అప్పుల బాధతో ఇద్దరు గిరిజన రైతుల బలవన్మరణం

ABN , First Publish Date - 2021-12-26T08:33:45+05:30 IST

రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం ఇద్దరు గిరిజన రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.

అప్పుల బాధతో ఇద్దరు గిరిజన రైతుల బలవన్మరణం

పెద్దవూర, డిసెంబరు 25: రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం ఇద్దరు గిరిజన రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం రామన్నగూడెంతండాలో గిరిజన రైతు మంచర్ల శంకర్‌(65) పత్తిసాగుకు పెట్టుబడి కోసం దాదాపు రూ.7లక్షల వరకు అప్పు చేశాడు. ఆశించిన స్థాయిలో దిగుబడి రాక నష్టం వచ్చింది. దీంతో అప్పులు తీర్చే మార్గం కానరాక వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం పొలం వెళ్లి తిరిగి రాకపోవటంతో కుటుంబీకులు పలు చోట్ల గాలించారు. చివరకు బావి దగ్గర చెప్పులు కనిపించటంతో బావిలో గాలించగా శవం లభ్యమైంది. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం మేగ్యాతండాలో మాలోతు శ్రీను(32)కు ఆరు ఎకరాల్లో పత్తి, మిర్చి సాగు చేశాడు. మిర్చి పంటకు తెగుళ్లు సోకడంతో దిగుబడి రాక పెట్టుబడి రూ.3 లక్షలు నష్టపోయాడు. దీంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. 

Updated Date - 2021-12-26T08:33:45+05:30 IST