1200 గజాల భూమిని ఇప్పటికే కేటాయించిన సంగతి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొననున్నట్లు చెప్పారు. అదే రోజు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లోనూ పార్టీ గ్రామ, వార్డు కమిటీల నిర్మాణ ప్రక్రియ కూడా ప్రారంభం కానున్నట్లు వివరించారు. వీటి నిర్మాణం పూర్తయ్యాక.. మండల, మున్సిపల్‌, పట్టణ, జిల్లా కమిటీల నిర్మాణాన్నీ సెప్టెంబరులోనే పూర్తి చేసుకోబోతున్నట్లు తెలిపారు. అనంతరం, సరికొత్త రాష్ట్ర కమిటీని కూడా వేసుకుంటామని చెప్పారు.


నవంబరులో ద్వి దశాబ్ధి ఉత్సవ సభ

ఈ ఏడాది అక్టోబర్‌ చివర్లోగానీ.. లేకుంటే నవంబర్‌లో కానీ టీఆర్‌ఎస్‌ ద్వి దశాబ్ధి ఉత్సవ సభను ఘనంగా నిర్వహించాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించిందని కేటీఆర్‌ వెల్లడించారు. కరోనా పరిస్థితుల కారణంగా రెండేళ్లుగా పార్టీ ప్లీనరీని, వార్షికోత్సవ సభలనూ నిర్వహించుకోలేకపోయామని, పరిస్థితులను బట్టి ద్వి దశాబ్ధి ఉత్సవ సభను నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చామని చెప్పారు.

Updated Date - 2021-08-25T08:24:56+05:30 IST