ప్రాణాల కోసం పోరాటం
ABN , First Publish Date - 2021-05-20T07:50:42+05:30 IST
బ్లాక్ ఫంగస్ బాధితుల కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన కోఠి ఈఎన్‌టీ నోడల్ ఆస్పత్రిలో కనీసం బెడ్లు, ఆక్సిజన్ వసతులు లేక..

- కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిలో బ్లాక్‌ఫంగస్ బెడ్లు ఫుల్
- గుంటూరు నుంచి ఆ ఆస్పత్రికి బ్లాక్ ఫంగస్ బాధితుడు
- స్థానికేతరులను చేర్చుకోబోమని తెగేసి చెప్పిన వైద్యులు
- ఏడు గంటలపాటు స్ట్రెచర్‌పైనే విషమస్థితిలో బాధితుడు
- ఆస్పత్రిలో ఉన్న ఆక్సిజన్ బెడ్లు 7.. సీటీ స్కాన్ లేదు
- వివిధ కారణాలతో రోగులను గాంధీకి పంపేస్తున్నారు
మంగళ్‌హాట్, మే 19 (ఆంధ్రజ్యోతి): బ్లాక్ ఫంగస్ బాధితుల కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన కోఠి ఈఎన్‌టీ నోడల్ ఆస్పత్రిలో కనీసం బెడ్లు, ఆక్సిజన్ వసతులు లేక.. ఆ ఆస్పత్రి ముందు రోగులు ప్రాణాల కోసం పోరాడుతున్నారు. నానా తంటాలు పడి కరోనాను జయించినా.. బ్లాక్ ఫంగస్ కారణంగా మళ్లీ ఆస్పత్రి వద్ద చికిత్సల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని కన్నీరు పెడుతున్నారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడ ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి పరిశీలనలో కంటతడి పెట్టించే పలు దృశ్యాలు కనిపించాయి. ఉదాహరణకు.. కరోనా నుంచి ఇటీవలే కోలుకున్న గుంటూరువాసి కొండయ్య (70) బ్లాక్ ఫంగ్‌సతో బాధపడుతుండడంతో కుటుంబసభ్యులు ఆయన్ను ఈ ఆస్పత్రికి తీసుకొచ్చారు. బుధవారం ఉదయం 10 గంటలకు కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రికి ఆయన్ను తీసుకురాగా.. సాయంత్రం 4.30 దాకా ఆస్పత్రి ప్రాంగణంలో స్ట్రెచర్‌పైనే అపస్మారక స్థితిలో ప్రాణాల కోసం పోరాడుతూ కనిపించారు. తొలుత కొండయ్య రిపోర్ట్స్‌ను పరిశీలించిన అక్కడి వైద్య సిబ్బంది.. స్థానికేతరులను ఆస్పత్రిలో చేర్చుకోబోమని చెప్పారు. తమపై దయచూపాలని కొండయ్య సహాయకులు వేడుకోవడంతో.. మరోసారి రిపోర్ట్స్ చూసి, ఫంగస్ ఆయన మెదడుకు వ్యాపించిందని తమ వద్ద చికిత్స చేయడం కుదరదని సాయంత్రానికి చెప్పారు. కనీసం ఎక్కడికి వెళ్లాలో చెప్పాలని వేడుకున్నప్పటికీ స్పందించ లేదు. ఆస్పత్రిలో ఒకవైపు ఇలా జరుగుతుండగా.. మధ్యాహ్నం దాకా చూసిన అంబులెన్స్ డ్రైవర్, కొండయ్యను స్ట్రెచర్‌పై వదిలేసి వెళ్లిపోయాడు. ఏడు గంటలపాటు అలాగే స్ట్రెచర్‌పై ఉన్న కొండయ్య గొంతు తడిపేందుకు బంధువులు ద్రవపదార్ధాలను నోట్లో పోస్తుండడం అక్కడున్న వారిని సైతం కంటతడి పెట్టించింది. కనీసం ఆసుపత్రిలోకి తీసుకువెళ్లి సెలైన్ పెట్టే దిక్కు కూడా లేకుండా పోయిందని రోగి బంధువులు, అక్కడున్నవారు ఆవేదన వెలిబుచ్చారు. సాయంత్రం 5 గంటల తర్వాత కొండయ్యను తీసుకుని వెళ్లిపోయినట్టు సమాచారం.
