విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యత

ABN , First Publish Date - 2021-12-19T07:39:16+05:30 IST

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఫెయిల్‌ కావడం, వారిలో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడటానికి ప్రభుత్వమే కారణమని ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు ఆరోపించాయి.

విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యత

వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి.. 

ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాల డిమాండ్‌


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఫెయిల్‌ కావడం, వారిలో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడటానికి ప్రభుత్వమే కారణమని ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశాయి. విద్యార్థులకు న్యాయం చేయాలంటూ శనివారం నాంపల్లిలోని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయం ఎదుట ఏబీవీపీ, ఎన్‌ఎ్‌సయూఐ, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ ధర్నా నిర్వహించాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారుల వైఫల్యం కారణంగా ఫలితాల్లో గందరగోళం తలెత్తిందని ఏబీవీపీ ఆరోపించింది.  ఉచితంగా పరీక్ష పత్రాల రీవాల్యుయేషన్‌ జరిపించాలని కోరింది. ఏబీవీపీ కార్యకర్తలు ఇంటర్‌ బోర్డు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర నాయకులు శ్రీహరి, ప్రశాంత్‌రెడ్డి, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ ప్రధాన కార్యదర్శి రవీందర్‌ మాట్లాడుతూ.. కరోనా కాలంలో విద్యార్థులకు ప్రత్యక్ష క్లాసులు చెప్పకుండా ఆన్‌లైన్‌లో తూతూ మంత్రంగా బోధించారని ఆరోపించారు.


పరీక్షలు రాసిన విద్యార్థులందరినీ బేషరతుగా పాస్‌ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అఽధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.  ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. శనివారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి బషీర్‌బాగ్‌లోని విద్యాశాఖ మంత్రి కార్యాలయ ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. విద్యార్థులెవరూ ఆత్మహత్యకు పాల్పడవద్దని, సీఎంను ఒప్పించి అందరినీ పాస్‌ చేయిస్తామని అన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరీక్ష రాసిన ప్రతి విద్యార్థినీ పాస్‌ చేయించాలని, ప్రతి సబ్జెక్ట్‌కు 30 గ్రేస్‌ మార్కులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాగా, ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్యకు కారణమైన ప్రభుత్వం, ఇంటర్‌ బోర్డు వైఖరికి నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్‌ కాలేజీల బంద్‌ నిర్వహిస్తున్నట్లు ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 


మార్కుల కన్నా జీవితం విలువైనది..

విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం విజ్ఞప్తి చేశారు. పరీక్షలు, మార్కుల కంటే కూడా జీవితం విలువైనదని గుర్తుంచుకోవాలన్నారు. ఈ విషయంలో సమాజం కూడా మేల్కొనాలని ఓ ప్రకటనలో సూచించారు. గ్లోబరీనా సంస్థ తప్పదం వల్ల గతంలోనూ ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆ ఘటన పునరావృతం కావడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.  సిలబస్‌ తగ్గించినా ఉత్తీర్ణత శాతం ఇంత తక్కువగా రావడాన్ని బట్టి బోధన సరిగా జరగలేదని అర్థమవుతోందన్నారు. పరీక్షలతో సంబంధం లేకుండా విద్యార్థులందరినీ ప్రమోట్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. చనిపోయినవారి కుటుంబాలను ఆదుకోవాలన్నారు. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు.  ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. కాగా, సీఎం కేసీఆర్‌ సుపుత్రుడి నిర్వాకం వల్ల గత ఏడాది 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రిపరేషన్‌కు సమయం ఇవ్వకుండా ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి విధ్యార్థులు ఫెయిల్‌ అయ్యేలా చేసిందని వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. మరికొందరు విద్యార్థులు చనిపోక ముందే.. గ్రేస్‌ మార్కులు వేసి పాస్‌ చేస్తారో, లేక ఫస్టియర్‌ ఫలితాలను రద్దు చేసి అందరినీ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలకు ప్రిపేర్‌ కావాలని చెబుతారో ప్రభుత్వం త్వరగా నిర్ణయించాలని ట్విటర్‌లో  డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-12-19T07:39:16+05:30 IST