తొలి డోస్ బంద్
ABN , First Publish Date - 2021-05-08T08:39:29+05:30 IST
రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడిన వారికీ కరోనా టీకా తొలిడోసు అందడం కష్టతరంగానే మారింది. శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ టీకా కేంద్రాల్లో రెండో డోసు మాత్రమే వేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

- నేటి నుంచి 12 వరకు రెండో డోసు వారికే టీకా
- ఇప్పటికే చేసుకున్న రిజిస్ట్రేషన్లు రద్దు
- లబ్ధిదారుల ఫోన్లకు మెసేజ్‌లు
- మొదటి డోస్‌కు జూలైదాకా ఆగాల్సిందే
- రెండో డోసు వారికి ‘స్పాట్ రిజిస్ట్రేషన్’
- రెండో డోసు వారికే స్లాట్లు బుక్
- అయ్యేలా ‘కొవిన్’లో మార్పులు?
- కేంద్రాన్ని కోరనున్న తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్, మే 7 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడిన వారికీ కరోనా టీకా తొలిడోసు అందడం కష్టతరంగానే మారింది. శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ టీకా కేంద్రాల్లో రెండో డోసు మాత్రమే వేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రెండోడోసు వారు ప్రభుత్వ కేంద్రాలకు నేరుగా వచ్చి స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకొని వ్యాక్సిన్ తీసుకోవాలని కోరింది. ఇందుకుగానూ తొలిడోసు తీసుకున్నట్లు ఆధారాన్ని (ఫోన్లో వచ్చిన మెసేజ్) చూపించాల్సి ఉంటుంది. కొవిషీల్డ్ తీసుకుంటే ఆరు వారాల తర్వాత, కొవాగ్జిన్ తీసుకుంటే నాలుగు వారాల తర్వాత సెకండ్ డోసుకు రావాలని కోరింది. రెండో డోసు వారి కోసం ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం తొలిడోసు ఎవరికీ ఇవ్వడం లేదని పేర్కొంది. మే 8 నుంచి 12 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించింది. టీకాల కొరత కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టీకా తొలి డోసు బుక్ చేసుకున్న వారి సెల్ఫోన్లకు.. స్లాట్లు రద్దయినట్లు శుక్రవారంసమాచారం వెళ్లింది.
ప్రస్తుతం రెండో డోసు ఇవ్వాల్సిన పరిస్థితుల నేపఽథ్యంలో 45 ఏళ్లకు పైబడిన వారికి సరిపడా టీకాలు లభ్యమవడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. జూన్‌లో కూడా రెండో డోసే వేయాల్సి ఉండటంతో జూలై నుంచి మొదటి డోసు దొరికే అవకాశం ఉంది. తెలంగాణలో ఏప్రిల్‌లో 30 లక్షల మంది తొలిడోసు తీసుకున్నారు. వారికి మే, జూన్ నెలల్లో రెండో డోసు ఇవ్వాలి. ఒక్క మేలోనే 19,92,255 మందికి రెండో డోసు ఇవ్వాలి. మే 15 నాటికే ఐదు లక్షల మందికి సెకండ్ డోసు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రం వద్ద 3,74,900 డోసులే ఉన్నాయి. మే 15 నాటికి మరో 3.11 లక్షల డోసులు వస్తాయి. ఇందులో 4.69 లక్షల కొవిషీల్డ్, 2.16 లక్షల కొవాగ్జిన్ డోసులు కలిపితే మే 15 నాటికి వేచి ఉన్న రెండోడోసు లబ్ధిదారులకు సరిపోగా, మరో 1.86 లక్షల డోసులే మిగులుతాయి. మే 15 నుంచి 30 మధ్య 14.92 లక్షల మందికి రెండో డోసు ఇవ్వాలి. అంటే మే 15 నుంచి ప్రతిరోజు లక్ష మందికి టీకాలివ్వాలి.
ఆ రోజు నాటికి ఉండే నిల్వలు పోగా మరో 13 లక్షల డోసులు కావాలి. కేంద్రం మే 15-30 మధ్య అన్ని డోసులు పంపితేనే అందరికీ రెండో డోసు అందించడం సాధ్యమవుతుంది. పంపకుంటే 13 లక్షల మందికి రెండో డోసు దొరకదు. మే 1 నుంచి రాష్ట్రంలో టీకాల కొరత కారణంగా 45 ఏళ్లకు పైబడిన వారంతా కొవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుంటే వ్యాక్సిన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వారంతా రిజిస్టర్ చేసుకున్నారు. రెండో డోసు వారితో పాటు తొలి డోసు వారికి కూడా స్లాట్లు బుక్ అయ్యాయి. ప్రస్తుత నిల్వల ప్రకారం టీకాలిస్తే రెండో డోసు వారికి వ్యాక్సిన్ దొరకదు. దీంతో సెకండ్ డోసు వారికే టీకాలివ్వాలని సర్కారు నిర్ణయించింది. శనివారం నుంచి టీకా కేంద్రాలకు వచ్చి స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకొని, రెండో డోసు తీసుకోవచ్చని ప్రకటించింది.
ఆరు లక్షల మంది ఎదురుచూపులు..
ఒకేసారి అంతా వ్యాక్సిన్ కేంద్రాలకు రాకుండా నివారించేందుకు సెకండ్ డోసు వారికి కూడా స్లాట్ బుక్ చేసుకోవాలనే నిబంధన పెట్టనున్నారు. ఇందుకు అనుగుణంగా కొవిన్ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియంతా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. కొవిన్ పోర్టల్‌లో కేవలం రెండోడోసు వారే స్లాట్ బుక్ చేసుకునేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో మే 6 వరకు మొత్తం 7,57,516 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇందులో ఓ లక్షన్నర మంది సెకండ్ తీసుకొని ఉంటారని అంచనా. మిగిలిన ఆరు లక్షల మంది సెకండ్ డోసు కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రైవేటులోనూ రెండో డోసు దొరకడం కష్టంగా మారింది. దీంతో అక్కడ తొలిడోసు తీసుకున్న వారు, ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో రెండో డోసు తీసుకునే వెసులుబాటు కల్పించామని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు శుక్రవారం ప్రకటించారు.
ఆక్సిజన్ ట్యాంకర్లను సమకూర్చండి: సీఎస్
వివిధ రాష్ట్రాల నుంచి ఆక్సిజన్‌ను తెప్పించడానికి అదనపు ట్యాంకర్లను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం బీఆర్కే భవన్లో రవాణా, ఆర్టీసీ అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం 30 వరకు ట్యాంకర్లు అందుబాటులో ఉన్నాయని, మరికొన్నింటిని సమకూర్చడానికి ప్రైవేటు సంస్థలతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచించారు. ఆక్సిజన్ ఎక్స్‌ప్రె్‌సల విషయంలో రైల్వే శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. అంగూల్ నుంచి ఆక్సిజన్‌ను తెప్పించడానికి ఆరు రోజుల సమయం పడుతుందన్నారు. కార్గో విమానాల ద్వారా సులభంగా తరలించడానికి అనువుగా ట్యాంకర్లకు తగిన మార్పులు చేయాలన్నారు.