సిరిసిల్ల నర్సవ్వ...
సిరిసిల్ల ప్రాంతానికి చెందిన నర్సవ్వ(70) అనే వృద్ధురాలికి 15 రోజుల క్రితం పాజిటివ్ వచ్చింది. కుటుంబసభ్యులు ఆమెను సిరిసిల్లలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించడంతో కోలుకున్నారు. మూడు రోజుల క్రితం నర్సవ్వకు కన్నుపై వాపు రావడంతో మరోమారు వైద్యులను సంప్రదించారు. వెంటనే అడ్మిట్ చేసుకున్న వైద్యులు మూడు రోజుల పాటు పరీక్షలేవీ చేయకుండానే గడిపి.. కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రి తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈఎన్‌టీ ఆస్పత్రికి అంబులెన్స్‌లో ఆమెను తీసుకొచ్చారు. అప్పటికే ఆమె ఆక్సిజన్‌పై ఉన్నారు. కానీ.. ఆమె రిపోర్టులు సరిగ్గా లేవంటూ వైద్యులు ఆమెను అడ్మిట్ చేసుకోలేదు. కనీసం ర్యాపిడ్ టెస్ట్ చేసి అడ్మిట్ చేసుకోవాలని కోరగా.. తమ వద్ద లేదని, ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ చేయించి అందులో కొవిడ్ నెగెటివ్ అని వస్తేనే అడ్మిట్ చేసుకుంటామని చెప్పారు. ఆమె పరిస్థితి బాగోలేదని.. అప్పటికే ఆక్సిజన్‌పై అంబులెన్స్‌లో ఉందని కుటుంబసభ్యులు వేడుకున్నారు. దీనికి ఆస్పత్రి సిబ్బంది.. తమ ఆస్పత్రిలో ఆక్సిజన్ బెడ్స్ లేవని, గాంధీకి తీసుకువెళ్లాలని.. సూచించారు. దీంతో సాయంత్రం 5 గంటల సమయంలో ఆమెను గాంధీకి తీసుకువెళ్లారు.
సూర్యాపేట యువతికీ..
సూర్యాపేటకు చెందిన ఓ యువతికి బ్లాక్ ఫంగస్ సమస్య రావడంతో ఆమెను బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఈఎన్‌టీకి తీసుకువచ్చారు. ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉండడంతో అంబులెన్స్‌లోనే కదలలేని స్థితిలో ఉంది. మధ్యాహ్నం 2 గంటల వరకూ అడ్మిషన్ కోసం ఆమె బంధువులు ప్రయత్నించగా.. బెడ్స్ ఖాళీగా లేవంటూ వేచి చూసేలా చేశారు. చివరకు.. కొవిడ్ నెగెటివ్ రిపోర్టు చూపనిదే చేర్చుకోవడం కుదరదని చెప్పారు. కనీసం ఆసుపత్రిలో ర్యాపిడ్ టెస్ట్ చేసి అడ్మిట్ చేసుకోవాలని వేడుకోగా.. మధ్యాహ్నం తరువాత తమ వద్ద ర్యాపిడ్ టెస్ట్ లేదని ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ చేయించిన తరువాత అందులో నెగెటివ్ వస్తే తప్ప అడ్మిట్ చేసుకునేది లేదని వైద్య సిబ్బంది తేల్చి చెప్పారు. దీంతో చేసేది లేక అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి పయనమయ్యారు. సూర్యాపేట నుంచి ఈఎన్‌టీకి రోగిని తీసుకువచ్చినందుకు అంబులెన్స్ డ్రైవర్‌కు రూ.11 వేలు చెల్లించారు. అక్కడి నుంచి గాంధీకి వెళ్లేందకు మరో రూ.2,500 చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇలాంటి దృశ్యాలు అక్కడ నిత్యం కనిపిస్తున్నాయి.
