హుజూరాబాద్‌లో ‘దళిత బంధు’కు 500 కోట్లు

ABN , First Publish Date - 2021-08-10T07:20:10+05:30 IST

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళిత బంధు పథకం అమలుకు ప్రభుత్వం రూ.500 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు ఎస్సీ అభివృద్ధి

హుజూరాబాద్‌లో ‘దళిత బంధు’కు 500 కోట్లు

’ఎస్సీ కార్పొరేషన్‌ ఖాతా నుంచి కలెక్టర్‌కు బదిలీ

వాసాలమర్రి తరహాలోనే లబ్ధిదారుల ఎంపిక

ఇతర నియోజకవర్గాల్లోనూ వివరాల సేకరణ


హైదరాబాద్‌/కమలాపూర్‌, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళిత బంధు పథకం అమలుకు ప్రభుత్వం రూ.500 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళిత బంధును అమలు చేసేందుకు రూ.500 కోట్లు అవసరమని జిల్లా కలెక్టర్‌ చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఎస్సీ కార్పొరేషన్‌ ఎండీ కరుణాకర్‌ తమ ఖాతా నుంచి తక్షణమే రూ.500 కోట్లు జిల్లా కలెక్టర్‌ ఖాతాకు బదిలీ చేశారు.


దళిత బంధు హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించాలని మొదట అనుకున్నా.. సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామం వాసాలమర్రిలో మొదట ప్రారంభమైంది. వాసాలమర్రిలో అమలు చేస్తున్న శాచురేషన్‌ పద్ధతి తరహాలోనే హూజూరాబాద్‌ నియోజకవర్గంలోనూ దళితబంధు పథకం అమలు చేయనున్నారు. కాగా, వాసాలమర్రి, హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఏర్పాటైన కమిటీలు దళిత కుటుంబాల నుంచి వివరాలు సేకరిస్తున్నాయి. ఇతర నియోజక వర్గాల్లోని దళిత వాడల్లో స్థానిక అధికారుల బృందాలు పర్యటించి వివరాలు సేకరిస్తున్నాయి. దీంతో ఎంత మందికి దళిత బంధు వర్తిస్తుందనేదానిపై ఒక అంచనాకు రానున్నారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించి ఇప్పటికే తమ వద్ద ఉన్న వివరాలతో బేరీజు వేసుకుని లబ్ధిదారుల్ని ఎంపిక చేసే అవకాశం ఉంది.


‘దళిత బంధు’ అమలుపై సంబరాలు..

దళిత బంధు పథకానికి రూ.500 కోట్ల నిధులు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌లో సోమవారం సంబరాలు నిర్వహించారు. కమలాపూర్‌లోని అంబేద్కర్‌ విగ్రహానికి ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తదితరులు క్షీరాభిషేకం చేశారు. బాణసంచా కాల్చి, స్థానికులకు స్వీట్లు పంపిణీ చేశారు. దళిత జాతి ఆత్మబంధువు సీఎం కేసీఆర్‌ అని బాల్క సుమన్‌ అన్నారు. ఈటల మంత్రి అయ్యాడంటే సీఎం కేసీఆర్‌ పెట్టిన భిక్ష అని చెప్పారు. ఆయనపై మామూలు కార్యకర్తను పెట్టి ఓడిస్తామని అన్నారు.

Updated Date - 2021-08-10T07:20:10+05:30 IST