ఏమీ లేవు!
బ్లాక్ ఫంగస్ విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వం కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిని నోడల్ కేంద్రంగా ప్రకటించి చేతులు దులుపుకొంది. ఆ ఆస్పత్రిలో ఆక్సిజన్ బెడ్స్ 7 మాత్రమే ఉన్నాయి. ఇక బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు అత్యంత ముఖ్యమైంది సీటీ స్కాన్ యంత్రం. అలాంటి సీటీ స్కాన్ యంత్రం పాడైపోయి ఆరు నెలలు కావస్తోంది. ఎంఆర్‌ఐ స్కానింగ్ సౌకర్యం అసలే లేదు. ఒక్కో రోగికి రోజుకు 4 చొప్పున యాంపోటెరిసిన్ బి ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. వీటి కోసం ఇండెంట్ పంపించారు. రోగులు ఇంజెక్షన్ల కోసం వేచిచూస్తున్నారు.
పడకలు ఫుల్...
200 పడకల సామర్థ్యం గల ఈఎన్‌టీ ఆసుపత్రిలో బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ బాధితుల కోసం 30 పడకలను సిద్ధం చేశారు. ఆస్పత్రిని నోడల్ కేంద్రంగా ప్రకటించిన మూడు రోజుల్లోపే ఆ 30 పడకలూ నిండిపోయాయి. దీంతో మంగళవారం 20 మంది రోగులను ఇన్ఫెక్షన్ తీవ్రత తక్కువగా ఉందని తిప్పి పంపారు. బుధవారం సైతం 70 మంది బ్లాక్ ఫంగస్‌తో ఆస్పత్రికి రాగా వారి రిపోర్ట్స్‌ను పరిశీలించిన వైద్యులు 17 మందిని అడ్మిట్ చేసుకున్నారు. దీంతో మొత్తం రోగుల సంఖ్య 51 మందికి చేరింది. మరో 50 పడకలను సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ వసతులు లేకపోవడంతో వైద్యులు తలలు పట్టుకుంటున్నారు. ఈ చికిత్సకు కావాల్సిన పరికరాలను పంపాలని కోరుతూ టీఎన్‌ఎంఎ్‌సఐడీసీకి ఈఎన్‌టీ పాలకవర్గం ఇండెంట్‌ను పంపింది. బుధవారం సాయంత్రం వరకూ ఎలాంటి యంత్రాలూ రాలేదు.
ఆంధ్ర రోగులకు నో అడ్మిషన్!
బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్‌తో ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న రోగులను కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిలో చేర్చుకోవట్లేదు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత పెద్ద సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి బ్లాక్ ఫంగస్ రోగులు కోఠి ఈఎన్‌టీకి వచ్చారు. అడ్మిషన్ కోసం ప్రయత్నించగా బెడ్లు లేవని, ఆంధ్ర నుంచి వచ్చేవారిని అడ్మిట్ చేసుకోవడం కుదరదని సిబ్బంది చెప్పినట్లు రోగుల సహాయకులు ఆరోపించారు. దీంతో రాత్రి 7 గంటల సమయంలో.. ఆంధ్ర నుంచి వచ్చినవారు పదుల సంఖ్యలో వెనుదిరిగి వెళ్లిపోయినట్లు తెలిసింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్‌ను వివరణ కోరగా.. ఆస్పత్రిలో ఉన్న 50 బెడ్లు నిండిపోవడంతో కొంత మందిని అడ్మిట్ చేసుకోలేదన్నారు. ఏపీ నుంచి వచ్చేవారిని చేర్చుకోరాదని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలూ లేవని, అలా జరిగే అవకాశమే లేదని ఆయన వివరించారు. రోగుల తాకిడి పెరిగినందున గురువారం నుంచి పడకల సంఖ్యను 100కి పెంచుతున్నట్టు చెప్పారు.
